సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు పవిత్ర కార్తీకమాసం. మరోవైపు వీకెండ్ వరుస సెలవులు. దానికి తోడు ఆహ్లాదకరమైన శీతాకాలం. మరింకేం. అన్నీ కలిసొచ్చాయి. దీంతో నగర వాసులు సొంత ఊళ్లకు, పర్యాటకస్థలాలకు పయనమవుతున్నారు. నాలుగు రోజులు సరదాగా గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సుల్లో రద్దీ కనిపించింది. అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. శుక్రవారం ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ, రైల్వే అధికారుల అంచనా. వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది పర్యటనలకు తరలి వెళ్తున్నారు.
మరి కొందరు పర్యాటక ప్రియులు శ్రీలంక, థాయ్‌లాండ్, దుబాయ్ వంటి విదేశాలకు స్వల్ప కాలిక టూర్లకు వెళ్తున్నారు. పర్యాటకుల అభిరుచికి తగిన ట్లుగా ఐఆర్‌సీటీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా కార్తీక మాసంతో పాటు సెలవులు కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య ఇతోధికంగా పెరిగింది. సుమారు 17 శాతం వరకు దేశీయ ప్రయాణాలు పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్ ట్రావెల్ సంస్థ పేర్కొంది. పర్యాటకుల అభిరుచి మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి.
ఉత్తరాదికి పెరిగిన రద్దీ...
చాలామంది నగరవాసులు, విద్యార్థులు ఉత్తరాదికి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ఢిల్లీ, జైపూర్, పట్నా, వారణాసి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ పెరిగినట్లు రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ వారణానికి వెళ్లే వారిలో ఎక్కువ శాతం ఆధ్మాత్మిక పర్యాటకులు ఉండగా, జైపూర్, తదితర ప్రాంతాలకు వెళ్లే వారిలో టూరిస్టులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే పట్నా ఎక్స్‌ప్రెస్, దాణాపూర్, రాజ్‌కోట్, తదితర రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ రైళ్లలో నెల రోజుల క్రితమే బెర్తులు పూర్తిగా రిజర్వు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అన్ని రైళ్లలోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా తుంగభద్రలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎక్కువ మంది కర్నూలు తరలి వెళ్తున్నారు. అలాగే రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ముందస్తుగానే బుక్ అయ్యాయి. శుక్ర, శని వారాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పంచారామాలకు ఆర్టీసీ ప్యాకేజీ...
తెలంగాణలోని పంచ శైవక్షేత్రాలైన వేముల వాడ (రాజరాజేశ్వరాలయం), కాళేశ్వర (ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి), రామప్పగుడి (రామలింగేశ్వర స్వామి) వెయి స్తంభాలగుడి (రుద్రేశ్వర స్వామి), పాలకుర్తి (సోమనాథ స్వామి), ఏపీలోని అమరావతి (అమరేశ్వరాలయం), భీమవరం (సోమేశ్వరాలయం), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరాలయం), ద్రాక్షారామం (భీమేశ్వరాలయం), సామర్లకోట (కుమార రామ భీమేశ్వరాలయం)లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని దక్కన్ పంచ శైవక్షేత్రాలకు కార్తీక పౌర్ణమి ముందు రోజు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటను చార్జీ సూపర్‌లగ్జరీ రూ.1100, రాజధాని రూ.1500 చొప్పున ఉంది. ఏపీలోని పంచారామాలకు కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు బస్సులు బయలుదేరుతాయి. ఈ పర్యటనకు సూపర్‌లగ్జరీ చార్జీ రూ.1800 కాగా, రాజధాని చార్జీ రూ.2450 చొప్పున ఉంది. దర్శనం టిక్కెట్‌లు, స్నాన వసతి కోసం మరో రూ.300 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఆదివారం బయలుదేరి మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకొనేలా ఈ బస్సులను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment