సారు చెప్పింది ఒకటి... వీళ్లు చేస్తోంది మరోటి
నాయకులంతా కలిసి పనిచేయాలని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత
ఫ్లెక్సీలు చించుకుని, బురద జల్లుకుంటున్న జిల్లా నాయకులు
హుజూర్‌నగర్‌లో చర్చనీయాంశమవుతున్న ఫ్లెక్సీల వివాదం
నాయకుల మధ్య సమన్వయ లోపంతో కార్యకర్తల్లో నిర్వేదం నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఘటన పార్టీ నేతల మధ్య ఐక్యత వట్టిమాటేనని చెబుతోంది. వివరాల్లోకి వెళితే....రాష్ట్ర ఐడీసీ డెరైక్టర్, టీఆర్‌ఎస్ నాయకుడు సాముల శివారెడ్డి హుజూర్‌నగర్ పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న మిషన్ కాకతీయ పథకం వివరాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి చిత్రపటాలతో పాటు తన చిత్రపటాన్ని ముద్రించి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏం చేశారో కానీ... తెల్లారేసరికి చినిగిపోయి, బురద కొట్టుకుని కనిపించాయి. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్ వద్ద కటౌట్‌తో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఇందిరాసెంటర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని చిత్రపటాలకు బురదజల్లారు.
దీనిని గమనించిన సాముల అనుచరులు ఇందిరాసెంటర్‌లో ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం గమనార్హం. అయితే, ఈ ఫ్లెక్సీల వివాదం హుజూర్‌నగర్ పట్టణంలో, నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ కేడర్ ఈ ఘటనతో నిర్వేదంలో పడిపోయింది. ఇప్పటికే నియోజకవర్గంలో రెండు గ్రూపులు, మూడు ముఠాలుగాా ఉన్న టీఆర్‌ఎస్ నేతల మధ్య ఐక్యతకు ఇది మరింత భంగం కలిగిస్తుందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు నాయకులకు ఎక్కడం లేదని, ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారని పార్టీ కార్యకర్తలంటున్నారు. ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే దిశలో అందరూ కలిసి పనిచేయాల్సిన అంశాన్ని వారు గుర్తుచేస్తున్నారు.