‘మలుపుల’ భారం రూ.1,000 కోట్లు | hyderabad metro rail alignment change cost rs.1000 crore | Sakshi
Sakshi News home page

‘మలుపుల’ భారం రూ.1,000 కోట్లు

Published Mon, Nov 17 2014 1:18 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

‘మలుపుల’ భారం రూ.1,000 కోట్లు - Sakshi

‘మలుపుల’ భారం రూ.1,000 కోట్లు

* ఆ మొత్తాన్ని భరించనున్న తెలంగాణ ప్రభుత్వం
* మూడు చోట్ల మారనున్న మెట్రో అలైన్‌మెంట్
* రెండు కి.మీ. మార్గంలో మార్పులు, చేర్పులు
* ప్రాజెక్టు వ్యవధి మరో ఏడాది పెరిగే అవకాశం!
* రెండో దశపై చిగురిస్తున్న ఆశలు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులో మూడు చోట్ల అలైన్‌మెంట్ మారనుంది. సుమారు రెండు కిలోమీటర్ల మార్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. దీంతో తెలంగాణ సర్కారుపై రూ.వెయ్యి కోట్లు అదనంగా భారం పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.15,132 కోట్లకు చేరనుంది. గన్‌పార్క్-అసెంబ్లీ, సుల్తాన్‌బజార్‌తో పాటు ఎంఐఎం పార్టీ కోరిక మేరకు పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే.

ఆయా ప్రాంతాల్లో నూతన మార్గం ఖరారు,ఆస్తుల సేకరణ, క్షేత్రస్థాయి పరీక్షలు, స్టేషన్లు, పిల్లర్ల నిర్మాణంపై నిపుణుల బృందం కసరత్తు చేశాక ఈ అంచనా వ్యయంలో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం మార్గాల్లో 72 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం కాకుండా అలైన్‌మెంట్ మార్చితే అందుకు అయ్యే వ్యయాన్ని  ప్రభుత్వమే భరించాలని ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొన్నట్లు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మలుపులు తిరిగేది ఎక్కడంటే...
* సుల్తాన్ బజార్ నుంచి కాకుండా మెట్రో మార్గాన్ని  కోఠి ఉమెన్స్ కళాశాల వెనక నుంచి తిలక్‌పార్‌‌క, బాటా జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిప్పి కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు మళ్లిస్తారు.

* అసెంబ్లీ, గన్‌పార్క్ అమరవీరుల స్తూపాలకు నష్టం వాటిల్లకుండా నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం, దాని వెనకనున్న రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా పబ్లిక్‌గార్డెన్‌లోని లలిత కళాతోరణం ముందున్న రోడ్డు నుంచి పోలీసు క్వార్టర్లు, ఏపీ డీజీపీ కార్యాలయం మీదుగా లక్డీకాఫూల్ స్టేషన్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగిస్తారు.
    
* ఈ రెండు ప్రాంతాల్లో మారిన తాజా అలైన్‌మెంట్ ప్రకారం డిజైన్‌లు రూపొందించేందుకు ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ సంస్థలు రంగం సిద్ధం చేస్తున్నాయి.

* ఆయా ప్రాంతాల్లో అలైన్‌మెంట్ మార్పుతో సుమారు 30 నుంచి 50 కట్టడాల కూల్చివేత తథ్యమని తెలిసింది. ఇందులో 19 పోలీసుశాఖ క్వార్టర్లు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ క్వార్టర్‌తో పాటు,కోఠి ఉమెన్స్ కళాశాలలోని మూడు భవంతులను నేలమట్టం చేయాల్సి వస్తుందని హెచ్‌ఎంఆర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పబ్లిక్‌గార్డెన్ నుంచి రవీంద్రభారతి వరకు వేసిన 20 పిల్లర్లను తొలగించాలని నిర్ణయించారు.

పాతనగరంలో మార్పులు
మెట్రో మార్గం పాతబస్తీలోని దారుషిఫా-మీర్‌చౌక్-శాలిబండ మీదుగా వెళితే సుమారు 69 మసీదులు, అషురుఖానాలు, ఛిల్లాలకు నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో మెట్రో మార్గాన్ని  బహద్దూర్‌పూరా-కాలపత్తర్-ఫలక్‌నుమా మీదుగా మళ్లిం చాలని కోరుతోంది. ఇదే విషయమై చర్చిం చేందుకు 20న ప్రభుత్వం మరోమారు ఎల్ అండ్ టీ అధికారులతో సమావేశం కానుంది.

స్టేషన్లపై తకరారు
అలైన్‌మెంట్ మార్పుతో సుల్తాన్‌బజార్ స్టేషన్‌కు బదులుగా కోఠి మెట్రో స్టేషన్‌ను ఎక్కడ నిర్మిం చాలన్న అంశంపై హెచ్‌ఎంఆర్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎంజీబీఎస్‌కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది పడకుండా ఈ స్టేషన్ ఉండాలని భావిస్తున్నారు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్పుతోఅసెంబ్లీ సమీపంలో బదులుగా నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్ ఏర్పాటవుతుందని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.

200 కి.మీ. మేర మెట్రో రెండోదశ..
సుమారు 200 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మెట్రో రెండో దశపై ఆశలు చిగురిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో మెట్రో ప్రాజెక్టు ఏ ఏ మార్గాలలో అవసరమో హెచ్‌ఎండీఏ గతంలోనే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది.

2018 వరకు ఆగాల్సిందే..
మూడు ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్పుతో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, మట్టి నమూనా పరీక్షలు, హైడ్రాలిక్ టెస్టులు, పిల్లర్ల డిజైన్, ఆస్తుల సేకరణ వంటి అంశాలన్నీ తిరిగి మొదటికి రానున్న నేపథ్యంలో మెట్రో పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి. అంటే ముందుగా అనుకున్న ప్రకారం మూడు కారిడార్లలో ప్రాజెక్టు పనులు 2017 చివరి నాటికి కాకుం డా 2018 చివరికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగోల్-మెట్టుగూడా (8 కి.మీ) మార్గం (మొదటి దశ) మాత్రం 2015 మార్చి 21న ప్రారంభించనున్నారు.

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మెట్రో మార్గాలివీ..
1.బీహెచ్‌ఈఎల్-మియాపూర్-ఎల్బీనగర్
2.జూబ్లీహిల్స్-ఫలక్‌నుమా-శంషాబాద్
3.కొత్తగూడ-శిల్పారామం-నాగోల్-ఎల్బీనగర్
4.ఎల్బీనగర్-ఒవైసీ ఆస్పత్రి-శివరాంపల్లి-మెహిదీపట్నం
5.ఎంజీబీఎస్-రామంతాపూర్-ఉప్పల్-ఘట్‌కేసర్
6.ఒవైసీ ఆసుపత్రి-బేగంపేట్
7.కాప్రా-బీహెచ్‌ఈఎల్
8.ఎల్బీనగర్-చౌటుప్పల్
9.లక్డీకాఫూల్-మెహిదీపట్నం-గచ్చిబౌలి-లింగంపల్లి-బీహెచ్‌ఈఎల్
10.బీహెచ్‌ఈఎల్-సంగారెడ్డి
11.ఎంజీబీఎస్-ఉందానగర్- శంషాబాద్ విమానాశ్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement