
సాక్షి, హైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దు చేసిన పరిస్థితుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని విమానాశ్రాయాలపై కేంద్రం డేగ కన్ను వేసింది. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన పౌరవిమానయాన భద్రతా విభాగం (బీసీఏఎస్) విమానాశ్రయాల లోపల, బయట తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరిస్తూ అన్ని విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బోర్డింగ్ వేళల సవరణ..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమానాశ్రయాల్లోని అణువణువూ గాలించేలా బీసీఏఎస్ భద్రతా నియామావళిని జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద నుంచి విమానం లోపలికి వెళ్లేంతవరకు ప్రయాణికుల తనిఖీల్లో నిర్లిప్తత ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని బీసీఏఎస్ స్పష్టం చేసింది. ప్రయాణికుల బోర్డింగ్ వేళలను కూడా సవరించింది. ఈ మేరకు పాటించాల్సిన విధివిధానాలను ఎయిర్‌లైన్ సంస్థలకు పంపింది. దీనికనుగుణంగా బోర్డింగ్ పాస్ కోసం స్వదేశీ ప్రయాణికులు ఫ్లైట్ షెడ్యూల్‌కు మూడు గంటలకు ముందు, విదేశీయానానికి నాలుగు గంటల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది గంట, గంటన్నరలోపే ఉండగా.. దీనిని నాలుగు గంటల వరకు పెంచారు. ప్రయాణికులతో పాటు వారు వచ్చే వాహనాలపై కూడా నిఘా ఉంచాలని నిర్ణయిం చారు. ప్రయాణికులు పార్కింగ్ చేసే వాహనాలను ర్యాండమ్‌గా సమగ్ర తనిఖీలు చేయనున్నారు.
అదనపు చెక్‌పోస్టుల ఏర్పాటు..
ప్రయాణికులు, వారు సంచరించే ప్రాంతాలే కాకుండా టర్మినళ్లు, విమానాల గ్రౌండింగ్ పాయింట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని బీసీఏఎస్ సూచించింది. అవసరమనుకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఆసాంతం డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేయాలని పేర్కొంది. కార్గో టర్మినళ్ల విషయంలో కూడా ఏమాత్రం అలసత్వం చేయకుండా చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకునే మార్గంలోనూ చెక్‌పోస్టులను విస్తృతం చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాలకు వచ్చే సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20వరకు అనుమతించకూడదని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ వారమంతా విమానాశ్రయాల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అపప్రద రాకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకునేలా బీసీఏఎస్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment