సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ప్రజలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా పడుతుంది. ఇదే పని పోలీసులు చేస్తే ఇప్పటి వరకు వారికి ఫైన్‌తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే బదిలీ అనివార్యం అవుతోంది. త్వరలో అమలులోకి రానున్న సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం ఫలితంగా పోలీసులపై ఈ భారం మరింత పెరగనుంది. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే... కొత్త చట్టంలో చేర్చిన సెక్షన్ 210–బీ ప్రకారం వారికి రెట్టింపు వడ్డన ఉంటుంది. అంటే సాధారణ ప్రజలకు ఆ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధిస్తారో... వీరికి ఆ మొత్తానికి రెట్టింపు వేస్తారు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ వేటు వేశారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) వద్దకు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా దీనిని ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీ యాక్ట్‌లోకి కొత్తగా వచ్చిన 210–బీను అనుసరిస్తూ ఈ విధానాలను మరింత విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/ కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే తేలిగ్గా గుర్తించి వారికి రెట్టింపు జరిమానా విధించవచ్చు. అదే ఓ అధికారి మఫ్టీలో తన ప్రైవేట్ వాహనం వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడితే వారిని ఎలా గుర్తిస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు చేస్తున్న ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా ఇవి పోలీసులకు చేరుతున్నాయి. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రతి హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా వ్యవహరించాలని అనిల్‌కుమార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment