మొదటిసారిగా గూగుల్‌ మ్యాప్స్‌లో ‘శోభాయాత్ర’ | GHMC Ready For Ganesh Nimajjanam | Sakshi
Sakshi News home page

ఫోర్స్‌ రెడీ

Published Wed, Sep 11 2019 7:17 AM | Last Updated on Mon, Sep 23 2019 9:52 AM

GHMC Ready For Ganesh Nimajjanam - Sakshi

సిటీలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర జరగనున్న నిమజ్జనోత్సవం కోసం అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్‌ఎంసీ, పోలీస్, జలమండలి, శానిటేషన్, ఫైర్, వైద్యారోగ్య, విపత్తుల నివారణ, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక గణేశ్‌ యాక్షన్‌ టీంను నియమిస్తున్నారు. ఈ టీంలో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి వీరు వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడతారు. ఆయా చెరువులు, కొలనులు, హుస్సేన్‌సాగర్‌ వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. అటు బందోబస్తు కోసం పోలీసులు..ఇటు ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు.గూగుల్‌మ్యాప్స్‌లో శోభాయాత్రను అప్‌డేట్‌ చేస్తారు. తద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

శోభాయాత్ర 391 కి.మీ.
వైద్యశిబిరాలు 27
నిమజ్జనం కోసం వసతులు 32 ప్రాంతాల్లో
స్టాటిక్‌ క్రేన్‌లు 93
మొబైల్‌ క్రేన్‌లు 134
ట్రాఫిక్‌ సిబ్బంది 2100
ప్రత్యేక బస్సులు 550
ఆంక్షలు 66 ప్రాంతాల్లో
హెల్ప్‌లైన్‌ నంబర్లు: 04027852482 , 9490598985 ,9010203626

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మహా ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న గణేశ్‌ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర మార్గం పొడవునా రహదారులకు మరమ్మతులతోపాటు అవసరమైనంత పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాట్లతోపాటు టాయ్‌లెట్లు తదితర సదుపాయాలు కల్పిస్తారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముఖ్యమైన 32 ప్రదేశాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మేయర్‌ బొంతు రామ్మోహన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు  ఆయన పేర్కొన్నారు.  
గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర జరిగే 391 కిలోమీటర్ల మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేష్‌ యాక్షన్‌ టీమ్‌ ఏర్పాటు. ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్‌వైజర్‌ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్‌.ఎఫ్‌.ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తారు. మొత్తం 194 గణేష్‌ యాక్షన్‌టీమ్‌ల ఏర్పాటు .
నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు..92 మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు.
32 ప్రాంతాల్లో 93 స్టాటిక్‌ క్రేన్‌లు, 134 మొబైల్‌ క్రేన్‌ల ఏర్పాటు. ఈసారి నీటిపారుదల శాఖ ద్వారా కాకుండా జీహెచ్‌ఎంసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.  
23 గణేశ్‌ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీరు నింపి నిమజ్జనానికి ఏర్పాట్లు.
శోభాయాత్ర మార్గంలో రోడ్ల  రీకార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితరమైన వాటికి సంబంధించి 176 పనులకు రూ. 9.29 కోట్ల ఖర్చు.  
ఎస్సార్‌డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆటంకాలు లేకుండా ప్రయాణం సాపీగా సాగేలా మరమ్మతులు.
నిమజ్జనం జరిగే  చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమిస్తారు.
సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్‌ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్ల ఏర్పాటు . ట్యాంక్‌ బండ్, సరూర్‌నగర్‌ వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలు. పర్యాటక శాఖ ద్వారా హుసేన్‌ సాగర్‌లో 7 బోట్లు, 44 స్పీడ్‌ బోట్లు. హుస్సేన్‌ సాగర్‌లో పదిమంది గజ ఈత గాళ్లు.  
జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్ల ఏర్పాటు. ఇందుకు రూ.99.41 లక్షల ఖర్చు.
నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం చేస్తారు.
రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్‌ ఏర్పాట్లు.
శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్‌ ప్రూఫ్‌ టెంట్ల ఏర్పాటు.
రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హుసేన్‌ సాగర్‌ చెరువులో నిమజ్జనం ద్వారా వెలువడే   వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేకంగా వెయ్యి మంది నియామకం.
జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 115 వాటర్‌ క్యాంప్‌ల ద్వారా 30,52,000 వాటర్‌ ప్యాకెట్‌ల పంపిణీ.
శోభాయాత్ర మార్గంలో 36 ఫైర్‌ ఇంజన్ల ఏర్పాటు.
విద్యుత్‌ శాఖ ద్వారా హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 48 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు. సరూర్‌నగర్‌ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరాకు మొత్తం 101 అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు.
శోభాయాత్ర మార్గంలో చెట్ల కొమ్మల నరికివేత.  ప్రతి సర్కిల్‌లో ఒక ఎమర్జెన్సీ హార్టికల్చర్‌ టీమ్‌ నియామకం.  

నిమజ్జనోత్సవానికి 550 ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 12వ తేదీన గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య 550  ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్‌బాగ్‌ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి కొత్తపేట్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిధానీ, లిబర్టీనుంచి  ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, లకిడికాఫూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, ఆల్‌ఇండియారేడియో నుంచి కోఠీ. ఖైరతాబాద్‌ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, బోరబండ, తదితర ప్రాంతాలకు  ప్రత్యేక బస్సులు నడువన్నాయి.  ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా  వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బ్రేక్‌డౌన్స్‌కు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఈడీ  తెలిపారు. ఒకవేళ ఆకస్మాత్తుగా చెడిపోయినా వెంటనే వాటికి మరమ్మతులు చేసేందుకు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా  రోడ్డు పై నుంచి పక్కకు తప్పించేందుకు సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. 

ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఖైరతాబాద్‌: నగరంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు  పూర్తిచేసిందని, సాగర తీరంలో క్రేన్‌ నెం.6 వద్ద ప్రత్యేకంగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావించేందుకు 20 ఫీట్లకు పైగా లోతు పెంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.6 వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహాగణపతి నిమజ్జన ఊరేగింపు 12వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.6 వద్దకు 12గంటలకు చేరుకుంటుందని, అన్ని పనులు పూర్తిచేసి ఒంటి గంటలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. 

ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు
ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిమజ్జనాల సందర్భంగా ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, దీని ద్వారా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్‌ పరిధిలో 55 వేలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటుచేశారని, ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయయని, 12వ తేదీ చివరి రోజు 36 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ విద్యాసాగర్, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ వరీందర్, ఎలక్ట్రికల్‌ డీఈ వేణుగోపాల్, ఐ అండ్‌ పిఆర్‌ రవికుమార్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ నాగేందర్‌ తదితరులు ఉన్నారు. కాగా ఖైరతాబాద్‌ మహాగణపతి మండపం వద్ద కూడా ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement