భర్త దారుణ హత్య...భార్యపై అనుమానం?
బల్మూర్ (మహబూబ్‌నగర్): ఆరుబయట నిద్రిస్తున్న ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం... కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పంబ వెంకటయ్య, రాములమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భార్య, కూతురు, కుమారుడు ఇంట్లో నిద్రించగా, వెంకటయ్య (47) ఆరుబయట పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో రాములమ్మ బయటకు వచ్చి చూడగా వెంకటయ్య తీవ్ర రక్తస్రావంతో కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతడు మృతి చెందాడు.
కాగా ఈ సంఘటనపై మృతుని అన్న రామస్వామి శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. మృతుని భార్య రాములమ్మను ప్రశ్నించారు. కొంతకాలంగా వెంకటయ్య, రాములమ్మ ఘర్షణ పడుతున్నారని, శుక్రవారం ఉదయం కూడా గొడవపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దారుణం జరిగిందని చెబుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.
డాగ్ స్క్వాడ్‌తో శోధన..
జిల్లా కేంద్రం నుంచి రప్పించిన డాగ్‌స్క్వాడ్ వెంకటయ్య తలపై వేసిన బండరాయిని పసిగట్టి, మృతదేహం చుట్టూ తిరిగి మృతుని ఇంట్లోకి వెళ్లి వచ్చింది. ఇంటి పరిసరాల్లో కొద్దిసేపు తచ్చాడి, తిరిగి రాములమ్మ వద్దకు వచ్చి ఆగింది.