సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
అంతా ఆన్‌లైన్‌లోనే...
గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్‌ను సిటీ కాప్స్ ఆన్‌లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసి దాని ప్రింట్‌ఔట్‌తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు...
ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్‌లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్‌లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది.
తనిఖీలపై పర్యవేక్షణ...
ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్‌ను టీఎస్ కాప్ యాప్‌లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి.
మండపాల జియో ట్యాగింగ్
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్‌కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment