టౌన్ బ్యాంకుకు దొంగలు కన్నం వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి(ఫైల్)
అనంతపురంలో సంచలనం కలిగించిన నేరాల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. ఇళ్లల్లో దొంగతనాలు పక్కన పెడితే పోలీసులకే సవాల్ విసిరేలా నగర నడిబొడ్డున కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు (టౌన్‌బ్యాంకు) రాబరీ కేసులో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వినాయక నిమజ్జనం, మొహర్రం వేడుకలు వరుసగా రావడంతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో మొత్తం అధికారులను బందోబస్తుకు నియమించారు. దీంతో జిల్లా కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న కీలక నేరాల దర్యాప్తులు అటకెక్కాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇటీవల శ్రీకంఠం సర్కిల్‌నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఫర్టిలైజర్, ఎరువుల అంగళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. అంతకు ముందుకు జాతీయ రహదారి, ప్రధాన కూడళ్లలోని మెడికల్‌షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. వారం రోజుల క్రితం పాతూరు చెన్నకేశవాలయంలో చోరీ జరిగింది. హుండీలోని రూ. 20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతకుముందు టవర్‌క్లాక్ కూతవేటు దూరంలో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండికిరీటం, ముక్కుపుడక సైతం అపహరణకు గురయ్యాయి. నిత్యం రద్దీతో పాటు సీసీ కెమెరా నిఘా వ్యవస్థ ఉంటున్న ప్రాంతాల్లోనే దొంగలు యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
⇔ అర్బన్ బ్యాంకులో దోపిడీ.. పోలీసులకే సవాల్
నగర నడిబొడ్డున సుభాష్‌రోడ్డులో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు (టౌన్ బ్యాంకు)లో గత నెల 30న సినీ ఫక్కీలో జరిగిన రాబరీ పోలీసులకే సవాల్ విసిరింది. దాదాపు 16 సీసీ కెమెరాలతో అలారం వ్యవస్థ, విధుల్లో సెక్యూరిటీ గార్డు ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా బ్యాంకుకు కన్నం వేసి పటిష్ట భద్రత నడుమ ఉండే లాకర్లను ధ్వంసం చేసి కిలో బంగారం, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బ్యాంకు రాబరీ ఘటనలో ఇది రెండవది.
⇔ ఏడాది క్రితం జేఎన్‌టీయూలోని స్టేట్‌బ్యాంకులో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. అయితే ఈ కేసును అప్పటి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారం లోగానే చేధించారు. అయితే ఇటీవల జరిగిన అర్బన్ బ్యాంకు ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించలేదని సమాచారం. ఇందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రంగంలోకి దింపినా క్లూ కూడా సంపాదించలేనట్లు తెలిసింది. అర్బన్ బ్యాంకు ఘటనలోనే కాకండా ఇతర నేరాల్లో కూడా నేరస్తులను పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇంత వరకూ పోలీసులు చూపిస్తున్న అరెస్ట్‌ల్లో ఎక్కువశాతం పాత నేరస్తులే ఉండడం గమనార్హం.
నేరాల నియంత్రణలో విఫలం
నగరంలో ఒక్కో పోలీసుస్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు నుంచి నలుగురు ఎస్‌ఐలు.. నాల్గవ పట్టణానికి అయితే ఏకంగా ఆరుగురు ఎస్‌ఐలు... పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. తిప్పి కొడితే ఒక్కో అధికారికి ఒక కిలోమీటరు దూరం పరిధి కూడా లేదు. అయినా నేరాలకు ‘అనంత’ అడ్డాగా మారుతోంది. గడిచిన రెండు నెలల్లో జిల్లా కేంద్రంలో జరిగిన నేరాలు సంఖ్య జిల్లా వ్యాప్తంగా కూడా చోటు చేసుకోలేదు. అన్ని పోలీసు స్టేషన్‌లకూ మోతాదుకు మించి సిబ్బందిని ఎస్పీ నియమించారు. అయినా నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు అంతో ఇంతో ట్రాక్ రికార్డు ఉన్న వారే. కానీ వారి ప్రతాపమంతా చిన్నాచితకవారిపై చూపిస్తున్నారు తప్ప నేరాలను అడ్డుకోవడంలో చూపించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment