
తెలంగాణ ఎంసెట్‌కు భారీ ఏర్పాట్లు
మే 14వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్-2015కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు పేర్కొన్నారు. గతంలో కంటే అత్యధికంగా దరఖాస్తులు రావడంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఈసారి వాచీలను కూడా పరీక్ష కేంద్రంలోని అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌ను మే 14వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్లపై ఎంసెట్ కన్వీనర్ రమణరావు ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు..
రికార్డు స్థాయిలో దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో తెలంగాణ జిల్లాల నుంచి కేవలం 1.80 లక్షల దరఖాస్తులు మాత్రమే రాగా, ఈసారి ఎంసెట్ రాసేందుకు 2.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం 1,39,379 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,299 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 41 వేల మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరో 9 వేల మంది ఎంసెట్ కోసం దరఖాస్తు చేశారు. గత ఏడాది మెడిసిన్ కోసం తెలంగాణ నుంచి 54,754 మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 92,299 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 30 వేల మంది ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే.
మెడిసిన్ పరీక్షకు ప్రత్యేక ఏర్పాట్లు
పదే పదే ఎంసెట్ రాస్తున్న వారిపై, రూ. 5 వేల ఆలస్య రుసుము, రూ. 10 ఆలస్య రుసుముతో ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తున్న వారిపై ప్రత్యేకంగా పోలీసుల నిఘా ఉంటుంది. ఈ వివరాలను ఇప్పటికే రెవెన్యూ, ఇంటలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాం. గతంలో ఎంసెట్ రాసి, మంచి ర్యాంకు సాధించినా మళ్లీ ఇపుడు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను అందజేశాం. గతంలో మంచి ర్యాంకు వచ్చినా ఇపుడు ఎందుకు మళ్లీ ఎందుకు రాస్తున్నారన్న కోణంలో పరిశీలన ఉంటుంది. 20 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఇపుడు ఎందుకు ఎంసెట్ దరఖాస్తు చేశారు. ఏ ఉద్ధేశంతో రాస్తున్నారు? ఎవరి కోసమైనా రాస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతారు. అంతేకాదు ప్రతి విద్యార్థి చేతి వేళ్ల ముద్రలు పూర్తిగా తీసుకుంటాం. ముఖ్యంగా ఈసారి మెడిసిన్ పరీక్షకు హాజరయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాం.
హైదరాబాద్ కేంద్రాలపై స్పెషల్ నజర్
ఎంసెట్ నిర్వహణ విషయంలో హైదరాబాద్‌పైనే ప్రత్యేక దృష్టి సారించాం. హైదరబాద్‌లోని రీజనల్ కేంద్రాల పరిధిలో 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే లక్ష మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. పార్కింగ్ సమస్య రాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరాం. ఒక్కో ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రంలో 9 వేల మంది ఉదయం పరీక్షకు హాజరు అవుతారు. మధ్యాహ్నం ఒక్కో కేంద్రంలో 6 వేలమంది అంగ్రికల్చర్ అండ్ మెడి సిన్ పరీక్షకు హాజరు అవుతారు. మధ్యాహ్నం సమయంలో ఇంజనీరింగ్ వారు బయటకు వెళ్తుంటే అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ వారు పరీక్ష కేంద్రానికి చేరుకుంటారు. అందుకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కోరాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు మందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్..
ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం. 9:30 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లు పంపిణీ చేస్తారు. 9:55 గంటలకు ప్రశ్నాపత్రాల బుక్‌లెట్లు ఇస్తారు. 10 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ముగింపు.
మధ్యాహ్నం 2:30 గంటలకు మెడిసిన్..
మధాహ్నం 2:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. విద్యార్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 2 గంటలు ఓఎంఆర్ జవాబు పత్రాలను విద్యార్థులకు పంపిణీ చేస్తారు. 2:25 గంటలకు ప్రశ్నాపత్రాల బుక్‌లెట్లు ఇస్తారు. 2:30 గంటలకు పరీక్ష ప్రారంభం. సాయంత్రం 5:30 గంటలకు ముగింపు.
ఇవీ పరీక్ష కేంద్రాలు..
ప్రాంతం ఇంజనీరింగ్ అగ్రికల్చర్‌అండ్ మెడిసిన్
ఆదిలాబాద్ 3 3
హైదరాబాద్ జోన్-1 13 10
హైదరాబాద్ జోన్-2 14 11
హైదరాబాద్ జోన్-3 13 9
హైదరాబాద్ జోన్-4 14 10
హైదరాబాద్ జోన్-5 21 14
హైదరాబాద్ జోన్-6 13 9
హైదరాబాద్ జోన్-7 16 10
హైదరాబాద్ జోన్-8 7 5
జనగాం 3 2
కరీంనగర్ 25 12
ఖమ్మం 20 14
కోదాడ్ 7 6
కొత్తగూడెం 5 3
మహబూబ్‌నగర్ 7 8
మెదక్ 5 4
నల్లగొండ 15 9
నిజామాబాద్ 17 8
సిద్దిపేట 3 2
వికారాబాద్ 2 2
వనపర్తి 5 5
వరంగల్ 23 16
మొత్తం 251 171