
సాక్షి, హైదరాబాద్: వాన.. మెట్రోకు కాసుల వర్షం కురిపించింది. శుక్రవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ గంటల తరబడి ట్రాఫిక్‌జామయ్యాయి. దీంతో ప్రయాణికులు మెట్రోబాట పట్టారు. గతంలో ఒక్కరోజే 2.89 లక్షల మంది ప్రయాణించినట్టు రికార్డు ఉండగా శుక్రవారం ఆ రికార్డును అధిగమించి 3.06 లక్షల మంది ప్రయాణించారు. ముఖ్యంగా నగరంలోని హైటెక్‌సిటీ, దుర్గంచెరువు, మాదాపూర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిగంటలపాటు ఓలా, ఊబెర్ సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని సాప్ట్‌వేర్ సంస్థలు కూడా రెగ్యులర్ బస్సు, కార్ సర్వీసులను రద్దు చేశాయి. ఐటీ ఉద్యోగులతోపాటు ఇతరులంతా మెట్రోలో ప్రయాణించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపారు. సమయం పొడిగించి రాత్రి 11–45 గంటల వరకు చివరి రైల్‌ను నడిపారు. దీంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య పెరిగింది.
వారానికి 8 వేల నుంచి 10వేలు....
మెట్రోకు ప్రజాదరణ బాగా పెరుగుతోంది. దీనిని రుజువు చేస్తూ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ప్రతి వారం 8 వేల నుంచి 10 వేల వరకు పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. అధిక శాతం మంది ప్రతిసారీ క్యూలైన్‌లో నిల్చుని టికెట్ తీసుకునే అవసరం లేకుండా ప్రవేశపెట్టిన స్మార్ట్‌కార్డులను తీసుకుని ప్రయాణిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment