సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ సామూహిక నిమజ్జనాల శోభాయాత్ర గురువారం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు అపశృతుల మినహా ఆద్యంతం ప్రశాంతంగా కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరం నలువైపుల ఉన్న చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులతో కలిసి పలు ప్రాంతాల్లో నిమజ్జనాల సందడి నెలకొంది. మొత్తమ్మీద సాయంత్రానికి వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం గత ఏడాది కంటే దాదాపు గంట ఆలస్యంగా జరిగిది. నిమజ్జన శోభాయాత్ర మార్గం పొడవునా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయితే వరుస నిమజ్జనాల నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది సామూహిక నిమజ్జనం రోజు విగ్రహాల సంఖ్య కాస్తా తగ్గింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే సందడి నెలకొనగా, సాయంత్రం వరకు కీలక ప్రాంతాలైన చార్మినార్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో సందడి కనిపించలేదు. చార్మినార్ వద్ద ఉదయం నుంచి అడపాదడపా ఒక్కో విగ్రహం మినహా ప్రధాన ఊరేగింపు కనిపించలేదు. మధ్యాహ్నం తర్వాత విగ్రహాల సంఖ్య పెరగడంతో ఎనిమిదిన్నర గంటల పాటు ఏకధాటిగా కొనసాగింది. శుక్రవారం సైతం నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పాతబస్తీ మీదుగా సాగే శోభాయాత్రలు అత్యంత కీలకమైనవి కావడంతో నగర పోలీసులు వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతి ఏడాది ఉదయం నుంచి చార్మినార్ మీదుగా ఊరేగింపులు సాగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఇంకా త్వరగా పూర్తి చేయించాలని పోలీసులు భావించినా అది సాధ్యం కాలేదు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు విగ్రహాల ఆటోలు, ర్యాలీల మినహా సందడి కనిపించకపోవడంతో చార్మినార్ పరిసరాలు బోసిపోయాయి.
ఏటా నిమజ్జనం రోజు మధ్యాహ్నం మక్కా మసీదులో జరిగే ప్రార్థనల ముగింపు కోసం పోలీసులు ఊరేగింపులకు ఆపేవారు. అయితే ఈసారి ఆ సమయానికి ఊరేగింపులు ఆ సమీపంలోకి కూడా చేరుకోలేదు. గణేష్ ఉత్సవాలకు కేంద్రమైన బాలాపూర్ గణేష్ విగ్రహం గత ఏడాది కంటే ఆలస్యంగా చార్మినార్ వద్దకు వచ్చింది. సాయంత్రం 4 గంటల తర్వాత చార్మినార్ పరిసరాలకు శాలిబండ, సర్దార్‌మహల్, లాడ్ బజార్ రోడ్ల నుంచి ఒక్కసారిగా విగ్రహాలతో కూడిన లారీలు రావడంతో సందడి నెలకొంది. గతంలో విగ్రహాలతో వచ్చిన లారీల్లో దాదాపు ప్రతి వాహనం చార్మినార్ చుట్టూ తిరిగి ముందుకు సాగేది. ఈసారి అనేకం చుట్టూ తిరగకుండా నేరుగా ముందుకు సాగేలా ఏర్పాటు చేశారు. పోలీసు విభాగం పాతబస్తీ నుంచి వచ్చే విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తూ రద్దీ పెరిగిన తర్వాత ఎంజే మార్కెట్ దగ్గర వాటికి గ్రీన్‌ఛానల్ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ వద్ద కూడా ఈ విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తూ నిమజ్జనం చేశారు. అధికారులు చేసిన మార్పు చేర్పులు, కృషి ఫలితంగా ప్రధాన ఊరేగింపు రాత్రికి పాతబస్తీ దాటింది. మధ్యాహ్నం వరకు పలుచగా ఉన్న ఎంజే మార్కెట్ సాయంత్రం 4.00 గంటల తర్వాత కిక్కిరిసింది. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జనం పోటెత్తారు. ఈ ఏడాది మూడో రోజు నుంచే పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. నగరంలో ఉన్న విగ్రహాల్లో దాదాపు 50 శాతానికి పైగా నిమజ్జనం చేశారు. సాయంత్రానికి ఎంజే మార్కెట్ కూడలికి అన్ని వైపుల నుంచి వాహనాలు రావడంతో సందడి కనిపించింది. అన్ని విగ్రహాలూ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కావడానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో నిర్ణీత సమయం తర్వాత వచ్చే విగ్రహాల లారీలను నెక్లెస్‌రోడ్‌లోకి పంపి, సీరియల్ ప్రకారం నిమజ్జనానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద కూడా శుక్రవారం సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment