
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ ఏడాది ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమిచ్చిన మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ...తాను గవర్నర్ అయినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకొని తొలి పూజ చేస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేవారికి సకల శుభాలు కలుగుతాయన్నారు. వినాయకుడి ఆశీస్సులతో బంగారు తెలంగాణ... రత్నాల తెలంగాణ అవుతుందని ఆకాంక్షించారు.
మరోవైపు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పలువురు వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా భారీ సంఖ్యలో గణనాథుడి చెంతకు చేరుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనితా నాగేందర్ స్వామి వారికి వెండితో తయారు చేసిన 75 అడుగుల జంధ్యాన్ని సమర్పించారు. అదే విధంగా లంగర్‌హౌస్‌కు చెందిన భక్తులు 750 కిలోల లడ్డూను మహాగణపతికి నివేదించారు. పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ ఆధ్వర్యంలో 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలను స్వామి వారికి అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment