సాక్షి, సిటీబ్యూరో: యాచిస్తున్న...చెత్త ఏరుకుంటున్న...బాల కార్మికులుగా పనిచేస్తున్న బాలబాలికలను రక్షించడంలో సైబరాబాద్ పోలీసులు ముందున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలైలో జరిగిన అపరేషన్ ముస్కాన్–5లో 541 మంది(483 బాలురు, 58 బాలికలు)ను సంరక్షించారు. వీరిలో 479 మందిని షెల్టర్ హోంలకు, 62 మంది తల్లిదండ్రులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు రూపొందించిన ఫేషియల్ రికగ్నేషన్ యాప్ (దర్పణ్) ద్వారా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను కూడా ఈ అపరేషన్ ముస్కాన్–5 ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేశారు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన బాలకార్మికుల్లో అత్యధికంగా ‘338 మంది’ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సైబరాబాద్ ఉమెన్ అండ్ సేఫ్టీ విభాగం ఇన్‌చార్జి అనసూయ తెలిపారు. ఆధార్‌కార్డులో వీరి వయస్సు మేజర్‌గా ఉండగా పని చేస్తున్న ప్రాంతాల్లో వీరిని సంరక్షించగా బాలకార్మికులుగా తేలిందన్నారు.
కొన్ని కేసులిలా...
♦ అత్యంత హానికర పరిస్థితుల్లో మేడ్చల్‌లోని శ్రీరామ స్పిన్నింగ్ మిల్లులో బాలకార్మికులుగా పనిచేస్తున్న 15 మంది చిన్నారులను ఆయా జిల్లాల కార్మిక విభాగం అధికారులు, చైల్డ్‌లైన్ సిబ్బంది, జిల్లా బాలసరంక్షణ విభాగాధికారులతో కలిసి సైబరాబాద్ పోలీసులు జూలై 15న రక్షించారు. వీరందరూ మహారాష్ట్ర, బీహర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం.
♦ మైలార్‌దేవ్‌పల్లిలో మెటల్ ఇండస్ట్రీలో 10 మంది బాలకార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం అందడంతో అపరేషన్ ముస్కాన్–5 సిబ్బంది జూలై 16న దాడులు నిర్వహించారు. అత్యధిక ఉష్ణోగ్రతలో యంత్రాల వద్ద పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడిన చిన్నారులకు విముక్తి కల్పించారు. చిన్నారులకు తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు విరామం లేకుండా వారితో పని చేయిస్తున్న కంపెనీ యజమానిపై మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.
♦ కాటేదాన్‌లోని ఓ పేపర్ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు పిల్లలను జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులతో కలిసి పోలీసులు సంరక్షించారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్య పరీక్షలో తేలింది. సదరు కంపెనీ యజమానిపై బాలకార్మికుల చట్టం, 79 జేజే యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
♦ వివిధ జంక్షన్ల వద్ద యాచిస్తున్న ముగ్గురు పిల్లలను పోలీసులు కాపాడారు. వీరి తల్లిదండ్రులు హెచ్‌ఐవీతో మృతి చెందగా, సదరు చిన్నారులు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారు. వారి అలనాపాలనా చూసుకుంటామని చేరదీసిన వారి బంధువులు చిన్నారులతో వివిధ జంక్షన్ల వద్ద భిక్షాటన చేయిస్తున్నారు. ప్రతిరోజూ రూ.1500 కంటే తక్కువగా తీసుకొస్తే అన్నం కూడా పెట్టడం లేదని పోలీసుల విచారణలో తేలింది.
ఆధార్ కార్డుల్లో అక్రమాలు...
ఈ అపరేషన్ ముస్కాన్ –5లో చిక్కిన బాల, బాలికలకు అందరికీ పుట్టిన తేదీలు 2000 జనవరి 1, 2001 జనవరి 1 గా సృష్టించారు. బీహర్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం తదితర రాష్ట్రాలకు చెందిన దళారులు చిన్నారుల తల్లిదండ్రులకు దళారులు రూ.10,000 చొప్పున చెల్లించి వారిని తీసుకువచ్చినట్లుగా విచారణలో తేలింది. పిల్లలు పనిచేసే ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో రోగాల బారిన పడుతున్నారు. రోజుకు రెండుసార్లు మాత్రమే అన్నం పెట్టేవారు. కొన్ని కంపెనీలు 24 గంటలు బాలకార్మికులతో పని చేయించుకోగా, మరికొన్ని కంపెనీలు ఉదయం పెద్దవారితో, రాత్రిళ్లు పిల్లలతో పని చేయించేవని సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment