ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌ | Hyderabad People Interested on Ladakh Bike Ride | Sakshi
Sakshi News home page

ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌

Published Sat, Aug 10 2019 8:46 AM | Last Updated on Fri, Aug 16 2019 11:43 AM

Hyderabad People Interested on Ladakh Bike Ride - Sakshi

మంచు కొండల్లో బైక్‌ రైడ్‌ భలే ఉంటుంది కదూ! నగరంలోని ఎంతోమంది బైకర్స్‌ కోరిక ఇది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌ వీరి డ్రీమ్‌ డెస్టినేషన్‌. కానీ అక్కడి పరిస్థితులపై ఉండే సందేహాలతో చాలామంది వెళ్లలేకపోతున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల ఈ రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో నగరవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక హ్యాపీగా హిమగిరులకు వెళ్లొచ్చని భావిస్తున్నారు. రైడింగ్‌కు సిద్ధమైపోతున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: జమ్మూ కశ్మీర్‌ ప్రస్తుతం దేశమంతా చర్చల్లో నిలిచిన సుందర ప్రదేశం. భూతల స్వర్గం. అందాల లోయలు, హిమగిరులు, అపురూప ఝరుల సిరులకు ఆలవాలం. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ ప్రాంతం పత్రికలు, మీడియాలో ప్రధానాంశంగా నిలిచింది. సాధారణ పౌరులు సహా ప్రతి ఒక్కరూ ఈ అంశంపై చర్చిస్తున్నారు. అయితే.. నగరంలోని బైకర్స్‌ కమ్యూనిటీ మాత్రం జమ్మూకశ్మీర్‌తో పాటే తాజాగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లదాఖ్‌ గురించి మరింతగా ముచ్చటించుకుంటోంది. ఎందుకంటే.. సిటీ బైకర్స్‌కు అది డ్రీమ్‌ డెస్టినేషన్‌. లాంగ్‌రైడ్స్‌ బైకర్‌గా మారిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్లి తీరాలనే గమ్యం కాబట్టి. ఈ నేపథ్యంలో లదాఖ్‌ గురించి విశేషాలు, అక్కడికి వెళ్లొచ్చిన బైకర్స్‌ అనుభవాలు, అభిప్రాయాల సమాహారమే ఈ కథనం.     

బైక్‌ మీద వెళితే.. ఆ కిక్కే వేరు
సరైన విధంగా లదాఖ్‌ ట్రిప్‌ను ఆస్వాదించాలంటే బైక్‌ మీద వెళ్లడమే సరైందని బైకర్స్‌ అంటున్నారు. అందుకే ఏటా నగరం నుంచి వందలాది మంది బైకర్స్‌ వెళ్లొస్తుంటారు. సిటీ నుంచి బైక్‌ మీద లదాఖ్‌ వెళ్లి రావాలంటే కనీసం 3 వారాల సమయం పడుతుంది. లాంగ్‌ రైడ్స్‌ చేయడం కష్టం అనుకునేవాళ్లు ఢిల్లీ నుంచి/ మనాలీ నుంచి/ లెహ్‌ నుంచి.. ఇలా దానికి దగ్గరలోని విభిన్న ప్రాంతాల నుంచి బైక్స్‌ అద్దెకు తీసుకుని వెళ్తుంటారు. మొత్తం ట్రిప్‌నకు రూ.15వేల నుంచి రూ.50వేల దాకా బైక్స్‌కు అద్దె వసూలు చేస్తారు. సాధారణ బైక్స్‌ కన్నా అత్యధికంగా ఈ బాటలో కనిపించే వాటిలో 90 శాతం దాకా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆపై సామర్థ్యం కలిగిన బైక్స్‌ ఉంటాయి.

కొండల మీద నుంచి మంచు కరిగి రోడ్లపైకి జలపాతాలై దూకుతుంటే.. ఆ నీటిలో నుంచి బైక్స్‌ రివ్వున దూసుకుపోతుంటే. అదొక ప్రకృతి ఆస్వాదన యాత్ర అనిపిస్తుంది. వెళుతున్న రహదారిపై అకస్మాత్తుగా గండిపడి దారి లేకుండా పోతే అదొక సాహస యాత్రను తలపిస్తుంది. లదాఖ్‌.. ఆద్యంతం వినోద, విహార, సాహసాల సమ్మేళనం. లదాఖ్‌లో ఎత్తయిన కొండలు, లోతైన లోయలు, జలపాతాలు, మంచుబాటలు.. ఆ విహారం అద్భుతంగా ఉంటుంది. ఏటా మే నెలలో ఇక్కడి రహదారులను ఓపెన్‌ చేస్తారు. తొలుత ఆర్మీకి ఆ తర్వాత సాధారణ జనానికి ప్రవేశం లభిస్తుంది. కాబట్టి... ఇప్పుడు లదాఖ్‌కు పర్యాటకులు, బైకర్స్‌ తాకిడి ఎక్కువగానే ఉంటుంది.  

ఆనందం.. అనిర్వచనీయం..
కొన్నిరోజుల పాటు లదాఖ్‌ పరిసరాల్లో బైక్‌పై చేసిన సవారీ మరిచిపోలేని మధురానుభూతులు పంచింది. అనిర్వచనీయమైన ఆనందం అది. అడ్వెంచరస్‌గా ఉంటూ అదే సమయంలో ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించే అవకాశం కోసమే బైకర్స్‌ లదాఖ్‌ను తరచూ ఎంచుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నా.  – శ్రీకాంత్, శ్రీనగర్‌ కాలనీ

వావ్‌.. రైడ్‌ అనిపించింది
పది రోజుల క్రితం సిటీకి చెందిన బైకర్స్‌ గ్రూప్‌తో కలిసి జమ్మూ మీదుగా లదాఖ్‌ వెళ్లాం. వారం రోజుల యాత్ర వావ్‌ అనిపించింది. ఆ సుందర దృశ్యాలు వర్ణనాతీతం. మేం వెళ్లినప్పుడు అమర్‌నాథ్‌ యాత్ర కూడా ప్రారంభం కావడంతో సైనిక తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొంత కాలం తర్వాతైనా ఈ సమస్య తగ్గుతుందని అనుకుంటున్నా. పర్యాటకులు ఎక్కువ ఉన్నా ఇంకా వసతులు అభివృద్ధి కావాల్సి ఉంది. సో... ఇక అది కూడా జరగొచ్చని ఆశిస్తున్నా. లదాఖ్‌ పరిసరాల్లో వారం ఉన్నా సరిపోలేదు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మరోసారి వెళ్లాలనుకుంటున్నా.    – స్వరూప్, మౌలాలి

నా బైక్‌పైనే 16 రోజుల పాటు..
గత 11 ఏళ్లుగా బైక్‌ రైడ్‌ చేస్తున్నా. లదాఖ్‌ వెళ్లి రావడం అనేది నాకు ఒక పేషన్‌. ఇప్పటికీ నాలుగుసార్లు వెళ్లొచ్చా. అయినా తనివి తీరని ప్లేస్‌. ఇంకా ఏదో చూడాలనిపించేలా ఉంటుంది. నా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 500 బైక్‌పై ఇటీవల 16 రోజుల పాటు కాశ్మీర్, లెహ్, లడాఖ్‌లు చుట్టివచ్చాను. ఇకపై కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల మరింత తరచుగా అక్కడికి వెళ్లిరావచ్చని అనుకుంటున్నా.  – అనిత, మణికొండ

మారిన పరిస్థితులతో మరింత మంది..
లదాఖ్‌కు వెళ్లాలనేది సిటీలోని చాలామందికి సరదా. ముఖ్యంగా లాంగ్‌రైడ్‌ ఇష్టపడే బైకర్స్‌కి అదొక డ్రీమ్‌. ప్రతి ఏడాది పర్యాటలకు ప్రవేశం కల్పించే మే నెల తర్వాత నుంచి నగరంలో కూడా సందడి మొదలవుతుంది. లదాఖ్‌కు వెళదామని నిర్ణయించుకుని బయలుదేరేవారిలో చివరి వరకూ అదే నిర్ణయం మీద కట్టుబడి ఉండేవారు 20 శాతం మంది. దీనికి కారణం అక్కడి పరిస్థితిపై ఉండే రకరకాల సందేహాలే. మే నెలలో తొలుత మిలిటరీని మాత్రమే అనుమతించి ఆ తర్వాత పర్యాటకులకు శల్యపరీక్షలు జరుగుతాయి. చాలామంది సిమ్లా, మనాలీ వరకే భయంతో వెనకకు వచ్చిన సందర్భాలు ఎన్నో అని నగరానికి బైకర్‌ స్వరూప్‌ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మరింత మంది పర్యాటకులు లదాఖ్‌కు వెళ్లే అవకాశాలు పెరిగాయని బైకర్లు అంచనా వేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement