సాక్షి, హైదరాబాద్ : జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
ఫలక్ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం
ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు ఫోన్ కాల్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఫోన్ కాల్ పాతబస్తీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాంకా ట్రంప్ పర్యటన ముగియగానే పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment