
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్యాలెస్‌కు వెళ్లే రూట్‌లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి రహదారులను జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు.
తెలంగాణ సీఎస్ ఎస్‌పి.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ యోగితా రాణాలు ప్యాలెస్‌లో ఏర్పాట్లతో పాటు బందోబస్తును పర్యవేక్షించారు. రైల్వే పోలీసులు కూడా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌లో, దక్షిణ మండలం పోలీసులు ప్యాలెస్ పరిసరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 45 బస్సులలో అతిథులు విచ్చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 520 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు సోమవారం సాయంత్రం కాన్వాయ్ రిహర్సల్స్ చేయనున్నారు. ప్యాలెస్‌కు అతిథులు విచ్చేసే సమయంలో ప్రధాన రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నిఘా పెంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు. డెలిగేట్స్ బస చేసే 21 హోటల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని... నగరంలో 10 వేల 4 వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు .
Comments
Please login to add a commentAdd a comment