
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రోన్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక చార్మినార్ సమీపంలో అర్దరాత్రి డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డ్రోన్ ఆపరేట్ చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు. వివరాలు.. గురువారం అర్ధరాత్రి సమయంలో చార్మినార్ పరిసర ప్రాంతంలో డ్రోన్ చక్కర్లు కొడుతున్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుపర్ణ నాథ్ అనే 26 ఏళ్ల యువతి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆమె నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని కెమెరా, రిమోట్ కంట్రోల్‌ను సీజ్ చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
కాగా ఉగ్రవాద దాడుల ప‍్రమాదం పొంచి ఉందన్న ఇంటిలెజిన్స్ ఏజెన్సీల హెచ్చరికల మేరకు గత ఏప్రిల్ నుంచి హైదరాబాద్ పోలీసులు అనుమతి లేకుండా డ్రోన్‌లు ప్రయోగించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఏరియల్ వెహికల్ ఆపరేషన్స్, ఏరియల్ సర్వే నిర్వహించాలనుకునే ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్ అథారిటీస్ ముందుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ సిటీ సీపీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment