
హైదరాబాద్: దక్కన్ చరిత్ర ఎంతో ఘనమైందని, దక్షిణ భారత్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో జరిగిన 39వ సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్‌ను నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 5,700 నగరాల్లో సర్వే చేయించగా మన రాజధాని నగరానికి 3వ స్థానం లభించడం గర్వకారణమన్నారు. మధ్యయుగాల నుంచి నేటి వరకు నగరంలో కొనసాగుతున్న రక్షణ చర్యలను సీపీ వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ ఆది నుంచి అగ్రభాగాన నిలిచిందనేందుకు 1847లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడమే నిదర్శనమన్నారు. ఓయూలో 32 సంవత్సరాల తర్వాత జరుగుతున్న హిస్టరీ కాంగ్రెస్‌లో చరిత్ర విభాగం హెడ్, ఎస్‌ఐహెచ్‌సీ లోకల్ కార్యదర్శి ప్రొఫెసర్ అర్జున్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పురస్కరించుకుని సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ జరుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, గోవా, పాండిచ్చేరి తదితర దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే హిస్టరీ కాంగ్రెస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలన సంస్కరణలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై సమగ్ర చర్చలు, పరిశోధనాపత్రాలను ప్రతినిధులు సమర్పించనున్నట్లు చెప్పారు. అతిథులు ఎస్‌ఐహెచ్‌సీ–2018 ప్రొసీడింగ్స్‌ను ఆవిష్కరించారు. దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 600 మంది పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొ.సోమసుందర్‌రావు మాట్లాడుతూ దక్షిణభారత దేశ చరిత్రలో భావితరాలకు ఉపయోగపడేలా యూనివర్సిటీల నుంచి మరిన్ని పరిశోధనలు రావాలన్నారు. వైస్ చాన్స్‌లర్ ప్రొ.రామచంద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొ.ఇందిర, డాక్టర్ అంజయ్య, డాక్టర్ లావణ్య, డాక్టర్ అరుణ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.రవీందర్, ప్రొ.నాయుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment