వినాయకుడిని పూజించే 21 రకాల పత్రాలు | 21 Types Leaves For Ganesh Chathurthi Puja | Sakshi
Sakshi News home page

వినాయకుడిని పూజించే 21 రకాల పత్రాలు

Published Mon, Sep 2 2019 12:23 PM | Last Updated on Mon, Sep 2 2019 12:29 PM

21 Types Leaves For Ganesh Chathurthi Puja - Sakshi

సాక్షి, మంచిర్యాల: ప్రకృతిని పరిరక్షించుకోవాలని చాటే అతి పెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి రోజున వినాయకుడిని 21 పత్రాలతో పూజించడం సంప్రదాయం. వాటి విశిష్టత...పూజ సందర్భంలో పఠించాల్సిన మంత్రాలను ఓసారి పరిశీలిద్దాం.

ఓం సముఖాయ నమః 
మాచీపత్రం: తెలుగులో దీనిని మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. 
ఓం గణాధిపాయనమః 
బృహతీ పత్రం: దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర, వ్యాధశులను నయంచేస్తుంది. దంతధావనానికి కూడా ఉపయోగిస్తారు.
ఓం ఉమాపుత్రాయ నమః 
బిల్వపత్రం: బిల్వపత్రం అంటే మారెడు ఆకు. ఇవి శివుడికి, మహాలక్ష్మికి కూడా ఇష్టమైనవిగా వేద పండితులు చెబుతుంటారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది.
ఓం గజాననాయ నమః 
దూర్వాయుగ్మం: దూర్వాయుగ్మం అంటే గరిక. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది.

ఓం హరసూనవే నమః 
దత్తూరపత్రం:
దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పెనుకొరుకుడు, నొప్పులు, రుతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.  
ఓం లంబోదరాయ నమః 
బదరీపత్రం: బదరీ పత్రం అంటే రేగు ఆకు. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతోంది. రోగ నిరోదక శక్తిని పెంపొందిస్తుంది. 
ఓం గుహాగ్రజాయనమః 
అపామార్గపత్రం: తెలుగులో ఉత్తరేణి అంటారు. ఇది దంత ధావనానికి, పిప్పి పన్పు, చెవి పోటు, రక్తం కారుట, అర్శ మొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్ళను నివారిస్తాయి.
ఓం గజకర్ణాయనమః 
తులసీపత్రం: హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఓం ఏకదంతాయ నమః 
చూతపత్రం: చూతపత్రం అంటే మా మిడిఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్టస్థానం ఉంది.  ఇది రక్త విరేచనాలు, చర్మవ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతోంది.
ఓం వికటాయ నమః 
కరవీరపత్రం: దీనినే గన్నెరు అంటారు. దీని పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి.  ఇది కణుతులు, తేలుకాట్లు, విషకీటకాల కాట్లు, దురద, కంటి, చర్మ సంబంద వ్యాధులను తగ్గిస్తుంది. 
ఓం భిన్నదంతాయనమః 
విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రం గు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గిస్తుంది.
ఓం వటవే నమః 
దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ మొక్క. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవెద్యం ఎంతో ఇష్టం. అతిసారం, విరేచనాలు, దగ్గు కామెర్లు, అర్శ మొలలు, ముక్కు నుంచి రక్తం కారటం వ్యాధుల్ని తగ్గిస్తుంది.

ఓం సర్వేశ్వరాయ నమః 
దేవదారుపత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఇది అజీర్తి, పొట్ట సంబందిత వ్యాధులు, చర్మవ్యాధులు, కంటి వ్యాధులను తగ్గిస్తుంది. 
ఓం పాలచంద్రాయ నమః 
మరువక పత్రం: 
దవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా సువాసన వెదజల్లడం దీని ప్రత్యేకత. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, జుట్టు రాలడం, చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
ఓం హేరంభాయ నమః 
సింధువారపత్రం: వీటినే వావిలి అంటారు. ఇవి జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్ఛవ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి.  
ఓం సురాగ్రజాయ నమః 
గండకీపత్రం: దీనిని లతా దూర్వా, దేవ కాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబందిత వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు.

ఓం ఇభవక్రాయ నమః 
శమీపత్రం: జమ్మిచెట్టు ఆకులను శమీ పత్రాలంటారు. ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది. 
ఓం వినాయక నమః 
అశ్వత్థపత్రం: రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మలబద్దకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, నోటి పూత, చర్మవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. 
ఓం సురసేవితాయ నమః 
అర్జునపత్రం: తెల్లమద్ది ఆకులను అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో  పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది. 
ఓం కపిలాయ నమః 
అర్కపత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఇవి చర్మవ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవి పోటు, కోరింత దగ్గు, దంతశూరి, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు వ్రణాలను తగ్గిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement