
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నాయకుడు సిరిసిల్లలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను లైంగిక వేధిపులకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడు తంగళ్లపల్లి దేవయ్య మాట్లాడిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. దేవయ్య మాట్లాడుతూ ‘పెద్దలు చిక్కాల రామన్న, నర్సింగరావుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయంగా తనను అణచివేయాలని, పార్టీని బదనాం చేయాలని వారి మీద నిందారోపణలు చేయడం సరైంది కాదన్నాడు.
పెద్దలను బలిచేయడం కరెక్టు కాదని తెలిపాడు. కొంతమంది విలేకరులకు తనకు భూమి విషయమై ఐదు, ఆరునెలల నుంచి సెటిల్‌మెంట్ జరుగుతోందని, దానికోసం ఇద్దరు న్యాయవాదులు కొంతమంది పెద్దనాయకులు కలిసి రాజకీయంగా తొక్కేయాలని కుట్రపన్ని తనను ఇరికించారని పేర్కొన్నాడు.
తాను ఉన్నత విద్యావంతుడినని, సర్పంచ్‌గా కూడా పని చేశానని.. దయచేసి టీఆర్‌ఎస్ పెద్దలను ఇరికించడం సరికాదని, వారికి ఎటువంటి సంబంధం లేదన్నాడు..’ 53 సెకండ్ల నిడివి గల వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దేవయ్య జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడు మాట్లాడుతున్న వీడియో విడుదల కావడం వెనక పెద్దతలకాయల హస్తం ఉందని తంగళ్లపల్లిలో చర్చ జరుగుతోంది. భూమి వ్యవహారంలో సెటిల్‌మెంట్లు చేసిన విలేకరులు ఎవరు? దానికి సహకరించిన న్యాయవాదులు ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఈ వీడియో తీయడంతో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియోను తీసేందుకు ఎలా అనుమతించారని, పోలీసులు సహకారం అందించారని అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కీచక మాజీ సర్పంచ్ వ్యవహారంలో మరెన్ని కోణాలు, ఎంతమంది పెద్దతలకాయలు బయటకు వస్తారోనని ఆసక్తిగామారింది.
Comments
Please login to add a commentAdd a comment