బాహుబలి టిక్కెట్ల పేరుతో మోసం
హైదరాబాద్: బాహుబలి–2 సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం పేరుతో ఇంటర్‌నెట్‌లో ఏర్పాటు చేసిన ఓ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తమతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా సదరు వెబ్‌సైట్ తమ పేరుతోనూ టిక్కెట్లు విక్రయిస్తోందని ఏషియన్ సినిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని నమోదు చేశారు. బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా పగడ్భందీ పథకంతో రంగంలోకి దిగింది.
తమిళనాడులోని కోయంబత్తూరు చిరునామాతో ఈ నెల 7న (www. newticketr.in) పేరుతో వెబ్‌సైట్ రిజిస్టర్ చేయించింది. ఏడాది పాటు నిర్వహించేందుకు సర్వర్‌ను సైతం లీజుకు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల కోసం ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర దేశాల్లోనూ ఉన్న సినిమా «థియేటర్ల పేర్లు పొందుపరిచింది.
సాధారణ ఆన్‌లైన్ వెబ్‌సైట్ మాదిరిగానే దీనిలోకీ ప్రవేశిస్తే థియేటర్లు, వాటిలోని సీట్ల వరుసలు అన్నీ కనిపిస్తుండటంతో పాటు బుక్ చేసుకున్న వారికి కన్ఫర్మేషన్ సందేశాలు సైతం వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ రకంగా అనేక మందిని మోసం చేసిన ఈ ముఠా మూలాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దుబాయ్ కేంద్రంగా వీరు వ్యవహారాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.