
హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ వరం: కేసీఆర్
హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తైన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించి వాటిలో ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయాలు, వినోద కేంద్రాలు పెట్టాలని భావిస్తోంది.
రెవెన్యూ అధికారులతో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ వరమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. హుస్సేన్ సాగర్ ను మంచినీటి చెరువుగా మారుస్తామని ఉద్ఘాటించారు.