షాక్‌ తిన్నారు.. వద్దన్నారు.. | City Bikers Extreme Winter Ladakh Raid | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రీమ్‌ వింటర్‌లో అడ్వెంచర్‌ ట్రిప్‌

Published Mon, Apr 2 2018 12:41 PM | Last Updated on Mon, Apr 2 2018 12:41 PM

City Bikers Extreme Winter Ladakh Raid - Sakshi

సాహసాల చరిత్రలోసిటీ బైకర్లు మరో కొత్త అధ్యాయం లిఖించారు. అత్యంత క్లిష్టమైనవాతావరణంలో మంచుకొండల్లో దూసుకెళ్లి కొత్త ట్రెండ్‌ సృష్టించారు. సిటీకి చెందిన ముగ్గురు బైకర్లు ప్లాన్‌ చేసిన ఈ యాత్రలో  మరో ముగ్గురు ఢిల్లీ బైకర్స్‌ కూడాపాల్గొన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నెల ప్రారంభం వరకు కొనసాగిన వీరి రైడ్‌విజయవంతంగాముగిసింది. సిటీ బై‘కింగ్స్‌’ జెండా ఎగసింది. 

సాక్షి, సిటీబ్యూరో: హిమాలయ పర్వత సానువుల మీదుగా సాగే లేహ్‌ లడఖ్‌ సాహసయాత్ర సిటీ బైకర్స్‌ అప్పుడప్పుడు చేసేదే. అయితే ఈసారి సిటీ బైకర్లు చేసిన అదే యాత్ర ఎందుకు ప్రత్యేకమైందంటే..? ఫిబ్రవరిలో ఈ సాహస యాత్ర చేయడమే ఇందుకు కారణం. మండే ఎండల కాలంలోనే అక్కడ హిమపాతాన్ని తట్టుకోవడం కష్టం. అలాంటిది 5 డిగ్రీల నుంచి మైనస్‌ 24 డిగ్రీల టెంపరేచర్‌ ఉండే సమయంలో ఈ యాత్రను సుసాధ్యం చేసి సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు నగరానికి చెందిన పృదు మెహతా(38), కుశాల్‌ టక్కర్‌ (33), విజయ్‌ పటేల్‌(46).. ఢిల్లీకి చెందిన మనీష్‌ దాలి(38), అక్షయ్‌ జైన్‌(29), దీపక్‌ గుప్తా(38). శరీరాన్ని చురకత్తుల్లా కోసే మంచుగాలులు, ప్రమాదకరమైన మలుపులు, మంచుతో నిండిపోయిన రహదారుల మీదుగా అభిరుచి, ఆత్మ విశ్వాసం తోడుగా వీరి జర్నీ సాగింది. దాదాపు 20 రోజుల క్రితం యాత్రను ముగించుకొని ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఈ బృందం ‘సాక్షి’తో పంచుకున్న రైడ్‌ విశేషాలివీ...  

షాక్‌ తిన్నారు.. వద్దన్నారు..  
ఈ సమయంలో అక్కడి కొండల్లో ఆర్మీ పెట్రోలింగ్‌ కూడా ఉండదు. ఆ మంచు కొండల్లో ఇరుక్కుంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి. అందుకే ఈ ఆలోచన పంచుకున్నప్పుడు మా బంధుమిత్రులు షాక్‌ అయ్యారు.  ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు కదా.. వద్దులే అన్నారు. అయినా సరే.. మేం చేయగలం అనుకున్నాం. అయితే గుడ్డిగా వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. దీని కోసం ఒక బ్యాకప్‌ వెహికల్‌ ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో లైఫ్‌ సేవింగ్‌ ఎక్విప్‌మెంట్, ఫైర్‌ ఉడ్, కిరోసిన్, స్టవ్, టెంపరెరీ టెంట్స్, సిలిండర్, రెడీమేడ్‌ పుడ్‌.. ఇలా అన్నీ తీసుకెళ్లాం. ఆరుగురు రైడర్స్‌లో ఇద్దర్ని స్టాండ్‌బైగా ఉంచాం. 

ప్రయాణం సాగిందిలా...  

దీనికి ఎక్స్‌ట్రీమ్‌ వింటర్‌ లఢఖ్‌ రైడ్‌ అని పేరు పెట్టాం. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ యాత్రను మేం ఫిబ్రవరి 24న ప్రారంభించాం. ముందు ఢిల్లీ చేరుకున్నాం. లేహ్‌ లఢఖ్‌ వరకు ఈ టైమ్‌లో ఫ్లైట్‌ తప్ప.. మరే రూట్‌ ఉండదు. పర్వతాలను క్రాస్‌ చేస్తూ వెళ్లాలి. అదొక్కటే మార్గం. ఢిల్లీ నుంచి లేహ్‌ దాకా విమానంలో ప్రయాణించాం. జమ్మూకశ్మీర్‌లోని హైడిజర్ట్‌ సిటీ లేహ్‌కు చేరుకొని, అక్కడ ఓ రోజు బస చేశాక హాన్లే గ్రామానికి మా రోడ్‌ రైడ్‌ స్టార్ట్‌ చేశాం. అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 8 డిగ్రీలుగా ఉంది. విపరీతమైన ఎదురు గాలుల మధ్య, దాదాపు 10గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించి 250 కిలోమీటర్ల దూరంలోని చైనా బోర్డర్‌కు దగ్గర్లోని ఆ గ్రామానికి 26న చేరుకున్నాం. హాన్లేలో రెండ్రోజులు కళ్లు తిప్పుకోనివ్వని ల్యాండ్‌ స్కేప్స్‌ మధ్య గడిపి హాన్లే అబ్సర్వేటరీ, మోనాస్టరీలు సందర్శించాం. స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను చూశాం. అదే వాతావరణ పరిస్థితుల్లో తిరుగు ప్రయాణం ప్రారంభించాం.

లేహ్‌కి 220 కి.మీ దూరంలోని కార్గిల్‌ వైపుగా రైడ్‌ స్టార్ట్‌ చేసి, ఫోట్యులా పాస్, నామిక్లా పాస్‌ అనే రెండు ఎత్తయిన శిఖరాలను దాటుకుంటూ సాగిపోయాం. దారిలో కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ప్యాంగాగ్‌ లేక్‌ ఎదురైంది. అది మైనస్‌ 22 డిగ్రీల చలికి మొత్తం ఘనీభవించి పోయింది. మంచుతో కప్పబడిపోయిన ఆ లేక్‌ మీద రైడ్‌ వర్ణించలేని అనుభూతి. అయితే అది కూడా బాగా ప్రమాదకరమైనదే. అసలు అక్కడ లేక్‌ ఉండేదంటే నమ్మలేం.. అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవచ్చు.. కానీ ఎముకల్ని అమాంతం కోసేస్తున్నట్టు ఉండే చలిగాలులను తట్టుకోలేం. మార్చి 1న ద్రాస్‌ చేరుకున్నాం. ఆ ప్రాంతం మొత్తం ఒక మంచుదుప్పటి కింద దాక్కుని ఉంది. కనుచూపుమేర తెల్లదనమే.  మనుషులు ఉండే ప్రపంచపు రెండో అత్యంత చల్లని ప్రాంతం అది. అక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. మ్యాగీ లాంటివి వండుకుని తిన్నాం. దారిలో భారతీయ సైన్యం నిర్మించిన ద్రాస్‌ వార్‌ మెమోరియల్‌ నిర్మాణాన్ని సందర్శించాం.

ఏంటీ రైడ్‌ స్పెషల్‌?  
లేహ్‌ లఢఖ్‌కు బైక్‌ రైడ్స్‌ను సిటీ రైడర్స్‌ బాగా ఇష్టపడతారు. అయితే అలా వెళ్లే వారంతా మే చివరి నుంచి అక్టోబర్‌ వరకు మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత లేహ్‌ లఢఖ్‌కు ఉన్న రెండు ప్రధాన దారులు మంచుమయంగా మారిపోతాయి. అసలు ఫిబ్రవరి నెలలో ఆ ప్రాంతానికి రైడ్‌ అనేది కనీసం ఊహించ లేనిదనే చెప్పాలి. అందుకే వీరి రైడ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది బైకర్స్‌ కమ్యూనిటీ అయింది.   

కష్టమైన రైడ్‌...
స్వల్ప పరిమాణంలోని ఆహారంతోనే ఇదంతా సాగించాం. ఇది చాలా కష్టమైన రైడ్‌. ఈ సీజన్‌లో గ్రామాలు ఉంటాయి. కానీ జనం బాగా పలచగా మాత్రమే ఉంటారు. స్వల్ప పరిమాణంలో మాత్రమే ఫుడ్‌ లభ్యమవుతుంది. తక్కువ ఆక్సిజన్‌ స్థాయిల వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. హై యాటిట్యూడ్‌ సిక్‌నెస్‌ తీవ్రమైన సమస్యతో ఎదుర్కోవాల్సి వచ్చింది. మా చూపు కూడా బాగా మందగించింది. రోడ్డును స్పష్టంగా చూడలేకపోయాం. – పృదు మెహతా, బైకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement