- సీఎం కేసీఆర్‌కు తెలిపిన స్వీడన్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రోజూ ఉత్పత్తవుతున్న చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు స్వీడన్‌కు చెందిన ‘బిజినెస్ అండ్ గ్రీన్ టెక్నాలజీ ప్రమోషన్’ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ రామన్ నాగరాజన్, కన్సల్టెంట్ డయానా మిల్లర్స్ డాల్సీయో, వ్యర్థాల నిర్వహణ నిపుణురాలు టోవ్ ఐర్‌బ్లాడ్‌ల బృందం బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఈ మేరకు తమ ప్రతిపాదనలను తెలిపారు.
హైదరాబాద్ నుంచి రోజూ ఉత్పత్తి అవుతున్న 4,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి 108 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశముందని సీఎంకు వివరించారు. 1,500 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఏడీబీ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తెలుపుతామని కేసీఆర్ సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు.