సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్, రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం చోటు చేసుకున్న దారుణ హత్యను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలో ఇలాంటి ఉదంతాలకు తావు లేకుండా చూడాలని, ఇందుకోసం బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం, దాడి తదితర కేసులపై ఇన్‌స్పెక్టర్లు నిత్యం సమీక్షిస్తూ నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. బెయిల్‌పై వచ్చిన వారి కదలికలను ఓ కంట కనిపెట్టాలని సూచించారు. ఈ మేరకు గురువారం సిబ్బందిని ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. ఇటీవల పదోన్నతులు, బదిలీల నేపథ్యంలో పలువురు ఇన్‌స్పెక్టర్లు కొత్తగా వచ్చిన నేపథ్యంలోనే కొత్వాల్ తన వాయిస్ మెసేజ్‌లో వారికి దిశా నిర్దేశం చేశారు.
ఆయన సందేశంలోని మాటలివి...
‘సిటీ పోలీస్‌లోకి అనేక మంది ఇన్‌స్పెక్టర్లు కొత్తగా వచ్చారు. వారందరికీ సుస్వాగతం. హైదరాబాద్ పోలీసు అనేది దేశంలోనే ఉత్తమమైన విభాగం. ఇక్కడ పని చేయడం అరుదైన అవకాశం. ఇందులోనే ఓ బాధ్యత కూడా నిమిడి ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఇక్కడ లేదు. పోలీసు అధికారుల ప్రవర్తన పారదర్శకంగా, వివాదాలకు దూరంగా ఉండాలి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కేవలం మీరు మాత్రమే కాదు.. మీ కింద పని చేసే వారూ అవినీతికి దూరంగా ఉండేలా, నిస్ఫాక్షికంగా పని చేసేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీదే. నిర్దేశించుకున్న విధి విధానాలు, నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందే. విధులకు హాజరయ్యే పోలీసులు వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడంతో పాటు విధుల్లో బయట ఉంటే టోపీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రజలతో అత్యంత మర్యాదపూర్వకంగా మెలగాలి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్క ఇన్‌స్పెక్టర్ రానున్న రెండు రోజుల్లో పంజగుట్ట ఠాణాను సందర్శించండి. అక్కడ కనీసం రెండుమూడు గంటల గడిపి అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయండి.
దేశంలోనే రెండో ఉత్తమ ఠాణాగా గుర్తింపు పొందడం వెనుక ఉన్న కృషిని తెలుసుకోండి. రానున్న 20 రోజుల్లో అన్ని ఠాణాలను సందర్శిస్తా. పంజగుట్టలో పరిశీలించిన అంశాలు ఏ మేరకు అమలు చేస్తున్నారో పరీక్షిస్తా. రెండు వారాల్లో ఏసీపీలు, డీసీపీలు సైతం ఠాణాల సందర్శన చేయాలి. దర్యాప్తు చేసే ప్రతి కేసుకూ ఓ స్పష్టమైన, అనుమతి పొందిన యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఠాణా సందర్శనకు వచ్చినప్పుడు ఎఫ్‌ఐఆర్ నెంబర్ అడిగితే దాని యాక్షన్ ప్లాన్ చెప్పగలిగేలా పట్టు సంపాదించాలి. దర్యాప్తులో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయడం. ఈ కేసులతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్ల సంఖ్య ప్రతి వారం తగ్గాలి. అమలులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ అప్లికేషన్లు విస్తృతంగా వినియోగించుకోండి. ప్రతి శనివారం ఇన్‌స్పెక్టర్లు కోర్టు ఆఫీసర్లతో విస్తృత సమీక్ష నిర్వహించడం ద్వారా శిక్షల శాతం పెరిగేలా చర్యలు తీసుకోండి. దీనిపై ప్రతి నెలా నాకు నివేదిక పంపాలి. ఏదైనా కేసులో శిక్ష పడినట్‌లైతే ఆ విషయాన్ని వాట్సాప్ ద్వారా నేరుగా నాకే తెలియజేయండి. ట్యాబ్ వినియోగం అనేది శరీరంలో భాగంగా మారిపోవాలి. ప్రతి ఒక్కరూ టీఎస్ కాప్ యాప్ వినియోగంలో నిష్ణాతులు కావాలి. ఎప్పటికప్పుడు కొత్తగా పీడీ యాక్ట్‌లు తెరవాల్సిన ప్రతిపాదనల్ని పంపండి. ‘నేను సైతం’ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తూ వారం వారం పురోగతి ఉండేలా చూడాలి. డీసీపీల నేతృత్వంలో నిర్విరామంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టడానికి వీలుగా అవసరమైన క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించండి. ఎవరికైనా ఏదైనా అంశంపై అదనపు శిక్షణ కావాలంటే సీపీ కార్యాలయం ద్వారా ఇప్పించడానికి సిద్ధం. ఆ వివరాలు నాకు చెప్పండి. హైదరాబాద్ సిటీ దేశంలోనే బెస్ట్. మనంతో పాటు మన వారందరూ ఇక్కడే ఉంటున్నారు. దీన్ని మరింత భద్రతమైన నగరంగా మారుద్దాం. ఖాకీ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా చూస్తే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో కూడిన చిరునవ్వు వారి ముఖంలో కనిపించాలి. ఆ స్థాయికి చేరాలన్నది నా కల...అదే నా ప్రాధాన్యం... లక్ష్యం’.
విత్ బెస్ట్ విషెస్
అంజనీ కుమార్
కమిషనర్ ఆఫ్ పోలీస్
హైదరాబాద్
జైహింద్...
Comments
Please login to add a commentAdd a comment