కళ్ళు చెదిరే...మనసు మురిసే..! | Hyderabad is ready to welcome Ivanka Trump | Sakshi
Sakshi News home page

కళ్ళు చెదిరే...మనసు మురిసే..!

Nov 27 2017 10:10 AM | Updated on Aug 15 2018 2:32 PM

Hyderabad is ready to welcome Ivanka Trump - Sakshi - Sakshi

విద్యుత్‌ దీపాల వెలుగులో తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంఫ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌ ముస్తాబైంది. దీంతో ఈ భవనంపై ప్రపంచ ప్రజల దృష్టి పడింది. ప్యాలెస్‌లో అంత ప్రత్యేకత ఏంముందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ అద్భుత భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, చాంద్రాయణగుట్ట/చార్మినార్‌

నిజాం నవాబుల కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత వాస్తు నైపుణ్యంతో ఉంటుందీ ప్యాలెస్‌. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ‘ఆకాశ దర్పణం’ అని అర్థం.

ప్రాణం పోసిన ‘పైగా’లు..
ఆరో నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌¯ హయాంలో ఇతడి బావ.. సంస్థానం ప్రధాని అయిన పైగా వంశస్తుడు సర్‌ వికారుల్‌ ఉమ్రా (1893–1901) ఫలక్‌నుమాకు నిర్మాణానికి 1884 మార్చి 3న శంకుస్థాపన చేశారు. భవనం సగ నిర్మాణం పూర్తికాగానే వికారుల్‌ కుటుంబం 1889 డిసెంబర్‌లో ఇందులోకి మారింది. అప్పటికి ప్రస్తుత ప్రధాన భవనం నిర్మాణం కానందున కుటుంబమంతా ‘గోల్‌ మహల్‌’లో ఉండి ప్రధాన ప్యాలెస్‌ను నిర్మించారు. మొత్తం భవనం 1893 నాటికి పూర్తయ్యాయి. ప్యాలెస్‌ ఇండో అరేబియన్, పర్శియన్, ఇటాలియన్‌ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. ఇందులో వాడిన పాలరాయిని ఇటాలీ నుంచి, చెక్కను ఇంగ్లాండ్‌ నుంచి తెచ్చారు. గోడలు, పైకప్పుపై ఫ్రెంచ్‌ కళాకారులతో అందమైన చిత్రాలు గీయించారు.

తాజ్‌ ఫలక్‌నుమాగా..
ఏడో నిజాం అనంతరం ప్యాలెస్‌ ఇతడి మనవడు బర్కత్‌ అలీఖాన్‌ ముకరంజా ఆధీనంలోకి వచ్చింది. 1948 నుంచి ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా తాజ్‌ గ్రూప్‌నకు 30 ఏళ్ల పాటు అద్దెకిచ్చింది. తర్వాత హోటల్‌కు అనువుగా కొన్ని మార్పులు చేసి 2010 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్‌లో ప్రధాన సూట్స్‌తో పాటు 60 గదులను వినియోగంలో ఉన్నాయి. స్పెషల్‌ బాత్, స్పా, హెల్త్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్, స్మోకింగ్‌ ఏరియా, ఇటాలియన్‌ రెస్టారెంట్‌తో పాటు హైదరాబాద్‌ స్పెషల్‌ (ఆదా) రెస్టారెంట్‌ ఉన్నాయి. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కూర్చీలు అతిథులకు అందుబాటులోకి తెచ్చారు.

అతిపెద్ద డైనింగ్‌ హాల్‌..
ఆరో నిజాం సంస్థానానికి 1898లో వచ్చిన ఐదో కింగ్‌జార్జి ఆడ్వర్డ్‌  పరివారానికి విందు ఇచ్చేందుకు ప్యాలెస్‌లో 101 అతిపెద్ద డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి ఇటాలియన్‌ ఫర్నిచర్‌తో 33 మీటర్ల పొడవుండే ఈ డైనింగ్‌ హాల్‌ దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటిది. నిజాం ఈ డైనింగ్‌ హాల్‌లోనే తన బంధువులు, కుటుంబ సభ్యులు, బ్రిటీష్‌ ప్రధాన అధికారులు విందు చేసేవారు. ప్రస్తుతం ఈ టేబుల్‌పై విందు చేయాలంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు చిల్లించాల్సిందే. 

              ప్యాలెస్‌ ప్రధాన ముఖద్వారం.. అతిపెద్ద డైనింగ్‌ హాల్‌..
స్పెషల్‌ గేమ్స్‌ రూమ్‌..  
నిజాం లండన్‌ నుంచి తెప్పించిన స్నూకర్‌తో పాటు ఇటలీ నుంచి తెప్పించిన చెస్‌ గేమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కాను సైతం అతిథులకు అందిస్తున్నారు. ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్‌ కాయిన్స్‌ ఉన్నాయి.  

ఆరో నిజాం చేతికి ఇలా వచ్చింది..
సంస్థాన ప్రధాని అయినప్పటికీ వికారుల్‌ ప్యాలెస్‌ నిర్మాణం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్టు చరిత్రకారుల కథనం. తన బావమరిది, ఆరో నిజాంను విందుకు ఆహ్వానించి తన అప్పుల విషయం ప్రస్తావించాడని, దీనికి నిజాం రూ.60 వేలు చెల్లించి భవనాన్ని తనకు రాయించుకున్నట్టు చెబుతారు. ఇలా 1897లో ప్యాలెస్‌ ఆరో నిజాం సొంతమైంది. తర్వాత కొన్ని మార్పులు చేసిన ‘రాయల్‌ గెస్ట్‌హౌస్‌’గా వినియోగించేవారు. ఇతడి పాలనలో దేశ విదేశాల అతిథులు, వివిధ రాజ్యాల పాలకులు సంస్థానానికి వచ్చినప్పుడు ఈ ప్యాలెస్‌లోనే విడిది చేసేశారు. అలా ఐదో కింగ్‌ జార్జ్, ఎనిమిదో కింగ్‌ ఎడ్‌వర్డ్, వైస్రాయ్‌ లార్డ్‌బెల్, స్వాతంత్య్రానంతరం హైదారాబాద్‌ తొలి గవర్నర్‌ సి.రాజగొపాలాచారి, భారత మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ ఇందులో విడిది చేశారు. ఏడో నిజాం పాలనలో భవనానికి యూరోపియన్‌ స్టైల్‌లో కొన్ని మార్పులు చేశారు.

ఆదా రెస్టారెంట్‌..
ప్యాలెస్‌లో ఆదా రెస్టారెంట్‌కు తాజ్‌ గ్రూపు ప్రత్యేక స్థానమిచ్చింది. ఇందులో హైదరాబాద్‌ రుచులతో పాటు ఆంధ్రా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌తో పాటు పక్కనే చెలాస్‌రే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.  

‘‘1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్‌ వినియోగించారు.
భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్‌ బోర్డు ఇక్కడ చూడవచ్చు.
ఈ భవనానికి విద్యుత్తు అందించేందుకు ఆరోజుల్లో బొగ్గు యంత్రాలను ఉపయోగించేవారు. యంత్రాలున్న ప్రాంతాన్ని ‘ఇంజన్‌ బౌలి’ అనేవారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఇదే పేరుతో పిలుస్తున్నారు’’  

నిజాం సూట్‌..
ప్యాలెస్‌లో అన్నింటి కంటే ఖరీదైనది ‘నిజాం సూట్‌’. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ప్యాలెస్‌లో 204 నంబర్‌గా కేటాయించారు. ఈ సూట్‌లో నిజాం ఉపయోగించిన వస్తువులు ఉంటాయి. ఈ సూట్‌ నుంచి జంట నగరాల అందాలను తిలకించవచ్చు. ఇంకా అక్బర్‌ సూట్, షాజాది సూట్‌ వంటి దాదాపు 60 సూట్‌రూలున్నాయి. వీటి అద్దె రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది.  

‘‘ప్యాలెస్‌లోని బిలియర్డ్స్‌ టేబుల్‌ చాలా అరుదైనది. ఇలాంటిది ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్‌ లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌లోను, మరొకటి ఫలక్నుమా ప్యాలెస్‌లో మాత్రమే ఉంది’’  

పైగాలు నిజాం సంస్థానంలో అత్యంత ధనవంతులు. వారు సైన్యాధిపతులుగా ఉండేవారు. వికారుల్‌ ఉమ్రా మాత్రం ప్రధానిగా నియమితుడయ్యాడు. ఇతడు ఉండేందుకు రాజమహళ్లను మించిన అద్భుత భనవం కట్టాలని ఫలక్‌నుమా ప్యాలెస్‌ నిర్మించాడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement