న్యూఢిల్లీ: ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగం, ఇతర ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లద్దాఖ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, తలెత్తిన వివాదాల గురించి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో టాప్ కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న భూ వివాదాల గురించి ఆర్మీ చీఫ్‌కు వివరించనున్నట్లు సమాచారం. అంతేకాక భారత్ భూభాగంతో పాటు ఇక్కడి పర్వత ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆర్మీ చీఫ్ ఈ ఆపరేషన్‌లలో పాల్గొన్న అధికారులతో పాటు ఇతర సైనికులను కలవనున్నారని సమాచారం. చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను భారత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. (చదవండి: వ్యూహాత్మక మోహరింపు)
ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంపై ప్రస్తుతం భారత సైన్యం ఆధిపత్యం చెలాయిస్తోంది. గత కొద్ది రోజులుగా, తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైన్యం పలు ప్రయత్నాలు చేసింది. కానీ అప్రమత్తమైన భారత దళాలు ఈ ప్రయత్నాలన్నింటిని విఫలం చేశాయి. అంతకుముందు, ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో రెండు రోజుల పాటు(సోమ, మంగళవారాల్లో)చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్-స్థాయి చర్చలు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు ఆరుగంటలకు పైగానే సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడలేదు. గత కొద్ది రోజులుగా భారత సైన్యం మనకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కొండ శిఖరాలు, ప్రదేశాలను ఆక్రమించి చైనాపై పట్టు బిగించింది.
Comments
Please login to add a commentAdd a comment