న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: సత్వరమే సరిహద్దుల్లో శాంతి నెలకొనే దిశగా చైనా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వ్యాఖ్యానించారు. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై విధించిన నిషేధంపై స్పందిస్తూ.. డేటా సెక్యూరిటీ, ప్రైవసీకి సంబంధించిన అన్ని నియమ, నిబంధనలను భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని సంస్థలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్ స్వాగతిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలెన్నో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు.
రాజ్‌నాథ్ పర్యటన వాయిదా
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడిందని అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆయన లద్దాఖ్‌లో పర్యటించి, అక్కడి సైనిక శిబిరాలను సందర్శించి, యుద్ధ సన్నద్ధతను సమీక్షిస్తారని తెలిపాయి. రాజ్‌నాథ్ లద్దాఖ్ పర్యటన వాయిదాకి కారణం తెలియరాలేదు.
ఆ వార్తలు అవాస్తవం
భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట అదనంగా 20 వేలమంది సైనికులను మోహరించామని వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనిక మోహరింపులకు అనుగుణంగా పాకిస్తాన్ పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్‌లోని నియంత్రణ రేఖ వెంట సైన్యాన్ని దింపిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవి అబద్ధాలు, బాధ్యతారహిత వార్తలని పాక్ గురువారం పేర్కొంది. తమ భూభాగంలో చైనా సైనికులు ఉన్నారని, స్కర్దు ఎయిర్‌బేస్‌ను చైనా ఉపయోగించుకుంటోందని వచ్చిన వార్తలను పాక్ ఆర్మీ ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment