రోడ్డుపై ఘర్షణ పడుతున్న ఇరువర్గాలు, సతీష్‌పై కర్రలతో దాడి చేస్తున్న ప్రత్యర్థులు
తార్నాక: గణేష్ నిమజ్జన ర్యాలీ సందర్బంగా డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్‌కు దారితీసింది. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8లో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...ఈనెల 14న రాత్రి 1.30గంటల ప్రాంతంలో రామంతాపూర్ రహదారిలోని మధురాబార్ సమీపంలో వినాయక నిమజ్జన ర్యాలీ కొనసాగుతోంది. ఈ సందర్బంగా అనిల్ అనే కారు డ్రైవర్, రామంతాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి సతీష్ మధ్య డ్యాన్స్ విషయంలో గొడవ జరిగింది.
దీంతో వారిరువురు రెండు గ్యాంగులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. స్థానికులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సతీష్ తన స్నేహితులతో కలిసి హబ్సిగూడ రవీంద్రనగర్ ఎస్‌ఆర్ అపార్టుమెంట్ వద్ద ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో అనిల్ 15 మందితో కలిసి అక్కడికి వచ్చి సతీష్, అతని స్నేహితులపై దాడికి దిగగా, సతీష్ అతని స్నేహితులు ప్రతి దాడి చేశారు. ఇరువర్గా లు రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టుకున్నారు. అనిల్ గ్రూప్ వ్యక్తులు సతీష్‌ను కర్రలతో చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయందోళనకు గోనయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసు లు గాయపడిన సతీష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్‌మీడియాతో వెలుగులోకి...?
రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు వెలుగులోకివచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజీ వీడియోవైరల్‌గా మారడంతో కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.
ముగ్గురు నిందితుల అరెస్టు
ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఓయూ సబ్ ఇన్‌స్పెక్టర్ హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. రామంతాపూర్‌కు చెందిన అనిల్, హబ్సిగూడకు చెందిన కరుణాకర్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment