సాక్షి, సిటీబ్యూరో: అన్ని శాఖలు, విభాగాలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు సమన్వయంతో పనిచేసి ఈ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాల నిర్వాహణపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ కమిషనర్లు అనిల్ కుమార్, చౌహాన్, జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుతున్నప్పటికీ ప్రతి సారి కొత్త అంశాలతో ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయల కల్పనతో పాటు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఏవిధమైన తప్పుడు ప్రచారాలు జరిగినా వాటిని నమ్మొద్దన్నారు. వాటిని పంపేవారి సమాచారాన్ని అధికారులకు అందించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామన్నారు. దీనిలో భాగంగా 254 క్రేన్‌లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని అన్ని గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. రూ.8.24 కోట్ల వ్యయంతో క్రేన్‌లు, వాహనాలు, రూ.9.20 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిమజ్జన చెరువుల క్లీనింగ్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నామని వివరించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో పారిశుధ్య నిర్వహణకుగాను గణేష్ యాక్షన్ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు రూ.కోటి రూపాయల వ్యయంతో 36,674 అదనపు లైట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమజ్జనం సందర్భంగా 115 ప్రత్యేక క్యాంపుల ద్వారా 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. ఈ ఏడాది మరింత మంది విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. దాదాపు 21 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఐదు కంపెనీల సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు నియమిస్తున్నట్లు వివరించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు గాను ఆన్‌లైన్ ద్వారా అనుమతులు పొందాలని, దరఖాస్తు చేసిన ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్‌ను జారీచేయనున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శోభాయాత్ర దారిపొడువునా పబ్లిక్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిర్ణీత సమయం కంటే ముందు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ వారు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment