విఘ్నేశా.. వీడ్కోలు | hyderabad says goodbye to Ganpati | Sakshi
Sakshi News home page

విఘ్నేశా.. వీడ్కోలు

Published Tue, Sep 9 2014 1:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మొజాంజాహి మార్కెట్ వద్ద సాగుతున్న శోభాయాత్ర - Sakshi

మొజాంజాహి మార్కెట్ వద్ద సాగుతున్న శోభాయాత్ర

* కన్నుల పండువగా సాగిన నిమ‘జ్జన’ ఘట్టం  
* తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉత్సవం
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఉత్సవం.. అరవై అడుగుల మహా విశ్వరూప గణ(ఘన)పతి.. తదితర ప్రత్యేకతల నేపథ్యంలో, పదకొండు రోజుల పాటు అశేష భక్తజనుల విశేష పూజల అనంతరం సామూహిక గణేశ్ నిమజ్జనయాత్ర సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. సోమవారం జరిగిన శోభాయాత్ర కన్నుల పండువలా ముందుకు సాగింది. భక్తజనం ముక్తకంఠంతో ‘జైబోలో గణేశ్ మహరాజ్’ అంటూ బాలాపూర్ నుంచి వినాయకసాగర్ వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్ర సరికొత్త అందాన్ని చిత్రించింది.

మునుపటిలా ఉరుకులు పరుగులు లేకుండా యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. నెమ్మదిగా ముందుకు సాగింది. దీంతో, సాయంత్రం ఆరుగంటల వరకూ వినాయకసాగర్‌కు చెప్పుకోదగ్గ సంఖ్యలో గణనాథులు రాలేదు. ప్రపంచం లోనే అతి పెద్ద వినాయకునిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణపయ్యపై ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురుస్తుందని ప్రకటించడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు ఎందరో ఎదురు చూశారు. దాంతో పాటు భారీ వినాయకుణ్ని మళ్లీ చూడలేమనే తలంపుతో ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు జనం పోటెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన దృశ్యాల్ని తిలకించేందుకు నేల ఈనిందా.. అన్నట్లు ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు.

బహు రూపాల్లో బొజ్జ గణపయ్యలు
విభిన్న రూపాల్లోని గణేశుడి ప్రతిమలు.. పండ్లు, పూలతో అలంకరించిన నిమజ్జన వాహనాలు.. యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పహిల్వాన్ ఆకృతిలోని వినాయకునితోపాటు బాలాజీ, షిర్డీ సాయిబాబా, పార్వతీపరమేశ్వరులతో కూడిన ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. డీజే సంగీతానికి అనుగుణంగా యువతీ యువకులు చేసిన నృత్యాలు  శోభాయాత్రలో ఉత్సాహం నింపాయి. నిమజ్జనయాత్రలోని ముఖ్యకేంద్రమైన మొజాంజాహీ మార్కెట్‌కు శోభాయాత్ర చేరుకునేటప్పటికి దాదాపు రాత్రి 7 గంటలైంది. దాంతో విగ్రహాలు వినాయకసాగర్‌కు వచ్చేందుకు మరింత సమయం పట్టింది.

వివిధ మార్గాల నుంచి..
నగరంలోని వివిధ మార్గాల నుంచి బయల్దేరిన వినాయకుల విగ్రహాలు కూడా రాత్రి 8 గంటల తర్వాతే హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నాయి. ‘గణపతి బొప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై..’ తదితర నినాదాలతోపాటు బాజా భజంత్రీలు, మేళతాళాలు, కళాకారుల నృత్యాలతో నగర వీధులన్నీ పండుగ హోరులో మునిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయా ప్రాంతాల్లో   వేదికలపై నుంచి పూల తో గణనాయకులకు స్వాగతం పలికారు. పలుచోట్ల భక్తులకు మంచినీరు, ప్రసాదం పంపిణీ చేశారు. ఆయాప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే యాత్ర వేగంగా ముందుకు సాగింది.

పలు ప్రాంతాల్లో నిమజ్జనం
హుస్సేన్‌సాగర్‌తోపాటు కాప్రా చెరువు, సరూర్‌నగర్ చెరువు, రాజన్నబావి, మీరాలంట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు, మల్కం చెరువు, గోపీనగర్ చెరువు, పెద్ద చెరువు(గంగారం), గురునాథం చెరువు (జేపీనగర్), కైదమ్మకుంట (హఫీజ్‌పేట), ఈర్ల చెరువు, రాయసముద్రం చెరువు (రామచంద్రాపురం), సాకి చెరువు (పటాన్‌చెరు), ఐడీఎల్ ట్యాంక్ 16, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పేట చెరువు, సున్నం చెరువు, పరికి చెరువు, వెన్నెలగడ్డ చెరువు, సూరారం చెరువు, కొత్తచెరువు (అల్వాల్‌లేక్), సఫిల్‌గూడ చెరువుల వద్ద కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.  

హెలికాప్టర్ నుంచి..
నిమజ్జనం తీరును హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు హెలికాప్టర్ నుంచి వీక్షించారు. నిమజ్జన యాత్ర మార్గాల్ని వీక్షించిన వారు పరిస్థితి ప్రశాంతంగా ఉందని రూఢి చేసుకున్నారు.
 
అపశ్రుతి..
భక్తియాత్ర సజావుగానే సాగినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. గణేశునిపై పూలవర్షం కురిపిస్తారని తెలిసి ఆ సుందర దృశ్యాన్ని  తిలకించేందుకని రాయదుర్గం నుంచి ఆటోలో బయలుదేరిన కుటుంబం ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొనడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అఫ్జల్‌గంజ్ నుంచి నిమజ్జనానికి బయలుదేరిన ట్రాలీఆటో మొజాంజాహీ మార్కెట్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. ఆటోలో మొత్తం 15 మంది ఉండగా, వారిలోఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గణనాథుడిని వాహనంలో ఎక్కిస్తుండగా గోషామహాల్ ప్రాంతానికి చెందిన సాయి(25) అనే వ్యక్తి చూపుడు వేలు తెగిపోయింది. మరో ఘటనలో గణపతిని వాహనంలోకి ఎక్కిస్తుండగా, అదుపుతప్పి కిందపడి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇసుకేస్తే రాలనంతగా..
ఈ సంవత్సరం అత్యంత ఎత్తుకు ఎదిగిన గణనాథుడు వచ్చే ఏడాది నుంచి ఎత్తు తగ్గనుండటంతో గ్రేటర్ ప్రజలే కాక పొరుగుజిల్లాల నుంచీ భారీసంఖ్యలో ప్రజలు నగరానికి చేరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది ఈ అపురూప వేడుకను తిలకించినట్లు అంచనా. మొజాంజాహీ మార్కెట్, ట్యాంక్‌బండ్‌లు ఇసుకేస్తే రాలని జనాన్ని తలపిస్తూ మహోత్సవానికి ప్రత్యక్షసాక్షులుగా నిలిచాయి.
 
యాత్ర సాగిందిలా..
బాలాపూర్‌లో వేలంపాట అనంతరం ఉదయం 11.15 గంటలకు గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా.. అడుగడుగునా నృత్యాలు.. డప్పుమోతలు.. కేరింత లతో పండుగ సంబరంతో గణనాథుల రథాలు ముందుకు కదిలాయి. పాతబస్తీ పరిధిలోని విగ్రహాలు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బయల్దేరి చార్మినార్‌కు చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ విగ్రహం బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా చార్మినార్‌కు చేరుకునే సరికి సాయంత్రం 6.30 గంటలు దాటింది.
 
అడుగడుగునా నిఘా..
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడంతో యాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపులో గణేశ ప్రతివులు కలిసే చోట పోలీసులు అప్రవుత్తంగా వ్యవహరించారు. యాత్ర పొడవునా వెయ్యి సీసీ కెమెరాలు  ఏర్పాటు చేశారు. ఏ మార్గంలోనైతే పరిస్థితి విషమంగా మారనుందో ముందస్తుగానే గుర్తించి, ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టడంతో యాత్ర సజావుగా ముందుకు సాగింది.
 
 11న ప్రసాదం పంపిణీ
 2 వేల కిలోలు లడ్డూ దాతకు.. 3 వేల కిలోలు భక్తులకు
హైదరాబాద్:  కైలాస విశ్వరూప మహాగణపతికి నైవేద్యంగా సమర్పించిన 5 టన్నుల బరువైన భారీ లడ్డూను ఈ నెల 11న భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సోమవారం రాత్రి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ లడ్డూలో రెండు వేల కిలోల్ని దాత (తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు)కు అందజేయనున్నారు. మిగిలిన 3 వేల కిలోల ప్రసాదాన్ని భక్తులకు పంచనున్నారు.
 
పల్లెల్లో పంచుతా...
మహాగణపతికి ప్రసాదాన్ని అందించే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు కేటాయించిన రెండు వేల కిలోల లడ్డూను 50 నుంచి 60 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా తయారు చేస్తా. మా జిల్లాలోని(తూర్పుగోదావరి) వివిధ గ్రామాల్లో భక్తులకు పంపిణీ చేస్తా.
 -లడ్డూ దాత మల్లిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement