Ganesh Chaturthi 2019
-
హబ్సిగూడలో గ్యాంగ్ వార్
తార్నాక: గణేష్ నిమజ్జన ర్యాలీ సందర్బంగా డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్‌కు దారితీసింది. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8లో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...ఈనెల 14న రాత్రి 1.30గంటల ప్రాంతంలో రామంతాపూర్ రహదారిలోని మధురాబార్ సమీపంలో వినాయక నిమజ్జన ర్యాలీ కొనసాగుతోంది. ఈ సందర్బంగా అనిల్ అనే కారు డ్రైవర్, రామంతాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి సతీష్ మధ్య డ్యాన్స్ విషయంలో గొడవ జరిగింది. దీంతో వారిరువురు రెండు గ్యాంగులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. స్థానికులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సతీష్ తన స్నేహితులతో కలిసి హబ్సిగూడ రవీంద్రనగర్ ఎస్ఆర్ అపార్టుమెంట్ వద్ద ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో అనిల్ 15 మందితో కలిసి అక్కడికి వచ్చి సతీష్, అతని స్నేహితులపై దాడికి దిగగా, సతీష్ అతని స్నేహితులు ప్రతి దాడి చేశారు. ఇరువర్గా లు రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టుకున్నారు. అనిల్ గ్రూప్ వ్యక్తులు సతీష్‌ను కర్రలతో చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయందోళనకు గోనయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసు లు గాయపడిన సతీష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాతో వెలుగులోకి...? రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు వెలుగులోకివచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజీ వీడియోవైరల్‌గా మారడంతో కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ముగ్గురు నిందితుల అరెస్టు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఓయూ సబ్ ఇన్స్పెక్టర్ హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. రామంతాపూర్‌కు చెందిన అనిల్, హబ్సిగూడకు చెందిన కరుణాకర్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
వైరల్ వీడియో: ఒక్కసారిగా అంబులెన్స్ రావడంతో..
పుణె: వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ అంబులెన్స్ రావడంతో భక్తులు నిట్టనిలువుగా చీలిపోయి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటన పుణెలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పుణెలోని లక్ష్మీనగర్ రోడ్డులో వినాయక శోభాయాత్ర గురువారం అట్టహాసంగా సాగుతున్న వేళ అదే దారిలో అంబులెన్స్ వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన అంబులెన్స్ చూసిన అక్కడి భక్తులు, ప్రజలు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. రోడ్డు మీద రద్దీని క్లియర్ చేసి.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా దారి కల్పించారు. వినాయక శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు, భక్తులు రోడ్డుకిరువైపులా నిలువుగా చీలిపోయి.. అంబులెన్స్ ముందుకు కదిలేందుకు వీలుగా దారి ఇచ్చారు. కొందరు యువకులు అంబులెన్స్ ముందు పరిగెడుతూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాహనం ముందుకు కదిలేలా చూశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఆపత్కాలంలో మానవీయత ఉట్టిపడేలా వ్యవహరించిన పుణె వాసులను నెటిజన్లు కొనియాడారు. -
నేరస్తులను పట్టుకునేదెన్నడు?
అనంతపురంలో సంచలనం కలిగించిన నేరాల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. ఇళ్లల్లో దొంగతనాలు పక్కన పెడితే పోలీసులకే సవాల్ విసిరేలా నగర నడిబొడ్డున కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు (టౌన్‌బ్యాంకు) రాబరీ కేసులో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వినాయక నిమజ్జనం, మొహర్రం వేడుకలు వరుసగా రావడంతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో మొత్తం అధికారులను బందోబస్తుకు నియమించారు. దీంతో జిల్లా కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న కీలక నేరాల దర్యాప్తులు అటకెక్కాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇటీవల శ్రీకంఠం సర్కిల్‌నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఫర్టిలైజర్, ఎరువుల అంగళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. అంతకు ముందుకు జాతీయ రహదారి, ప్రధాన కూడళ్లలోని మెడికల్‌షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. వారం రోజుల క్రితం పాతూరు చెన్నకేశవాలయంలో చోరీ జరిగింది. హుండీలోని రూ. 20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతకుముందు టవర్‌క్లాక్ కూతవేటు దూరంలో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండికిరీటం, ముక్కుపుడక సైతం అపహరణకు గురయ్యాయి. నిత్యం రద్దీతో పాటు సీసీ కెమెరా నిఘా వ్యవస్థ ఉంటున్న ప్రాంతాల్లోనే దొంగలు యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ⇔ అర్బన్ బ్యాంకులో దోపిడీ.. పోలీసులకే సవాల్ నగర నడిబొడ్డున సుభాష్‌రోడ్డులో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు (టౌన్ బ్యాంకు)లో గత నెల 30న సినీ ఫక్కీలో జరిగిన రాబరీ పోలీసులకే సవాల్ విసిరింది. దాదాపు 16 సీసీ కెమెరాలతో అలారం వ్యవస్థ, విధుల్లో సెక్యూరిటీ గార్డు ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా బ్యాంకుకు కన్నం వేసి పటిష్ట భద్రత నడుమ ఉండే లాకర్లను ధ్వంసం చేసి కిలో బంగారం, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బ్యాంకు రాబరీ ఘటనలో ఇది రెండవది. ⇔ ఏడాది క్రితం జేఎన్టీయూలోని స్టేట్‌బ్యాంకులో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. అయితే ఈ కేసును అప్పటి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారం లోగానే చేధించారు. అయితే ఇటీవల జరిగిన అర్బన్ బ్యాంకు ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించలేదని సమాచారం. ఇందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రంగంలోకి దింపినా క్లూ కూడా సంపాదించలేనట్లు తెలిసింది. అర్బన్ బ్యాంకు ఘటనలోనే కాకండా ఇతర నేరాల్లో కూడా నేరస్తులను పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇంత వరకూ పోలీసులు చూపిస్తున్న అరెస్ట్‌ల్లో ఎక్కువశాతం పాత నేరస్తులే ఉండడం గమనార్హం. నేరాల నియంత్రణలో విఫలం నగరంలో ఒక్కో పోలీసుస్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు నుంచి నలుగురు ఎస్ఐలు.. నాల్గవ పట్టణానికి అయితే ఏకంగా ఆరుగురు ఎస్ఐలు... పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. తిప్పి కొడితే ఒక్కో అధికారికి ఒక కిలోమీటరు దూరం పరిధి కూడా లేదు. అయినా నేరాలకు ‘అనంత’ అడ్డాగా మారుతోంది. గడిచిన రెండు నెలల్లో జిల్లా కేంద్రంలో జరిగిన నేరాలు సంఖ్య జిల్లా వ్యాప్తంగా కూడా చోటు చేసుకోలేదు. అన్ని పోలీసు స్టేషన్లకూ మోతాదుకు మించి సిబ్బందిని ఎస్పీ నియమించారు. అయినా నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు అంతో ఇంతో ట్రాక్ రికార్డు ఉన్న వారే. కానీ వారి ప్రతాపమంతా చిన్నాచితకవారిపై చూపిస్తున్నారు తప్ప నేరాలను అడ్డుకోవడంలో చూపించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పూర్తికాని నిమజ్జనం.. భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదారాబాద్: వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. శుక్రవారం నాటికి కూడా నిమజ్జనం పూర్తి కాకపోవడంతో ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఐదు వందలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నేటి సాయంత్ర వరకూ కొనసాగనుంది. దీని కారణంగా నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విగ్రహాలు గంగఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు. -
ఆలస్యంగా వినాయక శోభాయాత్ర
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ సామూహిక నిమజ్జనాల శోభాయాత్ర గురువారం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు అపశృతుల మినహా ఆద్యంతం ప్రశాంతంగా కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరం నలువైపుల ఉన్న చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులతో కలిసి పలు ప్రాంతాల్లో నిమజ్జనాల సందడి నెలకొంది. మొత్తమ్మీద సాయంత్రానికి వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం గత ఏడాది కంటే దాదాపు గంట ఆలస్యంగా జరిగిది. నిమజ్జన శోభాయాత్ర మార్గం పొడవునా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయితే వరుస నిమజ్జనాల నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది సామూహిక నిమజ్జనం రోజు విగ్రహాల సంఖ్య కాస్తా తగ్గింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే సందడి నెలకొనగా, సాయంత్రం వరకు కీలక ప్రాంతాలైన చార్మినార్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో సందడి కనిపించలేదు. చార్మినార్ వద్ద ఉదయం నుంచి అడపాదడపా ఒక్కో విగ్రహం మినహా ప్రధాన ఊరేగింపు కనిపించలేదు. మధ్యాహ్నం తర్వాత విగ్రహాల సంఖ్య పెరగడంతో ఎనిమిదిన్నర గంటల పాటు ఏకధాటిగా కొనసాగింది. శుక్రవారం సైతం నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పాతబస్తీ మీదుగా సాగే శోభాయాత్రలు అత్యంత కీలకమైనవి కావడంతో నగర పోలీసులు వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతి ఏడాది ఉదయం నుంచి చార్మినార్ మీదుగా ఊరేగింపులు సాగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఇంకా త్వరగా పూర్తి చేయించాలని పోలీసులు భావించినా అది సాధ్యం కాలేదు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు విగ్రహాల ఆటోలు, ర్యాలీల మినహా సందడి కనిపించకపోవడంతో చార్మినార్ పరిసరాలు బోసిపోయాయి. ఏటా నిమజ్జనం రోజు మధ్యాహ్నం మక్కా మసీదులో జరిగే ప్రార్థనల ముగింపు కోసం పోలీసులు ఊరేగింపులకు ఆపేవారు. అయితే ఈసారి ఆ సమయానికి ఊరేగింపులు ఆ సమీపంలోకి కూడా చేరుకోలేదు. గణేష్ ఉత్సవాలకు కేంద్రమైన బాలాపూర్ గణేష్ విగ్రహం గత ఏడాది కంటే ఆలస్యంగా చార్మినార్ వద్దకు వచ్చింది. సాయంత్రం 4 గంటల తర్వాత చార్మినార్ పరిసరాలకు శాలిబండ, సర్దార్‌మహల్, లాడ్ బజార్ రోడ్ల నుంచి ఒక్కసారిగా విగ్రహాలతో కూడిన లారీలు రావడంతో సందడి నెలకొంది. గతంలో విగ్రహాలతో వచ్చిన లారీల్లో దాదాపు ప్రతి వాహనం చార్మినార్ చుట్టూ తిరిగి ముందుకు సాగేది. ఈసారి అనేకం చుట్టూ తిరగకుండా నేరుగా ముందుకు సాగేలా ఏర్పాటు చేశారు. పోలీసు విభాగం పాతబస్తీ నుంచి వచ్చే విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ పెరిగిన తర్వాత ఎంజే మార్కెట్ దగ్గర వాటికి గ్రీన్‌ఛానల్ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ వద్ద కూడా ఈ విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తూ నిమజ్జనం చేశారు. అధికారులు చేసిన మార్పు చేర్పులు, కృషి ఫలితంగా ప్రధాన ఊరేగింపు రాత్రికి పాతబస్తీ దాటింది. మధ్యాహ్నం వరకు పలుచగా ఉన్న ఎంజే మార్కెట్ సాయంత్రం 4.00 గంటల తర్వాత కిక్కిరిసింది. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జనం పోటెత్తారు. ఈ ఏడాది మూడో రోజు నుంచే పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. నగరంలో ఉన్న విగ్రహాల్లో దాదాపు 50 శాతానికి పైగా నిమజ్జనం చేశారు. సాయంత్రానికి ఎంజే మార్కెట్ కూడలికి అన్ని వైపుల నుంచి వాహనాలు రావడంతో సందడి కనిపించింది. అన్ని విగ్రహాలూ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కావడానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో నిర్ణీత సమయం తర్వాత వచ్చే విగ్రహాల లారీలను నెక్లెస్‌రోడ్‌లోకి పంపి, సీరియల్ ప్రకారం నిమజ్జనానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద కూడా శుక్రవారం సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. -
మహానగరమా మళ్లొస్తా
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం భక్తజనసంద్రమైంది. భక్తుల కేరింతలతో హోరెత్తింది. ‘జైబోలో గణేశ్ మహరాజ్ కీ’ నినాదాలతో మార్మోగింది. వినాయక నిమజ్జన వేడుకలు గురువారం నగరంలో కనుల పండువగా జరిగాయి. మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం ముగిసిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. నగరంలోని అన్ని రహదారులు ట్యాంక్‌బండ్ వైపునకు దారితీశాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ జనంతో కిక్కిరిసిపోయాయి. భజనలు, కీర్తనలు, కోలాటాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అటు ట్యాంక్‌బండ్ వైపు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన 40 క్రేన్ల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేశారు. వైవిధ్యభరితమైన విగ్రహాలతో ట్యాంక్‌బండ్ శోభాయమానంగా కనిపించింది. బాలాపూర్ లడ్డూ వేలం ఆలస్యంగా మొదలు కావడంతో పాతబస్తీ నుంచి వచ్చే ప్రధాన యాత్ర కూడా ఆలస్యమైంది. మొత్తంగా ఒకట్రెండు విషాద ఘటనలు మినహా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. వెల్లివిరిసిన సంస్కృతి ఖైరతాబాద్ ద్వాదశాదిత్య గణపతి నిమజ్జన వేడుకలు ఉదయం 7:13 గంటలకు ఖైరతాబాద్ నుంచి మొదలై మధ్యాహ్నం 1:45 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నంబర్ వద్ద పూర్తయ్యాయి. ఖైరతాబాద్, సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తాల మీదుగా సాగిన శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. 61 అడుగుల మహాగణపతి విగ్రహంతో సెల్ఫీ తీసుకొనేందుకు జనం పోటీ పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒగ్గుడోలు, బోనాల ప్రదర్శనలు, కళాకారుల ఆటాపాటలతో తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసింది. నిమజ్జనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాట జరగింది. రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు కూలిపోయాయి. బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రెండు గంటలు ఆలస్యం కావడంతో... ప్రతిఏటా మధ్యాహ్నం 2గంటలకే నిమజ్జనం పూర్తవుతుండగా, ఈసారి సాయంత్రం 6 తరువాత జరిగింది. దీంతో మిగతా విగ్రహాల తరలింపు కూడా ఆలస్యమైంది. అబిడ్స్, సుల్తాన్‌బజార్, కోఠి, చోటా బజార్, జియాగూడ, చెప్పల్‌బజార్, లంగర్‌హౌస్, అత్తాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, అంబర్పేట్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. వెరైటీ గణపతులు... వెరైటీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూషికవాహనుడై, పద్మనాభుడై, యాదాద్రి ఆలయ ఆకృతి అలంకృతుడై, తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు పలు విగ్రహాలను కాషాయ జెండాలు, త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే విధంగా చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి తీసుకొచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాల్లో యువత సందడి ఎక్కువగా కనిపించింది. మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో చిరువ్యాపారుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...‘మహా’ శోభాయాత్ర సాగిందిలా.. ఖైరతాబాద్: దాదాపు 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో విశేష పూజలందుకున్నశ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన ఊరేగింపు గురువారం ఉదయం 7.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.45 గంటలకు ముగిసింది. భారీకాయుడుహుస్సేన్ సాగర్‌లో ప్రశాంతంగా నిమజ్జనమయ్యాడు. అశేష భక్తజనం వెంట తరలి రాగా 61 అడుగుల ఎత్తులో మహాగణపతి ఊరేగుతూ సాగర తీరానికి తరలివెళ్తున్న దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో బంధింస్తూ ఆనందం పొందారు. ♦ బుధవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత భక్తుల దర్శనాలు నిలిపివేశారు ♦ 11 గంటలకు చిన్న క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి రాక ♦ 12.30కు విష్ణుమూర్తి విగ్రహాన్ని నిమజ్జనానికి మరో వాహనంపై పెట్టి తరలించారు ♦ 12.30కు ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్‌రాజ్, శిల్పి రాజేంద్రన్ కలశ పూజ ♦ గురువారం 3.30 నిమిషాలకు మహాగణపతిని పైకి తేల్చి 3.40 గంటలకు ఎస్టీసీ ట్రాలర్ వాహనంపై చేరిక ♦ ఉదయం 7.13 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం ♦ 8.30 గంటలకు సెన్షేన్ థియేటర్ ♦ 8.55కు రాజ్‌దూత్ చౌరస్తా ♦ 9.08కు టెలిఫోన్ భవన్ ♦ 9.30 గంక్కు ఎక్బాల్ మినార్ చౌరస్తా ♦ 10.43కు తెలుగుతల్లి చౌరస్తా ♦ మధ్యాహ్నం 12.24కు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్దకు మహాగణపతి ♦ 12.45లకు మహాగణపతికి చివరి పూజలు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ♦ 12.52కు వెల్డింగ్ తొలగింపు పనులు ♦ 1.15కు మోడ్రన్ క్రేన్ అపరేటర్ దేవేందర్‌సింగ్ పూజలు ♦ 1.21కి మహాగణపతి విగ్రహాన్ని పైకి లేపి నలువైపులా తిప్పి భక్తులకు కనువిందు చేశారు ♦ 1.45 గంటలకు మహాగణపతినినిమజ్జనం మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావిస్తామని చెప్పినా చివరి ఘట్టంలో నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా కొంచెం పక్కన నిమజ్జనం చేయడంతో విగ్రహం 80 శాతం మాత్రమే నీటమునింది. -
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బంద్
బంజారాహిల్స్: గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్ రోడ్ల వైపు నుంచి తరలి వచ్చే వాహనాల కారణంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ను ట్రాఫిక్ పోలీసులు గురువారం ఉదయం నుంచి మూసివేశారు. మొబైల్ బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన పోలీసులు భక్తుల వాహనాలను అనుమతించలేదు. కేవ లం ట్యాంక్‌బండ్‌లో నిమజ్జన దృశ్యాలు తిలకించేందుకు వెళ్ళే సందర్శకులకు మాత్రమే నడిచి వెళ్ళేందుకు అనుమతించారు. ఈ ఆంక్షలు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు
-
పీఓపీ విగ్రహాలే అత్యధికం
సాక్షి,సిటీబ్యూరో: గతానికి భిన్నంగా ఈసారి గ్రేటర్ నగరంలో పర్యావరణ హిత మట్టివిగ్రహాల ఏర్పాటుపై సిటీజనుల్లో అవగాహన పెరిగినప్పటికీ...ఈసారి సుమారు 50 వేల ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్లలో పూజలందుకునే చిన్న పరిమాణంలో ఉన్న మట్టి ప్రతిమలను నగరవాసులు ఎక్కువగా ప్రతిష్టించినప్పటికీ..కాలనీలు, బస్తీల కూడళ్లలో ఏర్పాటుచేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌వే అత్యధికంగా ఉన్నాయి. మహానగరం పరిధిలో సుమారు 30 జలాశయాల్లో వినాయకనిమజ్జనం జరగనున్నప్పటికీ..అత్యధిక విగ్రహాలు నిమజ్జనం జరిగే 21 చెరువుల్లో నీటి కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. ఇక జలమండలి అధికారులు శోభాయాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం శోభాయాత్ర జరిగే మార్గంలో 115 తాగునీటి క్యాంపులను ఏర్పాటుచేయనుంది. ఈ క్యాంపుల్లో 32 లక్షల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైతే నీటి ప్యాకెట్ల సంఖ్యను పెంచుతామని ఎండీ దానకిశోర్ తెలిపారు. 21 చెరువుల కాలుష్యంపై పీసీబీ నజర్.. నవరాత్రి పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేసే చెరువులు, కొలనుల కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. గ్రేటర్ పరిధిలో హుస్సేన్‌సాగర్ సహా 21 చెరువుల్లో కాలుష్య మోతాదును పీసీబీ నిపుణులు లెక్కించనున్నారు. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగే రోజులు, నిమజ్జనం తరవాత ఆయా జలాశయాల్లో నీటి నమూనాలను సేకరించి వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. వీటిలో మీరాలం(బహదూర్‌పురా), లంగర్‌హౌజ్ లేక్, సరూర్‌నగర్ లేక్, రంగధాముని చెర్వు, సఫిల్గూడా చెర్వు, హస్మత్‌పేట్‌లేక్, అంబర్‌చెర్వు(కూకట్పల్లి), కాప్రాచెర్వు, దుర్గంచెర్వు, పెద్దచెర్వు, లింగంచెర్వు(సూరారం), ముండ్లకుంట(మూసాపేట్), పత్తకుంట(రాజేంద్రనగర్), నాగోల్‌చెర్వు, కొత్తచెర్వు(అల్వాల్), నల్లచెర్వు(ఉప్పల్), కాయిదమ్మకుంట(హఫీజ్‌పేట్), గుర్నాథ్‌చెర్వు(మియాపూర్), సాఖిట్యాంక్(పటాన్‌చెర్వు), రాయసముద్రం (రామచంద్రాపురం), గోపిచెర్వు(లింగంపల్లి) చెర్వులున్నాయి. ఈ చెరువుల్లో నిమజ్జనానికి ముందు ఆగస్టు 26న, నిమజ్జనం జరిగే సెప్టెంబరు 3,5,8,11,12 తేదీలతోపాటు సెప్టెంబరు 20న (నిమజ్జనం అనంతరం)నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించనున్నారు. ఈ జలాశయాల నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, గాఢత, బ్యాక్టీరియా, ఘన వ్యర్థాలు, కాఠిన్యత, విద్యుత్ వాహకత, కోలిఫాం, భారలోహాలు ఇలా అన్ని రకాల కాలుష్యాలను లెక్కించనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఆయా జలాశయాల్లోకి సుమారు యాభైవేల వరకు విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారనున్నాయి. ఈ విషయంపై స్థానికులను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
అప్డేట్స్: ఘనంగా నిమజ్జనం
హైదరాబాద్ : ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఈ సారి వినాయకుడు పూర్తిగా మునగటం విశేషం. మహాగణపతిని సాగనంపటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఎటువంటి ఆటంకం లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఘనంగా నిమజ్జనం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ....గణేష్ నిమజ్జనంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతి భద్రతలను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దేశం మొత్తం చూస్తుందని, లక్షల మంది భక్తులు ఆయనను దర్శించుకున్నారన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం, శోభాయాత్రను హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. చార్మినార్ చేరుకున్న బాలాపూర్ గణనాధుడు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పాతబస్తీలో అపశ్రుతి పాతబస్తీ బహుదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెట్టె సమయంలో రవీందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడి పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర చికిత్స కోసం వెంటనే అతడిని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్ ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ మార్గ్‌లో గణేశుని నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. ఖైరతాబాద్ గణేశుని మహా నిమజ్జనానికి రెడీగా ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్టీఆర్ మార్గ్‌లోని వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్‌వైపు మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఖైరతాబాద్ గణేశుడు బాలాపూర్ లడ్డు @ రూ. 17.60 లక్షలు బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు. బాలాపూర్ లడ్డు వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య వినాయకుల శోభాయాత్ర వైభవోపేతంగా జరుగుతోంది. శోభాయాత్ర సందడితో రహదారులన్ని కొత్త రూపు సంతరించుకున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కదిలిన బాలాపూర్ గణేశుడు బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర అనంతరం లడ్డు వేలం పాట జరగనుంది. గతేడాది లడ్డు రూ. 16.60 లక్షలు పలికింది. దీంతో ఈ సంవత్సరం లడ్డు వేలం పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలాపూర్ గణేశుడు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రేన్ నెంబర్ 6 వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల్లో బొజ్జగణపయ్యల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాయి. నగరంలోని వీధులన్నీ శోభయాత్ర వెలుగులను సంతరించుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొదటిసారిగా గూగుల్ మ్యాప్స్‌లో ‘శోభాయాత్ర’
సిటీలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర జరగనున్న నిమజ్జనోత్సవం కోసం అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, శానిటేషన్, ఫైర్, వైద్యారోగ్య, విపత్తుల నివారణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీంను నియమిస్తున్నారు. ఈ టీంలో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి వీరు వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడతారు. ఆయా చెరువులు, కొలనులు, హుస్సేన్‌సాగర్ వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. అటు బందోబస్తు కోసం పోలీసులు..ఇటు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.గూగుల్‌మ్యాప్స్‌లో శోభాయాత్రను అప్డేట్ చేస్తారు. తద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ♦ శోభాయాత్ర 391 కి.మీ. ♦ వైద్యశిబిరాలు 27 ♦ నిమజ్జనం కోసం వసతులు 32 ప్రాంతాల్లో ♦ స్టాటిక్ క్రేన్లు 93 ♦ మొబైల్ క్రేన్లు 134 ♦ ట్రాఫిక్ సిబ్బంది 2100 ♦ ప్రత్యేక బస్సులు 550 ♦ ఆంక్షలు 66 ప్రాంతాల్లో ♦ హెల్ప్‌లైన్ నంబర్లు: 04027852482 , 9490598985 ,9010203626 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మహా ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర మార్గం పొడవునా రహదారులకు మరమ్మతులతోపాటు అవసరమైనంత పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లతోపాటు టాయ్లెట్లు తదితర సదుపాయాలు కల్పిస్తారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముఖ్యమైన 32 ప్రదేశాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ♦ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే 391 కిలోమీటర్ల మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్ ఏర్పాటు. ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్.ఎఫ్.ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తారు. మొత్తం 194 గణేష్ యాక్షన్టీమ్ల ఏర్పాటు . ♦ నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు..92 మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు. ♦ 32 ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్లు, 134 మొబైల్ క్రేన్ల ఏర్పాటు. ఈసారి నీటిపారుదల శాఖ ద్వారా కాకుండా జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ♦ 23 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీరు నింపి నిమజ్జనానికి ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో రోడ్ల రీకార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితరమైన వాటికి సంబంధించి 176 పనులకు రూ. 9.29 కోట్ల ఖర్చు. ♦ ఎస్సార్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆటంకాలు లేకుండా ప్రయాణం సాపీగా సాగేలా మరమ్మతులు. ♦ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమిస్తారు. ♦ సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్ల ఏర్పాటు . ట్యాంక్ బండ్, సరూర్‌నగర్ వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలు. పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్‌లో 7 బోట్లు, 44 స్పీడ్ బోట్లు. హుస్సేన్ సాగర్‌లో పదిమంది గజ ఈత గాళ్లు. ♦ జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్ల ఏర్పాటు. ఇందుకు రూ.99.41 లక్షల ఖర్చు. ♦ నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం చేస్తారు. ♦ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్ల ఏర్పాటు. ♦ రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్ విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు. ♦ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువులో నిమజ్జనం ద్వారా వెలువడే వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేకంగా వెయ్యి మంది నియామకం. ♦ జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 115 వాటర్ క్యాంప్‌ల ద్వారా 30,52,000 వాటర్ ప్యాకెట్ల పంపిణీ. ♦ శోభాయాత్ర మార్గంలో 36 ఫైర్ ఇంజన్ల ఏర్పాటు. ♦ విద్యుత్ శాఖ ద్వారా హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు మొత్తం 101 అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. ♦ శోభాయాత్ర మార్గంలో చెట్ల కొమ్మల నరికివేత. ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ హార్టికల్చర్ టీమ్ నియామకం. నిమజ్జనోత్సవానికి 550 ప్రత్యేక బస్సులు సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 12వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య 550 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిధానీ, లిబర్టీనుంచి ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, లకిడికాఫూల్ నుంచి బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, ఆల్‌ఇండియారేడియో నుంచి కోఠీ. ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, గాజుల రామారం, కూకట్పల్లి, పటాన్చెరు, బోరబండ, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడువన్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బ్రేక్‌డౌన్స్‌కు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఈడీ తెలిపారు. ఒకవేళ ఆకస్మాత్తుగా చెడిపోయినా వెంటనే వాటికి మరమ్మతులు చేసేందుకు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డు పై నుంచి పక్కకు తప్పించేందుకు సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఖైరతాబాద్: నగరంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని, సాగర తీరంలో క్రేన్ నెం.6 వద్ద ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావించేందుకు 20 ఫీట్లకు పైగా లోతు పెంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహాగణపతి నిమజ్జన ఊరేగింపు 12వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్దకు 12గంటలకు చేరుకుంటుందని, అన్ని పనులు పూర్తిచేసి ఒంటి గంటలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనాల సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దీని ద్వారా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 55 వేలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటుచేశారని, ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయయని, 12వ తేదీ చివరి రోజు 36 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విద్యాసాగర్, హెచ్ఎండీఏ ఎస్ఈ వరీందర్, ఎలక్ట్రికల్ డీఈ వేణుగోపాల్, ఐ అండ్ పిఆర్ రవికుమార్, మెడికల్ అండ్ హెల్త్ నాగేందర్ తదితరులు ఉన్నారు. కాగా ఖైరతాబాద్ మహాగణపతి మండపం వద్ద కూడా ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. -
‘బలవంతంగా నిమజ్జనం చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్ సాగర్‌లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు. మొదటి రోజు నుంచి కూడా అధికారులు భక్తులకు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, మేము బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు స్పష్టం చేశారు. ఒకవైపు ముస్లింల పండుగ మొహర్రం జరుగుతోంది.. మరోవైపు వినాయకచవితి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు అన్ని ఏర్పాట్లుచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సాగర్‌లో నిమజ్జనం అవుతుందని తెలిపారు. -
శోభాయాత్ర సాగే మార్గాలివే..!
సాక్షి, హైదరాబాద్: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగ వద్దకు చేర్చేందుకు చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నగరం మొత్తంలో ఇప్పటివరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తొమ్మిదో రోజు 7 నుంచి 8 వేల వరకు గణనాథులు నిమజ్జనమయ్యే అవకాశముంది. 11వ రోజు బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర 17 ప్రధాన రహదారుల్లో కొనసాగగా 10 వేల లారీలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు విదేశాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇక నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్రైవేటు వాహనాలకు శోభాయత్రలో అనుమతి ఉండదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలి’ అని సూచించారు. ‘వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 10 పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్, ఆనంద్‌నగర్ కాలనీ, గోసేవ సదన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధభవన్ వెనుక, లోయర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించాం. ఇక నిర్దేశించిన మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. మొత్తం 13 గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. చిన్న విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లకుండా చూస్తాం. శుక్రవారం ఉదయానికల్లా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ట్యాంక్‌బండ్‌పై వన్‌వేకు అనుమతి ఇస్తాం. ప్రజలు సహకరించాలి’ అని అనిల్ కుమార్ అన్నారు. -
ఈసారీ అడ్వాన్స్డ్ హుక్స్!
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకు క్రేన్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్డ్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లోని 138 క్రేన్లకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వీటి పనితీరును పరీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఉండే 40 క్రేన్లకు వాడుతున్నారు. వీటి వినియోగంపై మురళీధర్ గురు–శుక్రవారాల్లో క్రేన్ ఆపరేట్లకు శిక్షణ ఇచ్చారు. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్ళిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్ అడ్వాన్డ్స్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీన్ని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. ఇలాంటివి హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 క్రేన్లకు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ రిలీజ్ హుక్స్ ఈ హుక్స్ వినియోగించిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్‌గా రిలీవ్ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 క్రేన్లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేశాం. క్రేన్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా గంటకు 10 విగ్రహాలకు బదులుగా 25 నిమజ్జనం చేయవచ్చు. ఈ హుక్స్ పనితీరు పట్ల క్రేన్ ఆపరేటర్లు సైతం సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని అన్ని క్రేన్లకు వీటిని వాడటంతో పాటు కొన్నింటిని రిజర్వ్‌లో ఉంచుతున్నాం. – టి.మురళీధర్, శ్రీచక్ర ఇంజినీరింగ్ -
ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం
ఖైరతాబాద్: ఈ ఏడాది వినాయక ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గత 15 ఏళ్లుగా ఈ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఈసారి అంతకంటే ఘనంగా గ్రేటర్ పరిధిలో 55 వేల గణనాథుల విగ్రహాలు వెలిశాయన్నారు. ఈనెల 12న జరిగే వినాయక ప్రతిమల నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మేయర్ రామ్మోహన్, గ్రేటర్ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చవితి మూడో రోజు నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు ఈ నెల 12వ తేదీతో ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పురిస్థితులను సమన్వయం చేసేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతిని ఈ ఏడాది సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మహాగణపతి నిమజ్జనం చేసే సాగర్ జలాల్లో వ్యర్థాలను తొలగించారని, మరో నాలుగైదు రోజుల్లో 20 అడుగులకు పైగా లోతు వ్యర్థాలను తొలగించి భక్తులు, ఉత్సవ కమిటీ కోరిక మేరకు సంపూర్ణ నిమజ్జనం చేస్తామన్నారు. గతంలో మహాగణపతి నిమజ్జన ప్రక్రియ రెండు రోజులు పట్టేదని, ఈసారి గత సంవత్సరం లాగానే త్వరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి తలసాని,మేయర్ రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్ సాగర్ చెంత గంగా హారతికి ఏర్పాట్లు ఈ ఏడాది నిమజ్జన వేడుకల్లో ఖైరతాబాద్ గణపతికి మొదటిసారిగా హుస్సేన్ సాగర్ వద్ద గంగా హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్ఎంసీ, శానిటేషన్, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, పోలీస్, ట్రాఫిక్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతకముందు మహాగణపతిని నిమజ్జనం చేయనున్న ప్రాంతంలో చేపట్టిన పనులను మంత్రి, మేయర్, గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్, సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ, ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఎన్పోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్తో పాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. నిమజ్జనానికి 29 క్రేన్లు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనాల కోసం మొత్తం 29 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌లో ప్రత్యేకంగా బోట్లతో పాటు, స్మిమ్మర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. మహాగణపతిని ప్రతి ఏటా నిమజ్జనం చేసే ప్రాంతంలో అడుగున బండరాయి ఉన్నందున ఆ పక్కనే సాగర్‌లో లోతు పెంచి నమజ్జనం చేసేందుకు ఇప్పటికే 700 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్టు ఆయన వివరించారు. నిమజ్జన సమయానికి 25 అడుగులకు పైగా లోతు పెంచి విగ్రహం సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రేన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షిప్ట్‌ల వారిగా ఆపరేటర్లను అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు స్టాండ్ బైగా కూడా క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 162 కి.మీ. మార్గంలో శోభాయాత్ర నగరంలో ఇప్పటికే గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైందని, ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జన యాత్రను విజయవంతం చేసి నగర ఖ్యాతిని మరోసారి చాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద సాగర్‌లో దాదాపు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని, ప్రధానంగా 162కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్ర సాగుందన్నారు. ఈ మార్గంలో రోడ్ల మరమ్మతులు, ఇతర సౌకర్యాలను, అదనపు లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
కంప్యూటర్ గణేశుడు..
అమీర్‌పేట: వినాయక వేడుకల్లో భాగంగా అమీర్‌పేటలో కంప్యూటర్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజశేఖర్ కంప్యూటర్ పరికరాలను ఉపయోగించి గణనాథుడిని తయారు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో వెలసిన ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తులు క్యూ
-
నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది..
సాక్షి, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ఎంసీ రూ.కోట్లలోనే ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా... ఇక చిన్నాచితకా కొలనులకు లెక్కే లేదు. హుస్సేన్‌సాగర్ సహా జోన్ల పరిధిలోని 32 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం సమకూరుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల్లో నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా క్రేన్లు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. నిమజ్జనం జరిగే గంటలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే కార్మికులను బ్యాచ్‌ల వారీగా వినియోగించనున్నట్లు... వేతనాలనూ గంటల వారీగా చెల్లించనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి ‘సాక్షి’కి తెలిపారు. క్రేన్ల దగ్గర అవసరాన్ని బట్టి నలుగురు, ఎనిమిది మంది, 12 మంది కార్మికులతో కూడిన బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంచనా మేరకు క్రేన్ల అద్దె, సిబ్బంది వేతనాలకు దాదాపు రూ.8.24 కోట్లు ఖర్చు కానుండగా... ఆయా ప్రాంతాల్లోని నిమజ్జనాల పరిస్థితులు, పోలీసుల నుంచి అందుతున్న సమాచారం తదితర పరిగణనలోకి తీసుకుంటే వ్యయం రూ.9 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. కార్మికులు ఇలా... 8 మంది బ్యాచ్‌లు – 1,300 (10,400 మంది కార్మికులు) 12 మంది బ్యాచ్‌లు – 164 (1,968 మంది కార్మికులు) నలుగురు ఉండే బ్యాచ్‌లు – 776 (3,104 మంది కార్మికులు) మొత్తం బ్యాచ్‌లు – 2,240, మొత్తం కార్మికులు – 15,472 ఖర్చు ఇలా... క్రేన్ల అద్దె ♦ 15 టన్నుల క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.3,04,39,728. ♦ 30–70 టన్నుల క్రేన్లకు గంటకు రూ.6,825 చొప్పున మొత్తం రూ.2,03,11,200. ♦ మొబైల్ క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.2,44,02,096. కార్మికుల వేతనాలు ♦ 8 మంది బ్యాచ్‌కు రూ.3,794 చొప్పున రూ.49,32,200 ♦ 12 మంది బ్యాచ్‌కు రూ.5,664.50 చొప్పున రూ.9,28,978 ♦ నలుగురి బ్యాచ్‌కు రూ.1,897 చొప్పున రూ.14,72,072 ♦ మొత్తం ఖర్చు రూ.8,24,86,274 ఏ క్రేన్లు ఎన్ని? 15 టన్నుల క్రేన్లు – 52 30–70 టన్నుల క్రేన్లు – 41 మొబైల్ క్రేన్లు – 164 మొత్తం క్రేన్లు – 257 మొత్తం పని గంటలు – 13,440 -
లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు కూడా అక్కడక్కడా జరుగుతుంటాయి. చివరి నాలుగైదు రోజులు ఈ పోటీలు జోరుగా జరుగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు పర్వాలేదు కానీ... వాటిని తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ఎం రేడియో సంస్థ తార్నాకలో ఏర్పాటు చేసిన లడూŠుడ్ల తినే పోటీ జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తుచేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలూ ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతులతో ఉన్న టోపీలు, టీ–షర్టులు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా... లడ్డూలు తినే పోటీలు వంటివీ నిర్వహిస్తారు. పోటీలో పాల్గొని అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. కంగారులో ప్రాణాల మీదికి... ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడంతో పాటు ఏమాత్రం విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా... ఇరుక్కున్న వాటిని తొలగించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రేకియాను దెబ్బతీస్తాయి... ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నెర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగా గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందన్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తçస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు కలిగి ఉండి రాత్రి వేళల్లో తమప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. అక్కడ కచ్చితంగా ఒక్క వాలెంటీర్ అయినా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టెక్నికల్ గణేషా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే... గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్‌ను సిటీ కాప్స్ ఆన్లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్లైన్లోనే దాఖలు చేసి దాని ప్రింట్‌ఔట్‌తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. తనిఖీలపై పర్యవేక్షణ... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్‌ను టీఎస్ కాప్ యాప్‌లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. మండపాల జియో ట్యాగింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్‌కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. -
హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
భారీ భద్రత
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చవితి సందడి మొదలైంది. బుధవారం నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా, రూఫ్‌టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలు, నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ ‘స్టాండ్ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు. కమిషనరేట్లలో ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల, పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతో పాటు కీలక మండపాలను ప్రతిరోజు బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీ చేయనున్నాయి. మండపాల వద్ద ఉండే వలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల్ని గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణనివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 10న మొహర్రం కావడంతో బీబీకా ఆలం ఊరేగింపు సైతం జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 62వేల మండపాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికి నగర పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా 10,702 మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయినవే కావడం గమనార్హం. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేçస్తున్న సందర్భంలో సాధారణంగా అనుమతి తీసుకోవట్లేదు. సాగర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు... కీలక నిమజ్జనాలు జరిగే హుస్సేన్‌సాగర్, ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎన్.విశ్వప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సాగర్‌లో 25వేల నుంచి 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజైన బుధవారం నుంచి ఈ సందడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారీ ప్రతి క్రేన్ వద్ద నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలు, సమయాలు తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అవలంభిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది ఉపకరిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పటిష్ట నిఘా, బందోబస్తు కోసం గతేడాది మాదిరే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల సూచనలివీ... ♦ మండపం వద్ద నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలి. ♦ గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అనేది గమనిçస్తుండాలి. ♦ పార్కింగ్ ప్రాంతాలు, అక్కడ నిలిపి ఉంటున్న వాహనాలపైనా కన్నేసి ఉంచాలి. ♦ రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదు. ♦ మండపం పైనుంచి వెళ్లే కరెంట్ తీగలు, హైటెన్షన్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ♦ అక్రమ విద్యుత్ కనెక్షన్లు నేరమే కాదు... ప్రమాదం కూడా అనేది గుర్తుంచుకోవాలి. ♦ రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమం. ♦ మండపం దాదాపుగా మండే స్వభావం ఉన్న థర్మకోల్, చెక్క తదితర వస్తువులతో నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వెలిగించే దీపాలు, అగరబత్తీలు, హారతి కర్పూరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరం. ♦ ఇతరుల మనోభావాలు దెబ్బతినే, రెచ్చగొట్టేలా చేసే చర్యలు, వ్యాఖ్యలు ఉండకూడదు. విగ్రహాలవివరాలివీ... సంవత్సరం విగ్రహాలు 2006 15,000 2007 16,500 2008 18,200 2009 19,400 2010 20,600 2011 21,900 2012 25,000 2013 30,000 2014 37,600 2015 42,400 2016 56,000 2017 58,000 2018 60,000 2019 62,000 (దాదాపు) -
పీవీ సింధు ప్రత్యేక పూజలు
మణికొండ: బ్యాడ్మింటన్ ప్రపంచ విజేత, అర్జున అవార్డు గ్రహీత పీవీ సింధు మంగళవారం రాత్రి మణికొండ పంచవటికాలనీలో జరిగిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు వచ్చిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆల్‌కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సీతారాం, పంచవటి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భీంరెడ్డిలతో పాటు నాయకులు వారిని శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు. రాబోయే ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని వారంతా ఆకాంక్షించారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కాలనీ వాసులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో మణికొండ మాజీ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.రాఘవరెడ్డిలు పాల్గొన్నారు. -
జనసేన కార్యకర్తల అరాచకం
సాక్షి, పశ్చిమగోదావరి : వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు, కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైఎస్సార్సీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు. -
గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు
భైంసా (ముథోల్): దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్నకాలమది. స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు పోరాడుతున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం అదేబాటలో నడిచాడు. అందరినీ సమైక్యంగా కలుపుకుపోవాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒక చోట కలుసుకునే అవకాశంలేదు. ఆ రోజుల్లో ఇళ్లలోనే గణపతి పూజలు జరిగేవి. అలాకాకుండా ఏటా గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తే అంతా కలిసి ఒకేచోట ఉత్సవాలు జరుపుకుంటారని అనుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. 1893లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని పుణేలో శ్రీ కస్బ గణపతిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి 127 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కుభీర్‌కు వచ్చి... ఆ సమయంలో ముథోల్ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ముథోల్ ప్రాంతమంతా నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. బాలగంగాధర్ తిలక్ దేశమంతా పర్యటిస్తూ ఇప్పటి నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గ పరిధిలో గల కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌కు బాలగంగాధర్‌తిలక్ దగ్గరి బంధువు. 1905లోనే భైంసాకు వచ్చిన బాలగంగాధర్‌తిలక్ పట్టణానికి చెందిన నారాయణ్‌వాగ్‌తో సమావేశమయ్యారు. అప్పుడే కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌నుపాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్లపాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్ ఉత్సవాల నిర్వాహణను చూసుకున్నారు. నేడు గ్రామస్తులు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. భైంసా పట్టణంలో 101 ఏళ్లుగా.. భైంసాలో 1919లో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణ వాగ్ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు.101 ఏళ్ళుగా గోపా లకృష్ణ మందిరంలో గణేశ్ ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్ మండలి ఉత్సవాలను ప్రారంభించింది. నేడు భైంసా పట్టణంలో 100కు పైగా మండళ్లు గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట ఉత్సవాలు చేసుకునేవారు. నేడు గణేశ్ మండళ్ల సంఖ్య 100కు పైగానే చేరింది. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం.