భారీ భద్రత | Hyderabad Police Security For Ganesh Nimajjanam | Sakshi
Sakshi News home page

భారీ భద్రత

Published Wed, Sep 4 2019 12:23 PM | Last Updated on Mon, Sep 9 2019 11:50 AM

Hyderabad Police Security For Ganesh Nimajjanam - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చవితి సందడి మొదలైంది. బుధవారం నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్‌ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా, రూఫ్‌టాప్‌ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్‌ ఏరియాలు, నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్‌టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్‌ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించనున్నాయి. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ ‘స్టాండ్‌ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు.

కమిషనరేట్లలో ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల, పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతో పాటు కీలక మండపాలను ప్రతిరోజు బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీ చేయనున్నాయి. మండపాల వద్ద ఉండే వలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల్ని గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణనివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 10న మొహర్రం కావడంతో బీబీకా ఆలం ఊరేగింపు సైతం జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 62వేల మండపాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికి నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా 10,702 మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయినవే కావడం గమనార్హం. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేçస్తున్న సందర్భంలో సాధారణంగా అనుమతి తీసుకోవట్లేదు. 

సాగర్‌ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు...
కీలక నిమజ్జనాలు జరిగే హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్‌ ఎన్‌.విశ్వప్రసాద్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సాగర్‌లో 25వేల నుంచి 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజైన బుధవారం నుంచి ఈ సందడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారీ ప్రతి క్రేన్‌ వద్ద నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలు, సమయాలు తెలుసుకోవడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం అవలంభిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది ఉపకరిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పటిష్ట నిఘా, బందోబస్తు కోసం గతేడాది మాదిరే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసుల సూచనలివీ...
మండపం వద్ద నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలి.  
గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అనేది గమనిçస్తుండాలి.
పార్కింగ్‌ ప్రాంతాలు, అక్కడ నిలిపి ఉంటున్న వాహనాలపైనా కన్నేసి ఉంచాలి.  
రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల మధ్య లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు.
మండపం పైనుంచి వెళ్లే కరెంట్‌ తీగలు, హైటెన్షన్‌ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  
అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు నేరమే కాదు... ప్రమాదం కూడా అనేది గుర్తుంచుకోవాలి.
రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమం.
మండపం దాదాపుగా మండే స్వభావం ఉన్న థర్మకోల్, చెక్క తదితర వస్తువులతో నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వెలిగించే దీపాలు, అగరబత్తీలు, హారతి కర్పూరం విషయంలో జాగ్రత్తలు
తీసుకోవాలి.  
ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరం.
ఇతరుల మనోభావాలు దెబ్బతినే, రెచ్చగొట్టేలా చేసే చర్యలు, వ్యాఖ్యలు ఉండకూడదు.

విగ్రహాలవివరాలివీ...  
సంవత్సరం    విగ్రహాలు
 
2006          15,000
2007          16,500
2008          18,200
2009          19,400
2010          20,600
2011          21,900
2012         25,000  
2013         30,000
2014         37,600
2015         42,400
2016         56,000
2017         58,000
2018         60,000
2019         62,000   (దాదాపు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement