
సాక్షి, హైదరాబాద్: నకిలీ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపుకార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయులు నగరం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్న సంగతి తాజాగా వెలుగు చూసింది. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందారు. వీటిని వినియోగించి దుబాయ్ వెళ్లిన ఈ ముగ్గురు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. దీంతో వీరిని కొచ్చికి డిపోర్టేషన్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి వ్యవహారంపై ఇక్కడి పోలీసులూ ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ బృందం ఎర్నాకుళం వెళ్లనుంది.
జల్పాయ్‌గురివాసులుగా చెప్పుకుంటూ..
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన అజయ్ చౌదరి, షుబ్రో బరువా, అవి ముఖర్జీ సమీప బంధువులు. కొన్నాళ్ల క్రితమే వీరు అక్రమంగా వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇక్కడే ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఓటర్ ఐడీ, ఆధార్, పాన్‌కార్డ్ పొందినట్లు తేలింది. దీనికోసం షుబ్రో మినహా మిగిలిన ఇద్దరూ తమ ఇంటి పేర్లు మార్చేసి నమోదు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఇతర పత్రాల తయారీ, ప్రాసెసింగ్ బాధ్యతల్ని వారు కోల్‌కతాకు చెందిన ఓ ఏజెంట్‌కు అప్పగించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసిన ఆ ఏజెంట్ వారికి సహకరించాడు. పాస్‌పోర్టుల దరఖాస్తుల్లో వీరం తా తమ స్వస్థలం పశ్చి మ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిగా పేర్కొన్నారు. ఇలా వీరిలో చౌదరి, ముఖర్జీలకు ఈ ఏడాది మార్చ్ 5న, బరువాకు ఆగస్టు 6న పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. వీటి తో వారు గత బుధవారం దుబాయ్‌కు పయనమయ్యారు.
హైదరాబాద్ నుంచి సెర్బియా మీదుగా దుబాయ్ చేరుకున్నారు. అక్కడి ఇమ్మిగ్రేషన్ తనిఖీలో వీరు పట్టుబడ్డారు. దీంతో దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.దీంతో వారిని అక్కడినుంచి తిప్పి పంపారు. ముందస్తు సమాచారంతో కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు నేడుంబస్సేరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులు అసలైనవేనని ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కేఎస్ ఉదయభాను గుర్తించారు. మారు పేర్లతో ఉన్న ఆధార్, పాన్, ఓటర్ కార్డులను స్వాధీనం చేసు కున్నారు. వివరాల కోసం ఎర్నాకుళం క్రైమ్ బ్రాంచ్ విభాగం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసింది. పోలీసులు కొచ్చి ఇమ్మిగ్రేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, కేరళ ఇంటెలిజెన్స్ అధికారులు విచారించారు. వీరి వ్యవహారంలో ఉగ్రవాద కోణం ఉందా? అనే అనుమానాలను కూడా కేరళ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment