
హైదరాబాద్: హైటెక్ సిటీలో వంద గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పొయ్యిలో పడ్డ ప్లాస్టిక్ కవర్‌తో చెలరేగిన మంటలు వలస కూలీలకు బూడిదను మిగిల్చాయి. గుడిసెలతోపాటు వాటిలో నిల్వ చేసుకున్న నిత్యావసరాలు, బట్టలు కాలిపోవడంతో వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో గురువారం ఉదయం 9.30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెం దిన వలస కూలీల బృందం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్లాస్టిక్ కవర్ అంటుకోవడంతో మంటలు చేలరేగాయి. మాదాపూర్ ఫైర్‌స్టేషన్ అధికారి పర్యవేక్షణలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తినష్టం దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని, వందకు పైగా గుడిసెలు కాలిపోయాయని తెలిపారు.
ఉలిక్కిపడ్డ పత్రికానగర్
ఐటీ కారిడార్ నడిబొడ్డులో, పెద్ద పెద్ద కంపెనీలు, భవనాల మధ్యలో మంటలు భారీస్థాయిలో చెలరేగడంతో స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. గాలి వాటానికి మం టలు తమవైపు వస్తాయోనని కార్యాలయాలు, అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుం దోనని ఆలోచించేలోపే 100 గుడిసెలకు పైగా కాలి బూడిద కావడంతో ఆ ప్రాంతం పొగమయంగా మారిపోయింది.
నిరాశ్రయులైన 300 మంది కూలీలు
ఒడిశా, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఆరేళ్ల నుంచి గుడిసెలను ఏర్పాటు చేసుకొని మాదాపూర్ పరిసరాల్లో రోజు కూలి పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో వారు దాచుకున్న నగదు, చిన్న చిన్న బంగారు, వెండి ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఉదయమే అందరూ కూలీ పనులకు వెళ్లడంతో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా గుడిసెలు తగలబడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పునరావాసం కల్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment