లక్డీకాపూల్: నేను కూడా పోలీసునే అన్న భావన.. తల్చుకుంటేనే భలేగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వినూత్నంగా ప్రవేశపెట్టిన సోషల్ పోలీసింగ్ చాలా నేర్పింది. పని చేస్తున్న సంస్థల్లో గుర్తింపు పొందడంతో పాటుగా పోలీస్ కమిషనర్‌కు అనునిత్యం అందుబాటులో ఉండటంతో సమాజంలో తమ బాధ్యతను మరింతగా పెంచుతున్నట్టుగా అనిపిస్తుందంటున్నారు. వాస్తవానికి ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనగానే కంప్యూటర్లకు అంకితమైపోతారు. బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోరనే ప్రచారం లేకపోలేదు. ఈ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగులు సామాజిక కార్యక్రమంలో చురుకైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించడం గొప్ప విషయమే. ఈ క్రమంలో సోషల్ పోలీసింగ్ డ్యూటీ చేస్తున్న వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు తమ రంగాల్లో ఉద్యోగం చేసుకుంటూనే రోజు ఒక గంట పాటు పోలీసు డ్యూటీ చేస్తున్నారు. ప్రస్తుతం నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోవిడ్–19 నేపథ్యంలో నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్‌ను ఈ సోషల్ పోలీసింగ్ కార్యకర్తలే నిర్వహించారు. అదేవిధంగా లాక్‌డౌన్ బాధితులకు అన్ని విధాలుగా చేయూత అందించడంలో చురుకైన పాత్ర పోషించారు.
ప్రత్యేక తర్ఫీదుతో విధుల్లోకి..
నగరంలోని రోడ్డు ప్రమాదాలు, వైలేషన్స్‌ను నియంత్రించే క్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సి) ఏర్పడింది. ఐటీ కారిడార్‌లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థలకు చెందిన ఉద్యోగులతో ఎస్‌ఎస్‌సీ బలోపేతమైంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో భాగస్వామ్య ఒప్పందం మేరకు ట్రాఫిక్ అవేర్‌నెస్ కల్పిస్తోంది. ఇందుకు సైబరాబాద్ పోలీసులు ఎస్‌సీఎస్‌సీలోని దాదాపు 2 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్‌పై అవగాహన కల్పించే క్రమంలో ట్రాఫిక్ రూల్స్, విధివిధానాలు, వైలెన్స్‌లో తీసుకునే చర్యలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన చర్యల్లో తర్ఫీదు ఇచ్చారు. దాంతో పాటు ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో లైంగిక వేధింపులను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా అన్ని అంశాల్లో పోలీసులు తర్ఫీదు ఇచ్చి మరీ ట్రాఫిక్ డ్యూటీ అప్పగిస్తున్నారు. ఈ విధంగా ఐటీ కారిడార్‌లోని ఎంతో మంది సోషల్ పోలీసులుగా డ్యూటీ చేస్తున్నారు. చేసేది సేవా కార్యక్రమమే అయినా.. దాన్ని ఒక విధిగా చేయడం ఐటీ ఉద్యోగులకే చెల్లింది. అయితే ప్రస్తుతం ఈ ఎస్‌ఎస్‌సీ ద్వారా సుమారుగా 250 మంది మాత్రమే సోషల్ పోలీసింగ్ సేవలను అందిస్తున్నారు. ఇందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పలువురికి ప్రశంస పత్రాలను అందించి పోత్సహించడం విశేషం.
రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ కలిగింది..
ట్రాఫిక్ వలంటీర్‌గా చేయడం వల్ల రోడ్ సేఫ్టీ పట్ల అవేర్‌నెస్ పెరుగుతుంది. మన చుట్టు పక్కల వాళ్లకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగించే వీలు కలుగుతుంది. రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ వలంటీర్ సేవలను అందిస్తున్నా. మూడు నెలలకు ఒక సారి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌తో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వలంటీర్‌గా బాగా పనిచేసిన వారికి బెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ విధమైన సేవలను అందించడం చాలా తృప్తి ఇస్తోంది.– రాజశేఖర్‌రెడ్డి కేసారి, టెక్ మహేంద్ర.
ట్రాఫిక్ డ్యూటీ చాలా ఇష్టం..
సామాజిక సేవా కార్యక్రమాలన్నా.. పోలీసు డ్యూటీఅన్నా నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే స్వచ్ఛందంగా నగరంలో ట్రాఫిక్ వలంటీర్‌గా చేస్తున్నారు. అందులోనూ సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ సైడ్ వచ్చి మరీ మూడు గంటల పాటు ట్రాఫిక్ నియంత్రణ విధులను నిర్వహిస్తున్న. మూడు నెలల్లో పది వేల ట్రాఫిక్ వైలేషన్ కేసులను రిపోర్ట్ చేస్తున్న. నగరంలో తొలి మహిళా వలంటీర్‌గా గుర్తింపు పొందాను.
– సుకన్య రాయల్, ఇన్‌ఫార్ కంపెనీ.
రాంగ్‌రూట్ యాక్సిడెంట్‌తో పోలీసునయ్యా..
కూకట్‌పల్లి ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి రాంగ్‌లో వచ్చి యాక్సిడెంట్‌కు కారణమయ్యాడు. ఈ ఘటనలో రైట్ రూట్‌లో వెళ్తున్న వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. కానీ రాంగ్ రూట్‌లో వచ్చిన వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లా. అప్పడు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీరు కూడా పోలీసు కావచ్చు. సోషల్ పోలీసుగా పనిచేయమని ప్రోత్సహించారు. ఆ విధంగా సంవత్సరన్నర నుంచి నగరంలో ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోషల్ పోలీసింగ్ సేవలను అందిస్తున్నాం. – పెన్మెత్స బాలకృష్ణ, సాఫ్ట్‌వేర్ సంస్థ టీమ్ లీడర్.
Comments
Please login to add a commentAdd a comment