
పిల్లలను మేం చదివిస్తాం
తరచూ కరుకుతనాన్ని ప్రదర్శించే పోలీసులు తమలో మానవత్వం ఉందని చాటుకున్నారు.
► మానవత్వం చాటిన పోలీసులు
► ‘ఓ నాన్నా ఇటు చూడు’ కథనానికి స్పందన
బషీరాబాద్: తరచూ కరుకుతనాన్ని ప్రదర్శించే పోలీసులు తమలో మానవత్వం ఉందని చాటుకున్నారు. సోమవారం ‘సాక్షి’ మెయిన్‌లో ‘ఓ నాన్నా ఇటు చూడు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి తాండూరు సర్కిల్ పోలీసులు స్పందించారు. ఆ పిల్లల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్‌చెడ్ అనుబంధ గ్రామం నంద్యానాయక్ తండాకు చెందిన రైతు ధన్‌సింగ్ అప్పులబాధ తాళలేక గతేడాది ఏప్రిల్ 4న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ధన్‌సింగ్, తులసి దంపతులకు ఏడుగురు సంతానం.
ఇందులో ఆరుగురు కుమార్తెలు కాగా, ఒకరు కుమారుడు. కూలి పనులు చేసినా కుటుంబాన్ని పోషించుకోలేని తులసి దుస్థితిని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి స్పందించిన తాండూరు సర్కిల్ పోలీసులు స్పందించారు. బషీరాబాద్ ఎస్‌ఐ లక్ష్మయ్య, చైల్డ్‌లైన్ ప్రతినిధులు హన్మంత్‌రెడ్డి నంద్యానాయక్ తండాకు వెళ్లి పిల్లలను సీఐ సైదిరెడ్డి వద్దకు తీసుకువచ్చారు. ఇందులో నలుగురి ఆడపిల్లలను తాండూరు కస్తూర్బా పాఠశాలలో చేర్పించగా.. మిగతా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడిని గ్రామంలోని అంగన్‌వాడీ, పాఠశాలలో చేర్పించారు. సీఐ సైదిరెడ్డి మాట్లాడుతూ పిల్లలు చదువుకునేందుకు కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు వంటివి అందిస్తామని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి వారి ద్వారా ఆర్థిక సాయాన్ని కూడా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.