సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలోని ఫలక్ నుమాలో ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల సహకారంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా నగరంలో ఈనెల 28నుంచి అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతాలపై పోలీస్ నిఘా పెంచారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పాతబస్తీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పలువురి అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే అంతర్జాతీయ సదస్సు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఇక ఇవాంకా ట్రంప్ చార్మినార్ సందర్శనపై ఇప్పటివరకూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు.
సీపీ మాట్లాడుతూ...‘28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని, ఇవాంకా ట్రంప్‌తో పాటు 100మంది ప్రత్యేక అతిథులు హాజరు అవుతున్నారు. అలాగే వారికి ఫలక్ నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు గంటలపాటు ప్రధాని ప్యాలెస్‌లో ఉండే అవకాశం ఉంది. ఐఎస్‌డబ్ల్యూ (రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్), యుఎస్ సీక్రెట్ సర్వీస్ వారితో ...ఇంటర్నల్ మీటింగ్‌కు భద్రత పెంచాం. రెండువేలమందితో బందోబస్తు ఏర్పాటు చేశాం, హోంగార్డు నుంచి కమిషనర్ స్థాయి అధికారులు వరకూ అంతా ఆన్‌డ్యూటీలో ఉంటారు.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment