యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్ పార్కులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్‌టైల్ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన టెక్స్‌టైల్ దిగ్గజ కంపెనీ యంగ్వాన్ కార్పొరేషన్ రూ.900 కోట్లతో మెగా టెక్స్‌టైల్ పార్కులో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు బుధవారం కేటీఆర్ సమక్షంలో తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘గుజరాత్ లో 2017లో జరిగిన టెక్స్‌టైల్ సమ్మిట్‌లో యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్‌తో సమావేశమై, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, టెక్స్‌టైల్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించాం. రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుంగ్ సానుకూలత వ్యక్తం చేశారు. యంగ్వాన్‌తో టెక్స్‌టైల్‌కు మహర్దశ పట్టనుంది’అని అన్నారు.
13 దేశాల్లో యంగ్వాన్ కార్యకలాపాలు
టెక్స్‌టైల్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో యంగ్వాన్ కార్పొరేషన్ ఒకటని, ప్రస్తుతం బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియా వంటి 13దేశాల్లో తమ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కిసాక్ సుంగ్ వెల్లడించారు. రూ.900 కోట్ల పెట్టుబడికి సంబంధించి బుధవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఒప్పందం కుదరగా, 290 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను యంగ్వాన్ కార్పొరేషన్ ప్రతినిధులు అందుకున్నా రు. దీని ద్వారా 12వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, కొరియాలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్, గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ కొరియా ఇన్ హైదరాబాద్ సురేష్ చుక్కపల్లి, టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ టెక్స్‌టైల్ పార్కు సందర్శన..
సాక్షి, వరంగల్ రూరల్: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని బుధవారం దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఏడుగురు ప్రతినిధుల బృందం.. తమ కంపెనీకి కేటాయించిన స్థలంలో జరుగుతున్న పనుల గురించి టీఎస్‌ఐఐసీ అధికారులను అడిగి తెలుసుకుంది. అధికారులు ఇచ్చిన వివరణపై కొరియా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment