
గొప్ప చరిత్రల సృష్టికి అక్షరమే పునాది
ఆర్థిక మంత్రి ఈటల వ్యాఖ్య
ప్రారంభమైన 30వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్
హైదరాబాద్: ‘కదిలేది.. కదిలించేది... పెను తుపాను సృష్టించేది అక్షరమే’అన్న చెరబండ రాజు మాటలు నిత్య సత్యమేనని, ప్రపంచంలో ఎన్నో గొప్ప చరిత్రల సృష్టికి పునాది అక్షరమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. గురువారం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన 30వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ నేడు ప్రపంచంలో డిజిటల్ పరిజ్ఞానం వేగవంతంగా ముందుకు వస్తున్నప్ప టికీ పుస్తకాల ప్రాధాన్యం మాత్రం తగ్గలేదన్నారు. ప్రపంచానికి గొప్ప సాహితీవేత్తలను అందించిన ఘనత తెలంగాణాదే అన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్రలను అందించేది పుస్తకమే అన్నారు. పుస్తకాలే తెలంగాణ పునాదులుగా పనిచేశాయన్నారు.
పుస్తకాలే జ్ఞాన దేవాలయాలు: రాములు
సమాజంలో పుస్తకాలే జ్ఞాన దేవాలయాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రధానంగా దోహదపడేది పుస్తకమే అన్నారు. పుస్తకం అనేది జ్ఞాన నిధి.. రేపటి భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఏడీజీ హెడ్ ఆఫ్ పబ్లికేషన్ డాక్టర్ సాధన గౌడ్, ఎమ్మెల్యే పుట్ట మధు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రాజు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కార్యదర్శి కె.చంద్రమోహన్, కన్వీనర్ ఎస్.మధు తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యతతోనే.. బంగారు తెలంగాణ: లక్ష్మణ్
సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆచరణలో సాధ్యమవు తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పుస్తకాలే మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. అనేక సంచార జాతుల బతుకులను, జీవన విధానాలను పుస్తక రూపంలో అందించాలని కోరారు. ఎన్టీఆర్ స్టేడియం మైదానాన్ని ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా క్రీడా మైదానంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.