గోల్కొండ కోటలో ఇవాంకాతో మాట్లాడుతున్న హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా
సాక్షి, హైదరాబాద్: ‘వావ్.. హైదరాబాద్..’‘భాగ్యనగరాన్ని అప్పుడే వదిలి వెళ్లాలని లేదు..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. నగర పర్యటన ముగింపు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలివీ.. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఇవాంకా తన కాన్వాయ్‌లో ట్రైడెంట్ హోటల్ వరకు ప్రయాణిస్తూ హైదరాబాద్ అందాలను తిలకించారు.. ఆపై హెచ్‌ఐసీసీకి వెళ్లిన ఆమె.. అక్కడి ఆధునిక అంశాలను పరిశీలించారు.. మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలను వీక్షించి.. బిర్యానీ, స్థానిక రుచుల్నీ ఆస్వాదించారు.. బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె.. నగర చరిత్రను తెలుసుకున్నారు.. ఈ రెండు రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడి కుమార్తెను నగరం కట్టిపడేసింది.
తనకు ఈ వాతావరం ఎంతో నచ్చిందని.. అప్పుడే హైదరాబాద్ వదిలి వెళ్లాలని లేదని.. మరికొన్ని రోజులు ఉండాలని అనిపిస్తున్నప్పటికీ సమయాభావం వల్ల బుధవారం రాత్రికే తిరుగు ప్రయాణమవ్వాల్సి వస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. గోల్కొండలో ఇవాంకా పర్యటన విధుల్లో భాగం పంచుకున్న నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రాతో ఇవాంకా తన భావాలను పంచుకున్నారు. దాదాపు గంట సేపు గోల్కొండ కోటలో గడిపిన ఇవాంకాకు స్వాతిలక్రాను అమెరికా రా యబార కార్యాలయం అధికారి పరిచయం చేశారు. అమెరికా ప్రభుత్వ విభాగం ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక హ్యాంపేరీ లీడర్‌షిప్ అవార్డును 2 రోజుల క్రితం స్వాతిలక్రా అమెరికాలో అందుకున్నారని ఆ అధికారి ఇవాంకాకి వివరించారు. యూనైటెడ్ స్టేట్స్ బ్యూరో అఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంటర్‌నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) విభాగం నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారని ఆమెకు వివరించారు.
సిటీ టెక్నాలజీకి కితాబు..
ఈ నేపథ్యంలో స్వాతిలక్రాతో కాసేపు సంభాషించిన ఇవాంకా నగర పోలీసు విభాగం అంశాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసి, వినియోగిస్తున్న హాక్–ఐ, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ యాప్స్‌తోపాటు బాధితులకు సత్వర న్యాయం చేయడం, నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివరాలను స్వాతిలక్రా ఇవాంకాకు వివరించారు. మహిళలు, యువతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి సిటీ పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విధానాన్ని తెలిపారు. న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్(ఎన్‌వైపీడీ) తరహాలోనే తమ వద్దా అత్యాధునిక డయల్ 100 వ్యవస్థ ఉన్నట్లు స్వాతిలక్రా.. ఇవాంకాకు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు నగర పోలీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఇవాంకా.. అద్భుతమంటూ కితాబిచ్చారని తెలిసింది. పోలీసింగ్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఇవాంకా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment