
ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన గచ్చిబౌలి మెయిన్ రోడ్డు
వర్షం కురిస్తే నగరం వెన్నులో వణుకు పుడుతుంది. ముంపుతో జనజీవనం అల్లాడుతుంది. వరదతో కనీసం పది రోజుల పాటు నివాసాలకు జల దిగ్భందం తప్పని పరిస్థితి. ఇలాంటి కాలనీ సిటీలో భండారీ లే అవుట్ ఒక్కటే ఉండేది. ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు గ్రేటర్ నలుదిక్కులా ముంపు ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. నాచారం, ఉప్పల్ దీప్తిశ్రీనగర్, రామంతాపూర్ రవీంద్రకాలనీ, కుత్బుల్లాపూర్‌లోని కొన్ని కాలనీలు నీట మునిగి చెరువులను తలపించాయి. ఇలాంటి ముంపు ముప్పును తప్పించేందుకు సిటీకి సూరత్ తరహా మాస్టర్ ప్లాన్ అవసరమంటున్నారు నిపుణులు. ఎన్నోసార్లు వరద దెబ్బలు తిన్న సూరత్.. పాఠాలు నేర్చుకుని తీరైన ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ అమలు చేసిన విధానాలు మనకూ అమలు చేయాలంటున్నారు.
సాక్షి,సిటీబ్యూరో: భారీ వర్షం కురిసిన ప్రతిసారీ గ్రేటర్ పరిధిలోని నదీంకాలనీ.. భండారీ లేఅవుట్.. నాచారం.. ఉప్పల్ దీప్తిశ్రీనగర్.. రామంతాపూర్ రవీంద్రకాలనీ.. హబ్సీగూడ తదితర ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలు నీట మునిగుతున్నాయి. ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ సమస్యలకు సూరత్ నగరంలో అమలు చేస్తోన్న మాస్టర్‌ప్లాన్ చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. గత వందేళ్లుగా సూరత్ 25 సార్లు వరదల తాకికిడి గురైంది. కానీ ఇప్పుడు తీరైన పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులతో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనేపథ్యంలో సూరత్‌లో అమలవుతోన్న పట్టన ప్రణాళిక, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న నష్ట నివారణ చర్యలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ నగరాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ సైతం ఆదర్శ నగరంగా కొనియాడడం విశేషం. ఈ నేపథ్యంలో సూరత్‌లో అమలవుతోన్న తీరైన పట్టణ ప్రణాళిక, ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ అంశాల్లో సూరత్ ఆదర్శం..
⇒ తరచూ వరద తాకిడికి గురవుతోన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను తొలుత గుర్తించి ప్రత్యేకంగా మ్యాపింగ్ చేశారు.
⇒ ప్రధానంగా నగరాన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న సెస్మిక్‌జోన్, ముంపు ప్రాంతాలు, వరద తాకిడి ఉండే ప్రాంతాలుగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి వేర్వేరుగా అనుమతులు జారీ చేస్తున్నారు. ఏ ప్రాంత పరిస్థితిని బట్టి ఆ ప్రాంతానికే వర్తించేలా నిబంధనలు రూపొందించారు.
⇒ ఈ ప్రణాళిక అమలుకు వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఓ ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించారు.
⇒ ముంపు ప్రాంతాలు, ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో నూతనంగా భవన నిర్మాణ అనుమతుల జారీని నిలిపివేశారు.
⇒ భవన నిర్మాణ అనుమతులను కట్టుదిట్టం చేశారు. సెల్లార్లను ఖాళీగా ఉంచడం, పార్కింగ్‌కు మాత్రమే కేటాయించేలా చూస్తున్నారు.
⇒ ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో ఉన్న భవనాలను ఎలివేటెడ్ నిర్మాణాలుగా మార్చారు. అంటే కింది అంతస్తును పార్కింగ్‌కు వదిలివేసి.. మొదటి అంతస్తు.. ఆపైన మాత్రమే నివాసాలుండేలా చర్యలు తీసుకున్నారు.
⇒ భారీ మురుగునీటి పైపులైన్లు, నాలాలు, ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇలా సుమారు 50 వేల భవనాలను తొలగించినట్లు అంచనా.
⇒ ముంపు ప్రాంతాల్లో స్థానికులకు ఆపదవచ్చిన ప్రతీసారీ ఆదుకునేందుకు, తలదాచుకునేందుకు ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేశారు.
⇒ భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు.
గ్రేటర్‌లో ప్రస్తుత దుస్థితి ఇదీ..
⇒ మహానగరంలో 1500 కి.మీ. మార్గంలో విస్తరించిన నాలాలపై సుమారు పదివేల అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయి.
⇒ నాలాల ప్రక్షాళన, నిడివి పెంచడం, వరద నీటి కాల్వల నిర్మాణాలకు సంబంధించి కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల అమలుకు రూ.12 వేల కోట్ల నిధులు అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న కారణంగా బల్దియా ప్రేక్షకపాత్రకే పరిమితమైంది.
⇒ వరద, ముంపు సమస్యలను ఎదుర్కోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టే విషయంలో ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది.
⇒ ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని నివాసాలు చాలావరకు చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లోనే విస్తరించాయి.
⇒ గ్రేటర్‌లో ప్రస్తుతం ముంపు, లోతట్టు, వదర ప్రభావిత ప్రాంతాల్లోనూ 30 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా నిబంధనలు లేవు.
⇒ భవన నిర్మాణ అనుమతులను తక్షణం జారీచేసే విషయంలో అవినీతి, బంధుప్రీతి, రాజకీయ ఒత్తిడులు అధికంగా పనిచేస్తున్నాయి.
⇒ వరద ప్రభావిత ప్రాంతాల్లో భవనాలను నిర్మించే సమయంలో వాటిని తనిఖీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ వద్ద నిపుణులు, ఆయా నిర్మాణాలను అడ్డుకునే సిబ్బంది కరువయ్యారు.
⇒ నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో రాజకీయ ఒత్తిడులు, కోర్టు కేసులు ప్రతిబంధకంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment