Ladakh tour
-
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్‌లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
లద్దాఖ్ చేరుకున్న ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగం, ఇతర ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లద్దాఖ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, తలెత్తిన వివాదాల గురించి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో టాప్ కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న భూ వివాదాల గురించి ఆర్మీ చీఫ్‌కు వివరించనున్నట్లు సమాచారం. అంతేకాక భారత్ భూభాగంతో పాటు ఇక్కడి పర్వత ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆర్మీ చీఫ్ ఈ ఆపరేషన్లలో పాల్గొన్న అధికారులతో పాటు ఇతర సైనికులను కలవనున్నారని సమాచారం. చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను భారత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. (చదవండి: వ్యూహాత్మక మోహరింపు) ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంపై ప్రస్తుతం భారత సైన్యం ఆధిపత్యం చెలాయిస్తోంది. గత కొద్ది రోజులుగా, తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైన్యం పలు ప్రయత్నాలు చేసింది. కానీ అప్రమత్తమైన భారత దళాలు ఈ ప్రయత్నాలన్నింటిని విఫలం చేశాయి. అంతకుముందు, ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో రెండు రోజుల పాటు(సోమ, మంగళవారాల్లో)చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్-స్థాయి చర్చలు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు ఆరుగంటలకు పైగానే సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడలేదు. గత కొద్ది రోజులుగా భారత సైన్యం మనకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కొండ శిఖరాలు, ప్రదేశాలను ఆక్రమించి చైనాపై పట్టు బిగించింది. -
అంగుళం భూమినీ ముట్టుకోలేరు
లద్దాఖ్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు. సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్ లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్లో రాజ్నా«ద్ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఏమైనా చేస్తా భారత్ చైనా పరిస్థితిపై ట్రంప్ భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యను ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహాధ్యక్షుడు అల్ మాసన్ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. -
లద్దాఖ్‌లో ప్రధాని మోదీ పర్యటన
-
చైనాకు ప్రధాని మోదీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డారు. విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్‌లో లడఖ్ అంతర్భాగమని స్పష్టం చేశారు. కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. మనం పిల్లనగ్రోవిని ప్రేమిస్తాం..విష్ణుచక్రాన్నీ ప్రేమిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి మోదీ అంతకుముందు గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా కమాండర్ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గల్వాన్ ఘటనపై స్ధానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. చదవండి : చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్ -
నిబంధనలు పాటించాల్సిందే!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: సత్వరమే సరిహద్దుల్లో శాంతి నెలకొనే దిశగా చైనా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వ్యాఖ్యానించారు. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై విధించిన నిషేధంపై స్పందిస్తూ.. డేటా సెక్యూరిటీ, ప్రైవసీకి సంబంధించిన అన్ని నియమ, నిబంధనలను భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని సంస్థలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్ స్వాగతిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలెన్నో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాజ్‌నాథ్ పర్యటన వాయిదా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడిందని అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆయన లద్దాఖ్‌లో పర్యటించి, అక్కడి సైనిక శిబిరాలను సందర్శించి, యుద్ధ సన్నద్ధతను సమీక్షిస్తారని తెలిపాయి. రాజ్‌నాథ్ లద్దాఖ్ పర్యటన వాయిదాకి కారణం తెలియరాలేదు. ఆ వార్తలు అవాస్తవం భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట అదనంగా 20 వేలమంది సైనికులను మోహరించామని వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనిక మోహరింపులకు అనుగుణంగా పాకిస్తాన్ పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్లోని నియంత్రణ రేఖ వెంట సైన్యాన్ని దింపిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవి అబద్ధాలు, బాధ్యతారహిత వార్తలని పాక్ గురువారం పేర్కొంది. తమ భూభాగంలో చైనా సైనికులు ఉన్నారని, స్కర్దు ఎయిర్‌బేస్‌ను చైనా ఉపయోగించుకుంటోందని వచ్చిన వార్తలను పాక్ ఆర్మీ ఖండించింది. -
వృత్తి చెత్త సేకరణ.. ప్రవృత్తి బైక్ రైడ్
వారిద్దరు అన్నదమ్ములు. వారి జీవనశైలి విభిన్నం. సాధారణ బస్తీలో పుట్టి పెరిగిన వీరు బైక్‌పై సాహస ప్రయాణం చేసి స్ఫూర్తిగా నిలిచారు. బైక్ రైడింగ్‌లో వారేమైనా శిక్షణ పొందారా అంటే అదేమీలేదు. వారికికావాల్సిన పరికరాలు లేవు. నైపుణ్యం అంతకంటే లేదు. ధైర్యాన్నే నమ్ముకున్నారు.జమ్మూ కశ్మీర్, లదాక్‌లకు వెళ్లివచ్చారు. బుల్లెట్ రైడ్‌తో మంచుకొండలనుచుట్టివచ్చారు. బస్తీ కుర్రోళ్లు భలే సాహసగాళ్లుఅనిపించుకున్నారు. యువతకుఆదర్శంగా నిలిచారు. అంబర్‌పేట :నగరంలోని బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంట చెంచు బస్తీకి చెందిన ఎన్.రమేష్, ఎన్. మహేష్‌లు అన్నదమ్ములు. వీరు చెత్త సేకరిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన చెత్త సేకరణ ఆటో, రిక్షాలను నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త ద్వారా వచ్చే డబ్బులే వీరికి ప్రధానం ఆదాయం. బైక్‌రైడ్, దూరప్రాంతాలను సందర్శించాలనే అభిరుచి వారిని కశ్మీర్ మంచు కొండలను చుట్టి వచ్చేలా చేసింది. నెలరోజుల క్రితం వీరిద్దరూ రెండు బుల్లెట్ వాహనాలపై హైదరాబాద్ నుంచి జమ్మూ కశ్మీర్, లదాక్ ప్రాంతాల్లో పర్యటించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సాహస ప్రయాణం.. బుల్లెట్ వాహనాలపై అన్నదమ్ములిద్దరూ 12 రోజుల పాటు 6,300 కిలో మీటర్ల ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అమృత్సర్, వాఘా సరిహద్దును సందర్శించి దేశభక్తిని చాటుకున్నారు. అక్కడి నుంచి శ్రీనగర్, కార్గిల్ మీదుగా లదాక్, కార్దుంగ్లా, మనాలీ, చండీగఢ్ నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరు బుల్లెట్ వాహనాలపై మంచుకొండల్లో ప్రయాణించారు. ఒళ్లు గడ్డకట్టే చలి, ఆక్సిజన్ కొరత ఉండే ప్రాంతాల్లో బైక్‌రైడ్ చేసి ఔరా అనిపించారు. దారిలో ఎదురైన ఆంక్షలను సైతం ఎదుర్కొని ప్రయాణం సాగించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో.. ప్రతియేటా ఏదో సాహస యాత్ర చేస్తాం. గత ఏడాది ముంబైని చుట్టి వచ్చాం. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్, లదాక్ ప్రాంతాలకు వెళ్లి వచ్చాం. పెట్రోల్‌కే రూ.10 వేల ఖర్చు అయ్యింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. మాలోని లాంగ్ డ్రైవ్ ఆసక్తే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణ ఆటో ఆగకుండా ఇతరులకు బాధ్యత అప్పగించి 12 రోజులపాటు సాహస యాత్ర చేశాం. – రమేష్ నేపథ్యానికి భిన్నంగా... బతుకమ్మకుంట చెంచు బస్తీ అంటేనే స్థానికంగా ప్రత్యేక అభిప్రాయం ఉంది. వీరంతా నిరక్షరాస్యులు. ఎవరి మాటా వినరనే ప్రచారం ఉంది. అంతా చెత్త సేకరించే కుటుంబాలు అనే దృష్టి కూడా ఉంది. ఈ ఇద్దరు యువకులు తమకు జీవనోపాధిని ఇచ్చే వృత్తిని చిన్నచూపు చూడకుండానే దేశాన్ని చుట్టి వచ్చే సంకల్పానికి దిగారు. తెల్లవారుజామున 5 గంటలకే చెత్త ఆటోతో బయలుదేరేవారు బుల్లెట్ వాహనాలపై కశ్మీర్ లోయకు వెళ్లిరావడం విశేషం. కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్లి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. 12 రోజుల పాటు చెత్త సేకరణకు సెలవిచ్చి దేశాన్ని చుట్టి రావడం గమనార్హం. చిన్న సాహసం చేసి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో వీరు సరదాగా సాహసం చేయడం విశేషం. -
ఫిదా దౌడ్ లదాఖ్ రైడ్
మంచు కొండల్లో బైక్ రైడ్ భలే ఉంటుంది కదూ! నగరంలోని ఎంతోమంది బైకర్స్ కోరిక ఇది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, లదాఖ్ వీరి డ్రీమ్ డెస్టినేషన్. కానీ అక్కడి పరిస్థితులపై ఉండే సందేహాలతో చాలామంది వెళ్లలేకపోతున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల ఈ రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో నగరవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక హ్యాపీగా హిమగిరులకు వెళ్లొచ్చని భావిస్తున్నారు. రైడింగ్‌కు సిద్ధమైపోతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జమ్మూ కశ్మీర్ ప్రస్తుతం దేశమంతా చర్చల్లో నిలిచిన సుందర ప్రదేశం. భూతల స్వర్గం. అందాల లోయలు, హిమగిరులు, అపురూప ఝరుల సిరులకు ఆలవాలం. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రాంతం పత్రికలు, మీడియాలో ప్రధానాంశంగా నిలిచింది. సాధారణ పౌరులు సహా ప్రతి ఒక్కరూ ఈ అంశంపై చర్చిస్తున్నారు. అయితే.. నగరంలోని బైకర్స్ కమ్యూనిటీ మాత్రం జమ్మూకశ్మీర్‌తో పాటే తాజాగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లదాఖ్ గురించి మరింతగా ముచ్చటించుకుంటోంది. ఎందుకంటే.. సిటీ బైకర్స్‌కు అది డ్రీమ్ డెస్టినేషన్. లాంగ్‌రైడ్స్ బైకర్‌గా మారిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్లి తీరాలనే గమ్యం కాబట్టి. ఈ నేపథ్యంలో లదాఖ్ గురించి విశేషాలు, అక్కడికి వెళ్లొచ్చిన బైకర్స్ అనుభవాలు, అభిప్రాయాల సమాహారమే ఈ కథనం. బైక్ మీద వెళితే.. ఆ కిక్కే వేరు సరైన విధంగా లదాఖ్ ట్రిప్‌ను ఆస్వాదించాలంటే బైక్ మీద వెళ్లడమే సరైందని బైకర్స్ అంటున్నారు. అందుకే ఏటా నగరం నుంచి వందలాది మంది బైకర్స్ వెళ్లొస్తుంటారు. సిటీ నుంచి బైక్ మీద లదాఖ్ వెళ్లి రావాలంటే కనీసం 3 వారాల సమయం పడుతుంది. లాంగ్ రైడ్స్ చేయడం కష్టం అనుకునేవాళ్లు ఢిల్లీ నుంచి/ మనాలీ నుంచి/ లెహ్ నుంచి.. ఇలా దానికి దగ్గరలోని విభిన్న ప్రాంతాల నుంచి బైక్స్ అద్దెకు తీసుకుని వెళ్తుంటారు. మొత్తం ట్రిప్‌నకు రూ.15వేల నుంచి రూ.50వేల దాకా బైక్స్‌కు అద్దె వసూలు చేస్తారు. సాధారణ బైక్స్ కన్నా అత్యధికంగా ఈ బాటలో కనిపించే వాటిలో 90 శాతం దాకా రాయల్ ఎన్ఫీల్డ్ ఆపై సామర్థ్యం కలిగిన బైక్స్ ఉంటాయి. కొండల మీద నుంచి మంచు కరిగి రోడ్లపైకి జలపాతాలై దూకుతుంటే.. ఆ నీటిలో నుంచి బైక్స్ రివ్వున దూసుకుపోతుంటే. అదొక ప్రకృతి ఆస్వాదన యాత్ర అనిపిస్తుంది. వెళుతున్న రహదారిపై అకస్మాత్తుగా గండిపడి దారి లేకుండా పోతే అదొక సాహస యాత్రను తలపిస్తుంది. లదాఖ్.. ఆద్యంతం వినోద, విహార, సాహసాల సమ్మేళనం. లదాఖ్‌లో ఎత్తయిన కొండలు, లోతైన లోయలు, జలపాతాలు, మంచుబాటలు.. ఆ విహారం అద్భుతంగా ఉంటుంది. ఏటా మే నెలలో ఇక్కడి రహదారులను ఓపెన్ చేస్తారు. తొలుత ఆర్మీకి ఆ తర్వాత సాధారణ జనానికి ప్రవేశం లభిస్తుంది. కాబట్టి... ఇప్పుడు లదాఖ్‌కు పర్యాటకులు, బైకర్స్ తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆనందం.. అనిర్వచనీయం.. కొన్నిరోజుల పాటు లదాఖ్ పరిసరాల్లో బైక్‌పై చేసిన సవారీ మరిచిపోలేని మధురానుభూతులు పంచింది. అనిర్వచనీయమైన ఆనందం అది. అడ్వెంచరస్‌గా ఉంటూ అదే సమయంలో ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించే అవకాశం కోసమే బైకర్స్ లదాఖ్‌ను తరచూ ఎంచుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నా. – శ్రీకాంత్, శ్రీనగర్ కాలనీ వావ్.. రైడ్ అనిపించింది పది రోజుల క్రితం సిటీకి చెందిన బైకర్స్ గ్రూప్‌తో కలిసి జమ్మూ మీదుగా లదాఖ్ వెళ్లాం. వారం రోజుల యాత్ర వావ్ అనిపించింది. ఆ సుందర దృశ్యాలు వర్ణనాతీతం. మేం వెళ్లినప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కావడంతో సైనిక తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొంత కాలం తర్వాతైనా ఈ సమస్య తగ్గుతుందని అనుకుంటున్నా. పర్యాటకులు ఎక్కువ ఉన్నా ఇంకా వసతులు అభివృద్ధి కావాల్సి ఉంది. సో... ఇక అది కూడా జరగొచ్చని ఆశిస్తున్నా. లదాఖ్ పరిసరాల్లో వారం ఉన్నా సరిపోలేదు. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మరోసారి వెళ్లాలనుకుంటున్నా. – స్వరూప్, మౌలాలి నా బైక్‌పైనే 16 రోజుల పాటు.. గత 11 ఏళ్లుగా బైక్ రైడ్ చేస్తున్నా. లదాఖ్ వెళ్లి రావడం అనేది నాకు ఒక పేషన్. ఇప్పటికీ నాలుగుసార్లు వెళ్లొచ్చా. అయినా తనివి తీరని ప్లేస్. ఇంకా ఏదో చూడాలనిపించేలా ఉంటుంది. నా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 బైక్‌పై ఇటీవల 16 రోజుల పాటు కాశ్మీర్, లెహ్, లడాఖ్‌లు చుట్టివచ్చాను. ఇకపై కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల మరింత తరచుగా అక్కడికి వెళ్లిరావచ్చని అనుకుంటున్నా. – అనిత, మణికొండ మారిన పరిస్థితులతో మరింత మంది.. లదాఖ్‌కు వెళ్లాలనేది సిటీలోని చాలామందికి సరదా. ముఖ్యంగా లాంగ్‌రైడ్ ఇష్టపడే బైకర్స్‌కి అదొక డ్రీమ్. ప్రతి ఏడాది పర్యాటలకు ప్రవేశం కల్పించే మే నెల తర్వాత నుంచి నగరంలో కూడా సందడి మొదలవుతుంది. లదాఖ్‌కు వెళదామని నిర్ణయించుకుని బయలుదేరేవారిలో చివరి వరకూ అదే నిర్ణయం మీద కట్టుబడి ఉండేవారు 20 శాతం మంది. దీనికి కారణం అక్కడి పరిస్థితిపై ఉండే రకరకాల సందేహాలే. మే నెలలో తొలుత మిలిటరీని మాత్రమే అనుమతించి ఆ తర్వాత పర్యాటకులకు శల్యపరీక్షలు జరుగుతాయి. చాలామంది సిమ్లా, మనాలీ వరకే భయంతో వెనకకు వచ్చిన సందర్భాలు ఎన్నో అని నగరానికి బైకర్ స్వరూప్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మరింత మంది పర్యాటకులు లదాఖ్‌కు వెళ్లే అవకాశాలు పెరిగాయని బైకర్లు అంచనా వేస్తున్నారు. -
షాక్ తిన్నారు.. వద్దన్నారు..
సాహసాల చరిత్రలోసిటీ బైకర్లు మరో కొత్త అధ్యాయం లిఖించారు. అత్యంత క్లిష్టమైనవాతావరణంలో మంచుకొండల్లో దూసుకెళ్లి కొత్త ట్రెండ్ సృష్టించారు. సిటీకి చెందిన ముగ్గురు బైకర్లు ప్లాన్ చేసిన ఈ యాత్రలో మరో ముగ్గురు ఢిల్లీ బైకర్స్ కూడాపాల్గొన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నెల ప్రారంభం వరకు కొనసాగిన వీరి రైడ్విజయవంతంగాముగిసింది. సిటీ బై‘కింగ్స్’ జెండా ఎగసింది. సాక్షి, సిటీబ్యూరో: హిమాలయ పర్వత సానువుల మీదుగా సాగే లేహ్ లడఖ్ సాహసయాత్ర సిటీ బైకర్స్ అప్పుడప్పుడు చేసేదే. అయితే ఈసారి సిటీ బైకర్లు చేసిన అదే యాత్ర ఎందుకు ప్రత్యేకమైందంటే..? ఫిబ్రవరిలో ఈ సాహస యాత్ర చేయడమే ఇందుకు కారణం. మండే ఎండల కాలంలోనే అక్కడ హిమపాతాన్ని తట్టుకోవడం కష్టం. అలాంటిది 5 డిగ్రీల నుంచి మైనస్ 24 డిగ్రీల టెంపరేచర్ ఉండే సమయంలో ఈ యాత్రను సుసాధ్యం చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు నగరానికి చెందిన పృదు మెహతా(38), కుశాల్ టక్కర్ (33), విజయ్ పటేల్(46).. ఢిల్లీకి చెందిన మనీష్ దాలి(38), అక్షయ్ జైన్(29), దీపక్ గుప్తా(38). శరీరాన్ని చురకత్తుల్లా కోసే మంచుగాలులు, ప్రమాదకరమైన మలుపులు, మంచుతో నిండిపోయిన రహదారుల మీదుగా అభిరుచి, ఆత్మ విశ్వాసం తోడుగా వీరి జర్నీ సాగింది. దాదాపు 20 రోజుల క్రితం యాత్రను ముగించుకొని ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఈ బృందం ‘సాక్షి’తో పంచుకున్న రైడ్ విశేషాలివీ... షాక్ తిన్నారు.. వద్దన్నారు.. ఈ సమయంలో అక్కడి కొండల్లో ఆర్మీ పెట్రోలింగ్ కూడా ఉండదు. ఆ మంచు కొండల్లో ఇరుక్కుంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి. అందుకే ఈ ఆలోచన పంచుకున్నప్పుడు మా బంధుమిత్రులు షాక్ అయ్యారు. ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు కదా.. వద్దులే అన్నారు. అయినా సరే.. మేం చేయగలం అనుకున్నాం. అయితే గుడ్డిగా వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. దీని కోసం ఒక బ్యాకప్ వెహికల్ ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఉడ్, కిరోసిన్, స్టవ్, టెంపరెరీ టెంట్స్, సిలిండర్, రెడీమేడ్ పుడ్.. ఇలా అన్నీ తీసుకెళ్లాం. ఆరుగురు రైడర్స్‌లో ఇద్దర్ని స్టాండ్‌బైగా ఉంచాం. ప్రయాణం సాగిందిలా... దీనికి ఎక్స్ట్రీమ్ వింటర్ లఢఖ్ రైడ్ అని పేరు పెట్టాం. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ యాత్రను మేం ఫిబ్రవరి 24న ప్రారంభించాం. ముందు ఢిల్లీ చేరుకున్నాం. లేహ్ లఢఖ్ వరకు ఈ టైమ్‌లో ఫ్లైట్ తప్ప.. మరే రూట్ ఉండదు. పర్వతాలను క్రాస్ చేస్తూ వెళ్లాలి. అదొక్కటే మార్గం. ఢిల్లీ నుంచి లేహ్ దాకా విమానంలో ప్రయాణించాం. జమ్మూకశ్మీర్‌లోని హైడిజర్ట్ సిటీ లేహ్‌కు చేరుకొని, అక్కడ ఓ రోజు బస చేశాక హాన్లే గ్రామానికి మా రోడ్ రైడ్ స్టార్ట్ చేశాం. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీలుగా ఉంది. విపరీతమైన ఎదురు గాలుల మధ్య, దాదాపు 10గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించి 250 కిలోమీటర్ల దూరంలోని చైనా బోర్డర్‌కు దగ్గర్లోని ఆ గ్రామానికి 26న చేరుకున్నాం. హాన్లేలో రెండ్రోజులు కళ్లు తిప్పుకోనివ్వని ల్యాండ్ స్కేప్స్ మధ్య గడిపి హాన్లే అబ్సర్వేటరీ, మోనాస్టరీలు సందర్శించాం. స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను చూశాం. అదే వాతావరణ పరిస్థితుల్లో తిరుగు ప్రయాణం ప్రారంభించాం. లేహ్‌కి 220 కి.మీ దూరంలోని కార్గిల్ వైపుగా రైడ్ స్టార్ట్ చేసి, ఫోట్యులా పాస్, నామిక్లా పాస్ అనే రెండు ఎత్తయిన శిఖరాలను దాటుకుంటూ సాగిపోయాం. దారిలో కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ప్యాంగాగ్ లేక్ ఎదురైంది. అది మైనస్ 22 డిగ్రీల చలికి మొత్తం ఘనీభవించి పోయింది. మంచుతో కప్పబడిపోయిన ఆ లేక్ మీద రైడ్ వర్ణించలేని అనుభూతి. అయితే అది కూడా బాగా ప్రమాదకరమైనదే. అసలు అక్కడ లేక్ ఉండేదంటే నమ్మలేం.. అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవచ్చు.. కానీ ఎముకల్ని అమాంతం కోసేస్తున్నట్టు ఉండే చలిగాలులను తట్టుకోలేం. మార్చి 1న ద్రాస్ చేరుకున్నాం. ఆ ప్రాంతం మొత్తం ఒక మంచుదుప్పటి కింద దాక్కుని ఉంది. కనుచూపుమేర తెల్లదనమే. మనుషులు ఉండే ప్రపంచపు రెండో అత్యంత చల్లని ప్రాంతం అది. అక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. మ్యాగీ లాంటివి వండుకుని తిన్నాం. దారిలో భారతీయ సైన్యం నిర్మించిన ద్రాస్ వార్ మెమోరియల్ నిర్మాణాన్ని సందర్శించాం. ఏంటీ రైడ్ స్పెషల్? లేహ్ లఢఖ్‌కు బైక్ రైడ్స్‌ను సిటీ రైడర్స్ బాగా ఇష్టపడతారు. అయితే అలా వెళ్లే వారంతా మే చివరి నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత లేహ్ లఢఖ్‌కు ఉన్న రెండు ప్రధాన దారులు మంచుమయంగా మారిపోతాయి. అసలు ఫిబ్రవరి నెలలో ఆ ప్రాంతానికి రైడ్ అనేది కనీసం ఊహించ లేనిదనే చెప్పాలి. అందుకే వీరి రైడ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బైకర్స్ కమ్యూనిటీ అయింది. కష్టమైన రైడ్... స్వల్ప పరిమాణంలోని ఆహారంతోనే ఇదంతా సాగించాం. ఇది చాలా కష్టమైన రైడ్. ఈ సీజన్లో గ్రామాలు ఉంటాయి. కానీ జనం బాగా పలచగా మాత్రమే ఉంటారు. స్వల్ప పరిమాణంలో మాత్రమే ఫుడ్ లభ్యమవుతుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. హై యాటిట్యూడ్ సిక్నెస్ తీవ్రమైన సమస్యతో ఎదుర్కోవాల్సి వచ్చింది. మా చూపు కూడా బాగా మందగించింది. రోడ్డును స్పష్టంగా చూడలేకపోయాం. – పృదు మెహతా, బైకర్ -
మంచు తుపాను కమ్మేసింది
18,500 అడుగుల ఎత్తుకు వెళ్లా.. - సామాన్యులెవరూ వెళ్లలేరు - మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలుంటాయి - లడఖ్ పర్యటనపై ఎస్పీ విశ్వజిత్ కంపాటి సిరిసిల్ల: ‘దేశ సరిహద్దుల్లో మన సైన్యం నిత్యం కంటికి రెప్పలా కాపలాకాసే విధానాన్ని కళ్లారా చూశా.. సముద్రమట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ లభించని మంచుకొండల్లో గస్తీ తిరిగే ఆర్మీ.. ఎవరికి ఏం జరిగినా జనావాసాలకు చేరాలంటే కనీసం 8 గంటలు ప్రయాణించాల్సిందే.. ఇలాంటి ప్రాంతంలో రేయింబవళ్లు మనవాళ్లు రక్షణగా ఉండడం నిజంగా గొప్ప విషయం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. 1959లో సీఆర్ïపీఎఫ్ గస్తీ బృందాన్ని చైనా బలగాలు దొంగదెబ్బ తీసి.. మెరుపు దాడి చేయడంతో 20 మంది జవాన్లు చనిపోయారు.. వారి త్యాగాన్ని స్మరిస్తూ ఏటా లడఖ్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్‌లో నిర్మించిన అమరజవాన్ల స్థూపానికి నివాళులు అర్పిస్తుంటారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అధికారుల బృందం లడఖ్ వెళ్లింది. ఆ బృందంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఒక్కరే వెళ్లారు. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్.. గత ఆగస్టు 21 నుంచి ఈనెల 10 వరకు 20 రోజుల పాటు దేశ సరిహద్దుల్లోకి వెళ్లి భారత వీరజవాన్లకు నివాళి అర్పించి వచ్చారు. ఈ సందర్భంగా తన పర్యటన అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... మంచుపర్వతాల మధ్య ప్రయాణం.. చండీగఢ్ నుంచి వాహనంలో మా ప్రయాణం మొదలైంది. 3 రాత్రులు, 4 రోజులపాటు మా ప్రయాణం సుమారు వెయ్యి కిలోమీటర్లు సాగింది. నిజానికి ఆ రోడ్లు అంతగా బాగుం డవు. గుట్టలు, మంచుపర్వతాలతో నిండి ఉంటుంది. అందుకే అంతసమయం పట్టింది. ఇద్దరు అధికారులు వెనక్కి వచ్చారు.. హాట్స్ప్రింగ్కు చేరడానికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. మానసికంగా దృఢత్వం కావాలి. ఎందుకంటే భూమికి 16,000 అడుగుల ఎత్తులో గాలిలో ఆక్సిజన్ ఉండదు. ఆస్తమా వంటి శ్వాసకోశవ్యాధులతో బాధపడే వారు రాకూడదు. నాతోపాటు వచ్చిన ఇద్దరు అధికారులు ముందుకు సాగలేక వెనక్కి వచ్చారు. నాకు ఐపీఎస్ ట్రెయినింగ్‌లో కశ్మీర్ లోని అనంతనాగ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. మా వెంట భారత ఆర్మీ జవాన్లు, ఐటీ బీపీ బలగాలు హాట్‌స్ప్రింగ్ వరకు వచ్చాయి. నివాళి అనిర్వచనీయమైన అనుభూతి చైనా సరిహద్దుల్లో ఎడారిని తలపించే మంచు గుట్టల మధ్య.. హాట్‌స్ప్రింగ్ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించడం అనిర్వచనీ యమైన అనుభూతిని ఇచ్చింది. మరోసారి అవకాశం వస్తే.. మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. మంచుతుపాను కమ్మేసింది.. సాయుధ పోలీసుల మధ్య హాట్స్ప్రింగ్కి చేరుకున్నాం. అక్కడి ఆర్మీతో కలిసి నివాళి అర్పించిన తర్వాత ఒక్కడినే బైక్‌పై కొంత ముందుకు వెళ్లాను. నా సహచరులంతా వద్దని వారించారు. కానీ వెళ్లాను. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ కరువైంది. వెనక్కి వద్దామని నిర్ణయించుకునే లోగానే మంచుతుపాను కమ్మేసింది. కొంతసేపు ఆ తుపానును ఆస్వాదించి తిరిగి వెనక్కి వచ్చాను. అక్కడేం జరిగినా వైద్యం అందా లంటే 8 గంటలు ప్రయాణించాల్సిందే. ఫోన్లు పనిచేయవు. కనుచూపు మేరలో మంచు కనిపిస్తుంది. నేను వెళ్లి వచ్చిన తెల్లారే ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్ క్రాష్ అయింది. మన జవాన్ల సేవలకు సలాం.. అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో చలిలో, మంచు తుపానుల్లో మన జవాన్లు సరిహ ద్దుల్లో గస్తీ తిరగడం కళ్లారా చూశాను. వాళ్ల కు సలాం చేయాలనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కార్గి ల్, లడఖ్, లే సరిహద్దుల్లో మన ఆర్మీ గస్తీ సేవలు అద్భుతం. నేను చిన్నప్పుడు చదు వుకున్న స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదాలు మళ్లీ స్ఫురణకు వచ్చాయి. అందుకే దేశానికి సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్‌కు.. అన్నం పెట్టే రైతు కు మనం ఎప్పుడు రుణపడి ఉండడమే మన వారికి ఇచ్చే నిజమైన గౌరవం.