ఖైరతాబాద్: ఈ ఏడాది వినాయక ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గత 15 ఏళ్లుగా ఈ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఈసారి అంతకంటే ఘనంగా గ్రేటర్ పరిధిలో 55 వేల గణనాథుల విగ్రహాలు వెలిశాయన్నారు. ఈనెల 12న జరిగే వినాయక ప్రతిమల నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మేయర్ రామ్మోహన్, గ్రేటర్ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చవితి మూడో రోజు నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు ఈ నెల 12వ తేదీతో ముగుస్తాయన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పురిస్థితులను సమన్వయం చేసేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతిని ఈ ఏడాది సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మహాగణపతి నిమజ్జనం చేసే సాగర్ జలాల్లో వ్యర్థాలను తొలగించారని, మరో నాలుగైదు రోజుల్లో 20 అడుగులకు పైగా లోతు వ్యర్థాలను తొలగించి భక్తులు, ఉత్సవ కమిటీ కోరిక మేరకు సంపూర్ణ నిమజ్జనం చేస్తామన్నారు. గతంలో మహాగణపతి నిమజ్జన ప్రక్రియ రెండు రోజులు పట్టేదని, ఈసారి గత సంవత్సరం లాగానే త్వరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి తలసాని,మేయర్ రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్
సాగర్ చెంత గంగా హారతికి ఏర్పాట్లు
ఈ ఏడాది నిమజ్జన వేడుకల్లో ఖైరతాబాద్ గణపతికి మొదటిసారిగా హుస్సేన్ సాగర్ వద్ద గంగా హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, శానిటేషన్, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, పోలీస్, ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతకముందు మహాగణపతిని నిమజ్జనం చేయనున్న ప్రాంతంలో చేపట్టిన పనులను మంత్రి, మేయర్, గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్, సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ, ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు.
నిమజ్జనానికి 29 క్రేన్లు
ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనాల కోసం మొత్తం 29 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌లో ప్రత్యేకంగా బోట్లతో పాటు, స్మిమ్మర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. మహాగణపతిని ప్రతి ఏటా నిమజ్జనం చేసే ప్రాంతంలో అడుగున బండరాయి ఉన్నందున ఆ పక్కనే సాగర్‌లో లోతు పెంచి నమజ్జనం చేసేందుకు ఇప్పటికే 700 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్టు ఆయన వివరించారు. నిమజ్జన సమయానికి 25 అడుగులకు పైగా లోతు పెంచి విగ్రహం సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రేన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షిప్ట్‌ల వారిగా ఆపరేటర్లను అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు స్టాండ్ బైగా కూడా క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
162 కి.మీ. మార్గంలో శోభాయాత్ర
నగరంలో ఇప్పటికే గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైందని, ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జన యాత్రను విజయవంతం చేసి నగర ఖ్యాతిని మరోసారి చాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద సాగర్‌లో దాదాపు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని, ప్రధానంగా 162కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్ర సాగుందన్నారు. ఈ మార్గంలో రోడ్ల మరమ్మతులు, ఇతర సౌకర్యాలను, అదనపు లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment