భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌ | Husband Killed By Wife In Karimnagar | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య రిమాండ్‌

Published Mon, Oct 14 2019 9:14 AM | Last Updated on Mon, Oct 14 2019 9:15 AM

Husband Killed By Wife In Karimnagar - Sakshi

సాక్షి, సిరిసిల్ల: కష్టసుఖాల్లో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన భార్యే అతికిరాతకంగా భర్తను కడతేర్చగా నిందితురాలిని రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆదివారం రిమాండ్‌కు పంపారు. భార్య, పుట్టిన పిల్లలల బాగోగుకోసం ఏడారి దేశం వెళ్లి నాలుగు పైసలు సంపాదించుకొచ్చిన భర్తను ప్రేమగా చూసుకోవాల్సిన భార్య అతడిని అతికిరాతకంగా హత్య చేయడం సంచలనం సృష్టించిన విష యం తెలిసిందే. జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలి పిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి చెందిన మంచాల లక్ష్మణ్‌ (27)కు 2010లో జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన మౌనికతో 2010లో వివాహం జరిగింది. రిశికుమార్, శ్రీనిధి ఇద్దరు పిల్లలున్నారు.

కుటుంబ పోషణకోసం ఉన్న ఊరిలో పని లేక లక్ష్మణ్‌ 2014లో దుబాయి వెళ్లి ఈ ఏడాది మేలో స్వగ్రామం వీర్నపల్లికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక తన భర్తను ఎలాగైనా చంపాలనే పన్నాగం తన తల్లితో చర్చించింది. దీనిలో భాగంగా గతనెల16న కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లాలని నిర్ణయించి అక్కడే లక్ష్మణ్‌ను పథకం రచించింది. అక్కడ వీలుకాకపోవడంతో 17న వేములవాడకు వచ్చి గది అద్దెకు తీసుకున్నారు.

పథకం ప్రకారం ఇద్దరు పిల్లలకు, తల్లికి, భర్తకు భోజనం తీసుకువస్తానని చెప్పి ఆహారంతోపాటు గడ్డిమందును వెంట తీసుకు వచ్చింది. తెచ్చిన ఆహారాన్ని అందరూ తినే క్రమంలో అగ్రహారం అంజన్న దర్శనానికి వెళ్దామని భర్తను వెంట తీసుకెళ్లిన మౌనిక అక్కడ కూల్‌డ్రింక్‌ కొనుగోలు చేసి అందులో గడ్డిమందు కలిపి లక్ష్మణ్‌కు తాగించింది. దీంతో ఆగకుండా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుట్టపైకి తీసుకెళ్లి నెట్టిసింది. అప్పటికీ అతడి చావుపై అనుమానించిన మౌనిక తనవెంట తీసుకొచ్చిన కిరోసిన్‌ను లక్ష్మణ్‌పై పోసి నిప్పంటించింది.

ఆనవాళ్లు గుర్తుపట్టకుండా పర్సు, సెల్‌ఫోన్‌ తీసుకుని ఏమీ తెలియదన్నట్లు వీర్నపల్లికి చేరింది. దాదాపు ఐదు రోజులకు హత్య జరిగిన ప్రాంతంలోని ఆభయాంజనేయ స్టోన్‌ క్రషర్‌ సూపర్‌వైజర్‌ అమీర్‌ గుట్టలోపడిన శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో వీర్నపల్లి లక్ష్మణ్‌ కనబడడం లేదనే కేసు నమోదుకావడంతో వేములవాడ పరిధిలో జరిగిన హత్యకు వీర్నపల్లిలో నమోదైన కేసుకు సంబంధం ఉందా అనే క్రమంలో జరిగిన దర్యాప్తులో హత్య చేసింది మౌనిక అని తేలింది.

హత్యకు  వినియోగించిన కిరోసిన్‌ బాటిల్, సెల్‌ఫోన్, థమ్సప్‌ బాటిల్, చెప్పులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మౌనిక తల్లి సత్తవ్వ, ఇంకెవరైనా ఉన్నారా అనే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యలో పోలీసులున్నారనే దానిపై కూడా ఎస్పీ స్పందిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ సీఐ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement