జోరుగా జల విద్యుత్‌ ఉత్పత్తి | Hydro power production as swing | Sakshi
Sakshi News home page

జోరుగా జల విద్యుత్‌ ఉత్పత్తి

Published Thu, Aug 23 2018 2:05 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

Hydro power production as swing - Sakshi

దిగువ జూరాలలోని పవర్‌ యూనిట్‌

సాక్షి, వనపర్తి: కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కాగా.. నాగార్జునసాగర్‌లో గురువారం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. పులిచింతల ప్రాజెక్టులోకి కూడా సమృద్ధిగా నీరు వస్తుండటంతో జల విద్యుత్‌ ఉత్పత్తికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా విద్యుదుత్పత్తిలో లక్ష్యం చేరుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

లక్ష్యం దిశగా... 
కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించగానే ఉండే తొలి ప్రాజెక్టు జూరాల. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యం లో ఎగువ జూరాల పవర్‌ ప్రాజెక్టు ప్రారంభం నుంచే నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభంకాగానే ఒక నెల కర్ణాటక, మరో నెల తెలంగాణ విద్యుత్‌ను వాడుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణానదిపై బండ్‌ నిర్మించారు. దీని ద్వారా నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేసేందుకు 240 మెగావాట్ల సామర్థ్యంతో దిగువ జూరాల పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా అందులోనూ విద్యుదు త్పత్తి జరుగుతోంది. ఈ 2 ప్రాజెక్టుల్లో కలిపి ఈ ఏడాది 400 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 170 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

వరద ఆశాజనకంగా ఉండటంతో మరిన్ని రోజులు ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉంది. 2017–18లో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో 360 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 417 మిలియన్‌ యూనిట్ల రికార్డుస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ఈసారి దీనిని అధిగమించాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ఏడాది 1,150 మిలియన్‌ యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 230 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో వరద లేకపోవడం వల్ల క్రస్టు గేట్లు, జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తెరుచుకోలేదు. అయితే ఈ ఏడాది ఎగువ నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకుగాను బుధవారం ఉదయానికి 212 టీఎంసీలు నమోదైంది. దీంతో గురువారం నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 

లక్ష్యాన్ని చేరుకుంటాం... 
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఎగువ నుంచి కృష్ణానదికి ఆశించిన మేర వరద వస్తోంది. కొన్నేళ్లుగా వరద సరిగా లేకపోవడంతో జూరాల మినహా మిగతా పవర్‌ ప్రాజెక్టుల్లో లక్ష్యం మేర ఉత్పత్తి చేయలేకపోయాం. కానీ ఈసారి శ్రీశైలం ఇప్పటికే నిండుకుండలా మారగా.. నాగార్జునసాగర్‌కు కూడా నీటి నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని పవర్‌ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్‌ ఉత్పత్తిలో లక్ష్యం చేరుకుంటాం.     – సురేష్, సీఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement