
దేశ, విదేశీ ప్రతినిధుల రాకకోసం నగరం ముస్తాబైంది. సిటీలోని రహదారులు సరికొత్త మెరుపులు సంతరించుకున్నాయి. రోడ్ల పక్కనున్న గోడలు, వంతెనలు అందమైన చిత్రాలతో నిండిపోయాయి. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంఫ్ కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సర్వాంగ సుందరంగా మార్చేశారు. హైటెక్స్ పరిసరాలను సరికొత్త విద్యుత్ కాంతులతో నింపేశారు. ఈ మార్గంలోని ప్రతి మొక్కా, చెట్టూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. సదస్సుకు వచ్చే అతిథులను ఆకర్షించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా రూ.56 లక్షల ఖర్చుతో ఈ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. హైటెక్స్‌కు ప్రధాన మార్గమైన మినీ చార్మినార్‌కు శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేవారంతా దేశ, విదేశీ ప్రతినిధులు. వివిధ దేశాల్లోని విద్యుత్ వెలుగులు చూసిన వారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు రాత్రులను రంగుల హోలీగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. వీధిదీపాల స్థానంలోని ఎల్‌ఈడీలతో రేయి పగలుగా మార్చేస్తున్నారు. సదస్సు ప్రతినిధుల మనసులు దోచుకునేందుకు రోజురోజుకూ మారుతున్న ఆలోచనలతో మరింతగా రిహార్సల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్) జరుగనున్న హైటెక్స్ పరిసరాల్లో సరికొత్త విద్యుత్ కాంతులు రానున్నాయి. దారి పొడవునా ఎల్‌ఈడీ దీపాలే కాక మరింత ప్రత్యేకంగా సీతాకోక చిలుక ఆకారంలో కనబడేలా వెలుగులిచ్చే బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు పుట్ట, ట్రాఫిక్ ఐలాండ్లు, ఫ్లై ఓవర్లతో సహా రహదారులు మొత్తం విద్యుత్ కాంతులతో కనువిందు చేయనున్నాయి.
ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు వివిధ రకాల రంగుల బల్బులకు సిద్ధమైన అధికారులు.. అవేవీ నచ్చక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల ‘పవర్ క్యాన్ల’ ద్వారా నిమిష నిమిషానికీ రంగులు మారి వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నుంచి నాలుగు పవర్ క్యాన్లను ఏర్పాటు చేస్తారు. ఈ క్యాన్ల నుంచి ఎరుపు, పుసుపు, గులాబీ, ఆకుపచ్చ, ఆరెంజ్, నీలం తదితర రంగుల కాంతులు ప్రసరిస్తాయి. దాంతో పరిసరాలు మొత్తం కాంతివంతమవనున్నాయి. ఈ ప్రత్యేక రంగులిచ్చేందుకు వినియోగిస్తున్న పవర్ క్యాన్ల అద్దె రోజుకు ఒక్కోదానికి రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం 500 పవర్ క్యాన్లను హైటెక్స్ పరిసరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక రంగుల కాంతుల కోసమే రూ. 56 లక్షలు ఖర్చు చేస్తున్నారు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుంచి మినీ చార్మినార్ వరకు, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ నుంచి కొత్తగూడ జంక్షన్ మీదుగా మినీ చార్మినార్ వరకు, మినీ చార్మినార్ నుంచి న్యాక్ భవనం వరకు 27 నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక రంగుల కాంతులే కనిపించనున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మినీ చార్మినార్‌కు మరింత శోభ
హైటెక్స్‌కు ప్రధాన ఆకర్షణ అయిన మినీ చార్మినార్ వద్ద మరింత శక్తివంతమైన పవర్ క్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్ ఒక్కో స్తంభానికి నాలుగు పవర్ క్యాన్లు ఉంచి ఘడియకో డిజైన్ మారుతూ చూపరులను ఆకట్టుకునేలా కాంతులు ప్రసరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశంలోని ముంబై, బెంగళూర్, కోల్‌కత్తా నగరాల్లో జరిగిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా చేసిన ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ హంగులు అద్దుతున్నారు. ఆ నగరాలతో పాటు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్న ఏజెన్నీ ఈ ఏర్పాట్లు చేస్తోందని సంబంధిత అధికారి తెలిపారు. పుష్పాలు వలయాకారంలో తిరుగుతున్నట్లు కనబడేందుకు డీఎన్‌ఎఫ్ లైట్లు వినియోగిçస్తున్నారు. మినీ చార్మినార్ కాంతులకు పూర్తిగా జనరేటర్‌ను వినియోగించనున్నారు. అద్భుతమైన కాంతులతో చేసే ఏర్పాట్లకు ఎలాంటి విద్యుత్ అవాంతరాలు లేకుండా ఉండేందుకు పూర్తిగా జనరేటర్లనే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
లండన్ వంటి నగరాల్లో అంతర్జాతీయ సదస్సులు జరిగితే ప్రతి ఇంట్లోనూ జెండాలు ఎగురవేస్తూ స్వాగతాలు పలుకుతారని, అలాంటిది మన నగరంలో జరిగే సదస్సు ప్రత్యేకత కనబడేలా, విద్యుత్ కాంతులతో అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో జరిగిన సీఓపీ–11, మెట్రోపొలిస్ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రత్యేక విద్యుత్ కాంతులకు ఇంతపెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నందున అందరికీ హైదరాబాద్ పర్యటనను ఒక రంగుల కలగా మార్చేందుకు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. హెచ్‌ఐసీసీ పరిసరాలతో పాటు ఇవాంకా ట్రంప్ బసచేసే వెస్టిన్ హోటల్ పరిసరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు విందు ఇస్తున్న ఫలక్‌నుమా ప్యాలెస్, రాష్ట్ర ప్రభుత్వ విందు వేదిక అయిన గోల్కొండ కోట మార్గాల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment