Hydro Power Project
-
భూటాన్‌లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్‌లో ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి
కఠ్మాండు: నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి మొదలైంది. రుతు పవనాల రాకతో ప్రాజెక్టులు నిండి నేపాల్‌లోని జల విద్యుత్ కర్మాగారాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దీంతో, 600 మెగావాట్ల మిగులు కరెంటును శనివారం నుంచి భారత్‌కు విక్రయిస్తున్నామని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతినిధి తెలిపారు. నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారానే ఎక్కువగా కరెంటు ఉత్పత్తవుతుంది. డిమాండ్ తక్కువగా ఉండే వేసవి కాలంలో విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే శీతాకాలంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. గత ఏడాది జూన్– నవంబర్ మధ్యలో భారత్‌కు విద్యుత్ ఎగుమతి ద్వారా రూ.1,200 కోట్లను ఆర్జించింది. కొన్ని రోజుల క్రితం డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్ కొనుగోలు చేసింది. -
వినూత్న విద్యుత్.. పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతతో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అధునాతన రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ప్రైౖవేటు సెక్టర్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ ఇటువంటి ప్రాజెక్టునే స్థాపిస్తోంది. 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. దీని కోసం కేవలం ఒక టీఎంసీ నీరు సరిపోతుంది. ఇలా ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే ఇది పెద్దది. ఈ నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల సాంకేతికత, వాటి ప్రయోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉత్పత్తి చేస్తుంది.. నిల్వ చేస్తుంది పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ (పీఎస్‌హెచ్) ఒక రకంగా జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. వీటి మధ్య టర్బైన్ల గుండా నీరు ఒకదాని నుండి మరొక దానికి (డిశ్చార్జ్) కదులుతున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది శక్తిని నిల్వ చేయగలదు, అవసరమైనప్పుడు దానిని విడుదల చేయగలదు. ఎగువ రిజర్వాయర్ (రీచార్జ్) లోకి నీటిని తిరిగి పంప్ చేస్తున్నందున దానికి అవసరమైన విద్యుత్‌ను అందించానికి పీఎస్‌హెచ్ ఒక పెద్ద బ్యాటరీలా పనిచేస్తుంది. రెండు విధాల పని ఈ విద్యుదుత్పత్తి కేంద్రాలు జలాశయాల్లోని నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఎక్కువ నీరు అవసరం ఉండదు. విద్యుత్ ఉత్పత్తికి ఎగువ జలాశయం నుండి జనరేటర్‌ని తిప్పే టర్బైన్ల ద్వారా నీరు ప్రవహించి, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్‌లోకి నీటిని తిరిగి పంప్ చేయడానికి టర్బైన్లు వెనుకకు తిరుగుతాయి, అప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా రెండు విధాలా ఉపయోగకరంగా ఉంటాయి. హైడ్రో పవర్‌తో ఇవీ ప్రయోజనాలు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందికి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తక్కువ గాలి, సూర్యరశ్మి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభదాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ ప్లాంట్లు సామర్థ్యంలో 82 శాతం వరకు పని చేస్తాయి. 80 సంవత్సరాలకంటే ఎక్కువ జీవితకాలం దీని అదనపు ప్రయోజనం. సౌర విద్యుత్ సూత్రమిది ప్రపంచంలో ఒక సంవత్సరం ఉపయోగించే విద్యుత్ కంటే ఒక గంటలో వెలువడే సౌర శక్తి ఎక్కువ. కానీ అంత విద్యుత్‌ను మనం వినియోగించుకోలేము. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సోలార్ పానెల్‌లోని ఫొటో వోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలక్ట్రాన్లుగా మార్చి విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక్కో మాడ్యూల్ ఒకటిన్నర చదరపు మీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. అది 40–60 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 4–12 శాతం లాస్ అవుతుంది. గాలి చేసే మేలు పవన విద్యుత్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మూడు రెక్కలు గల గాలి మరను దీనికోసం వాడుతుంటారు. మన పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందు నుంచీ నావలను నడపడానికి, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్ శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌తో పోలిస్తే తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు. సౌర విద్యుత్‌తో మరింత ఉపయోగం భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల విద్యుత్ సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగెళ్లిపోతాయి. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్‌ను హీట్ ఇంజన్ (ఉష్ణోగ్రత భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది)ల నుంచి, ఫొటో వోల్టాయిక్ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. చిన్న, మధ్య తరహా అవసరాల కోసం మొదట్లో ఫోటో వోల్టాయిక్స్నే వాడేవారు. ఆ తరువాత వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ప్లాంట్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో లక్షలకొద్దీ సౌర ఫలకాలు విద్యుత్ గ్రిడ్‌లో భాగం కావడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఫొటో వోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడలో ఉంది. ఇది ఏటా 2,050 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. -
ఉత్తరాఖండ్ వలసలకు కాంగ్రెస్ కారణం
డెహ్రాడూన్: కేంద్రంలో, రాష్ట్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రాజెక్టులను జాప్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వల్ల ఉత్తరాఖండ్ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేతబట్టుకొని వలసలు పోవాల్సివచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి రాష్ట్రాన్ని దోచుకోవడం మీదనే శ్రద్ధ ఉండేదని, అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని నిప్పులు చెరిగారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆయన రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆరంభించడం, శంకుస్థాపన చేశారు. వీటిలో రూ. 5,747కోట్ల విలువైన లఖ్వార్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కూడా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన 1974లోదని, కానీ కార్యరూపం దాల్చేందుకు ఇన్నాళ్లు పట్టిందని మోదీ గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాపమని, దీన్ని ప్రజలు మర్చిపోరని విమర్శించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటామని, విపక్షాలు స్వీయ ప్రయోజనాలు చూసుకుంటాయని ఎద్దేవా చేశారు. రావత్‌పై ఆరోపణలు రాష్ట్ర కాంగ్రెస్ నేత హరీశ్ రావత్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు. 2016లో రెబల్ ఎంఎల్ఏల కొనుగోలుకు రావత్ బేరాలాడుతున్న వీడియో గతంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని దోచుకోండి కానీ తన ప్రభుత్వాన్ని కాపాడండి అని రావత్ భావించేవారని మోదీ విమర్శించారు. తాను ముందుగా ఇచ్చిన హామీల మేరకే ప్రస్తుత ప్రాజెక్టులు చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడతానని చెప్పారు. ఈ పర్యటనలో ఆయన రూ. 3,420 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆరంభించారు. అదేవిధంగా రూ. 14,127 కోట్ల ప్రాజెక్టులకు పునాది వేశారు. ఆరంభించిన ప్రాజెక్టుల్లో మొరాదాబాద్ కాశీపూర్ రోడ్డు, కుమావ్‌లో ఎయిమ్స్ శాటిలైట్ సెంటర్ తదితరాలున్నాయి. ఈ నెల్లో మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. నెలారంభంలో ఆయన రూ.18వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించారు. -
Hydero Power: 100% జల విద్యుత్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వాటి స్థాపిత సామర్థ్యంలో గరిష్టంగా 100% వరకు ఉత్పత్తి జరపాల్సిందిగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో ఈ అంశంపై చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘రాష్ట్ర రైతాంగం ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి జలాలను ఎత్తిపోయ డం తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదు. దీనికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 2,500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల నుంచి చాలా తక్కువ విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని 100% స్థాపిత సామర్థ్యంతో జలవిద్యుదుత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ జెన్కో సీఎండీని ఆదేశించారు. సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తి: జెన్కో సాగు ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల విని యోగం విషయంలో గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నడుస్తుండ డం, ఇటీవల తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి లభ్యత, రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు జలవిద్యుదుత్పత్తి చేశామని, ప్రభుత్వ ఆదేశాలతో సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్ర జెన్కోకు కేఆర్ఎంబీ లేఖ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం తక్షణమే నిలిపి వేయాలని కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో హైడల్ విభాగం డైరెక్టర్‌కు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విద్యుదుత్పత్తి చేస్తుండగా, ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువకు నీటి విడుదలను నిలుపుదల చేయాలని ఈ నెల 23న కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీశైలం జలాశయానికి వచ్చిన మొత్తం 8.98 టీఎంసీల జలాల్లో 3.09 (34శాతం) టీఎంసీలను జల విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ కిందకు విడుదల చేసిందని, శ్రీశైలంలో కనీస నిర్వహణ స్థాయి అయిన 834 అడుగుల కన్నా తక్కువగా నీటి మట్టం ఉందని పేర్కొంటూ అదేరోజు ఏపీ ప్రభుత్వం మరోసారి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
స్వయంకృతం
వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తిన సందర్భం కాదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ కాదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ను జల విలయం ముంచెత్తింది. దేవభూ మిగా పిలుచుకునే ఆ రాష్ట్రానికి తీరని విషాదం మిగిల్చింది. ఇంతవరకూ 26 మంది మృతులను లెక్కేయగా, దాదాపు 171 మంది జాడ తెలియలేదంటున్నారు. హఠాత్తుగా వచ్చిన వరదల్లో జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలోని తపోవన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, రిషిగంగ హైడ్రో పవర్ ప్రాజెక్టు ధ్వంసం కాగా, మరికొన్ని డ్యామ్‌లు, రోడ్లు, బ్రిడ్జిలు, సొరంగం, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండాపోయినవారిలో అత్యధి కులు తపోవన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులేనని సమాచారం అందుతోంది. ఆ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్ నుంచి 20మందిని కాపాడగలిగారు. ఉత్తరాఖండ్‌కు ఇది మొదటి విషాదం కాదు. ఎనిమిదేళ్లనాడు సైతం ఆ రాష్ట్రం ఇలాంటి విపత్తునే చవిచూసింది. ఎన్ని సాధించినా ప్రకృతి ముందు మనిషి పిపీలకం. దాని ఆగ్రహాన్ని చల్లార్చటం ఎవరి తరమూ కాదు. కావాలని ప్రకృతితో దోబూచులాడటానికి ప్రయత్నించి, పనిగట్టుకుని దాన్ని రెచ్చ గొడితే పర్యవసానాలు అసాధారణ రీతిలో వుంటాయి. ఇప్పుడు జరిగిందదే. అలక్‌నందా పరివాహ ప్రాంతంలో హిమనదీ సంబంధమైన సరస్సులు ఇరవై వరకూ వున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమఖండాలు కరగటం వల్ల ఏర్పడే జలాలు ఎక్కడికక్కడ ఇలా సరస్సులుగా ఏర్పడతాయి. వీటితో అత్యంత జాగురూకతతో మెలగాలని, అవి ఎప్పుడో అప్పుడు కట్టుదాటి నదీ ప్రవాహంలో కలిసి దిగువ ప్రాంతాల్లో తీరని నష్టం కలగజేసే ప్రమాదం వుందని కూడా హెచ్చరించారు. ఈ ముప్పును కనిష్ట స్థాయిలో వుంచేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలేమిటో కూడా సూచించారు. కానీ పట్టించుకున్నవారెవరు? 2013లో పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ల సమీపంలో భారీ వర్షాలు పడటంతో గంగ, భాగీరథి, మందాకిని, అలక్‌నంద వంటి నదులన్నీ మహోగ్రరూపమెత్తి జనావాసాలపై విరుచుకుపడ్డాయి. వందలాదిమంది ప్రాణాలు తీశాయి. అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకూ చెందినవారు కూడా తీర్థయాత్రలకెళ్లిఆ వరదల్లో చిక్కుకుని నరకయాతన చవిచూశారు. రోజుల తరబడి సాయం అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సహాయ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడానికి కూడా చాలా రోజులు శక్యం కాలేదు. కానీ దాన్నుంచి అక్కడి ప్రభుత్వం నేర్చుకున్నదేమిటి? తీసుకున్న చర్యలేమిటి? వాటి మాటెలావున్నా యధాప్రకారం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నించింది. రాష్ట్రంలో అప్పటికే వంద లాది జల విద్యుత్ ప్రాజెక్టులున్నా పెండింగ్‌లోవున్న పది హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతిని వ్వాలని మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ హిమానీ నదాల్లోకి ఎప్పటి కప్పుడు నీరు చేరుతుంటుంది. అందునా శీతగాలులు బలంగా వీస్తున్న ప్రస్తుత సమయంలో అవి అంత త్వరగా కరగవు. పర్యావరణం దెబ్బతింటున్న వర్తమానంలో అటువంటి సహజసిద్ధమైన ప్రక్రియను ఊహించలేం. వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుంటే, అడవులు తగలబడి దాన్ని మరింత పెంచుతుంటే ఆ హిమఖండాలు మోతాదుకు మించి కరగటం సర్వసాధారణం. అలాగే కుంభవృష్టి సైతం సరస్సు మట్టాలను పెంచి నదుల్లోకి భారీ వరద నీరు చేరుతుంది. ఇవి చాలవన్నట్టు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం డైనమైట్లతో కొండలను పిండి చేస్తుంటే, ఆ ప్రకంపనల ధాటికి హిమఖండాలు ఒక్కసారిగా విరిగిపడే ప్రమాదం వుంటుంది. 2013 విషాదం తర్వాత ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన స్విస్ శాస్త్రవేత్తల బృందం హిమాలయ సానువుల్లో మొత్తం 251 హిమానీ నదాల సరస్సులున్నాయని తేల్చింది. వీటిల్లో 104 అత్యంత ప్రమాద కారులని, అలక్‌నంద సమీపంలో ఇవి 20 వరకూ వున్నాయని చెప్పారు. వీటివల్ల ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పలక హిమఖండం నుంచి వేరుపడటంతో ఒక్కసారిగా సరస్సులోని జల మట్టం పెరిగి వరదలు పోటెత్తి వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విషాద ఘటన జరిగిన ఆదివారంగానీ, అంతకుముందు రోజుగానీ ఆ ప్రాంతంలో వర్షాలు లేవు. ఉత్తరాఖండ్ ఉదంతం ప్రకృతి పట్ల మన అవగాహనను పెంచాలి. దానిపట్ల భయభక్తులతో వ్యవహరిస్తేనే... దాని సహనాన్ని పరీక్షించకుండా వున్నప్పుడే అది మనల్ని చల్లగా చూస్తుందన్న ఎరుక కలగాలి. హిమానీ నదాల్లో ప్రకృతిపరంగా జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గ్రహించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయటం, హెచ్చరిక వ్యవస్థలను అమలులోకి తీసుకు రావటం, జలవిద్యుత్ ప్రాజెక్టుల సంఖ్యను బాగా కుదించటం, అన్ని రకాల అక్రమ నిర్మాణాలు ఆపటం వంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించగలుగుతాం. 2011లో స్వామి నిగమానంద గంగానదిని మాఫియాలనుంచి రక్షించాలని నాలుగు మాసాలపాటు ఆమరణ దీక్ష సాగించి ప్రాణాలు బలిపెట్టారు. కానీ ఆయన పరిత్యాగం నుంచి ఉత్తరాఖండ్ నేర్చుకున్నదేమీ లేదు. ఇప్పటికైనా పాలకులకు వివేకం కలగాలని ఆశిద్దాం. -
బ్రహ్మపుత్రపై భారత్ రిజర్వాయర్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. యర్లుంగ్ త్సంగ్ బో(బ్రహ్మపుత్ర) నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని జల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నదీ జల వివాదాలు కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!
న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు కూడా కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను... సమావేశానంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు తెలిపారు. దేశంలో జలవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ హోదా 25 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులకే ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉంటే ఆర్థిక సహకారం, తక్కువ వడ్డీకి రుణాలు వంటి పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో సోలార్, పవన, 25 మెగావాట్ల వరకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు కలిపి 74 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనికి అదనంగా 45 గిగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తోడు కానుంది. 2022 నాటికి 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే, భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులక్కూడా ఈ హోదాను కట్టబెట్టడంతో 2022 నాటికి 225 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ విభాగంలో సాధించనుంది. ప్రాజెక్టుల జీవితకాలాన్ని 40 ఏళ్లకు పెంచుకుని, టారిఫ్ రేట్లు తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు వీలు కల్పిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి 18 ఏళ్లకు పెరుగుతుంది. ప్రస్తుతం జలవిద్యుత్ టారిఫ్‌లు ఇతర వనరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో ఇకపై ఇవి క్రమబద్ధీకరణ చెందనున్నాయి. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను డిస్కమ్‌లకు విక్రయించగలుగుతాయి. డిస్కమ్‌లు నిర్ణీత శాతం మేర రెన్యువబుల్ ఎనర్జీని కొనుగోలు చేయాలి. లేదంటే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 200 మెగావాట్ల వరకు ఒక్కో మెగావాట్‌కు రూ.1.5 కోట్లు, అంతకుమించితే ఒక్కో మెగావాట్‌కు రూ.కోటి మేర నిధుల సాయానికి కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ల్యాంకో తీస్తా ప్రాజెక్టు ఎన్హెచ్పీసీకి ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌ను ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలు చేసేందుకు సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సిక్కింలోని తీస్తా స్టేజ్–6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై ఎన్‌హెచ్‌పీసీ రూ.5,748 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇందులో ల్యాంకో తీస్తా హైడ్రో ప్రాజెక్టు కొనుగోలుకు రూ.907 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనుల పూర్తికి గాను రూ.3,863 కోట్లను ఖర్చు చేయనుంది. 125 మెగావాట్ల నాలుగు యూనిట్లతో కూడిన (500 మెగావాట్లు) ఈ ప్రాజెక్టులో ఏటా 2,400 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఉన్న చీనాబ్ నదిపై చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ 624 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,287 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఎన్‌హెచ్‌పీసీ రూ.630 కోట్ల పెట్టుబడులతో వాటా తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పునాదిరాయి వేసిన విషయం గమనార్హం. థర్మల్ ప్రాజెక్టులు బిహార్‌లోని బుక్సర్‌లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్‌జేవీఎన్ అనుబంధ కంపెనీ ఎస్‌జేవీఎన్ థర్మల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతుందని సీసీఈఏ పేర్కొంది. 2023–24 నుంచి ఈ ప్రాజెక్టు పనిచేయడం ఆరంభమవుతుంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 660 మెగావాట్ల రెండు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వాటాల అమ్మకంపై అంతిమ అధికారం కమిటీకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు విక్రయించాలి, ధర, ఎంత మొత్తం షేర్లను విక్రయించాలన్న నిర్ణయాలను ఈ యంత్రాంగం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది. ఇందులో రవాణా మంత్రి, సంబంధిత కంపెనీపై అధికారాలున్న శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. కేవలం నియమ, నిబంధనలనే ఈ కమిటీ ఇప్పటి వరకు నిర్ణయిస్తుండేది. సీసీఈఏ తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వరంగ సంస్థను ఎంత ధరకు విక్రయించాలి, ఎన్ని వాటాలను విక్రయించాలన్న నిర్ణయాలను కూడా ఏఎం తీసుకోనుంది. దీంతో వేగంగా విక్రయం సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. పవన్‌హన్స్, ఎయిర్ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, భారత్ పంప్స్ కంప్రెషర్స్, సెయిల్‌కు చెందిన పలు యూనిట్లలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. -
జోరుగా జల విద్యుత్ ఉత్పత్తి
సాక్షి, వనపర్తి: కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా.. నాగార్జునసాగర్‌లో గురువారం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. పులిచింతల ప్రాజెక్టులోకి కూడా సమృద్ధిగా నీరు వస్తుండటంతో జల విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా విద్యుదుత్పత్తిలో లక్ష్యం చేరుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్యం దిశగా... కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించగానే ఉండే తొలి ప్రాజెక్టు జూరాల. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యం లో ఎగువ జూరాల పవర్ ప్రాజెక్టు ప్రారంభం నుంచే నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభంకాగానే ఒక నెల కర్ణాటక, మరో నెల తెలంగాణ విద్యుత్‌ను వాడుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణానదిపై బండ్ నిర్మించారు. దీని ద్వారా నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేసేందుకు 240 మెగావాట్ల సామర్థ్యంతో దిగువ జూరాల పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా అందులోనూ విద్యుదు త్పత్తి జరుగుతోంది. ఈ 2 ప్రాజెక్టుల్లో కలిపి ఈ ఏడాది 400 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 170 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. వరద ఆశాజనకంగా ఉండటంతో మరిన్ని రోజులు ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉంది. 2017–18లో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 360 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 417 మిలియన్ యూనిట్ల రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈసారి దీనిని అధిగమించాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ఏడాది 1,150 మిలియన్ యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 230 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో వరద లేకపోవడం వల్ల క్రస్టు గేట్లు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెరుచుకోలేదు. అయితే ఈ ఏడాది ఎగువ నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకుగాను బుధవారం ఉదయానికి 212 టీఎంసీలు నమోదైంది. దీంతో గురువారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యాన్ని చేరుకుంటాం... తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎగువ నుంచి కృష్ణానదికి ఆశించిన మేర వరద వస్తోంది. కొన్నేళ్లుగా వరద సరిగా లేకపోవడంతో జూరాల మినహా మిగతా పవర్ ప్రాజెక్టుల్లో లక్ష్యం మేర ఉత్పత్తి చేయలేకపోయాం. కానీ ఈసారి శ్రీశైలం ఇప్పటికే నిండుకుండలా మారగా.. నాగార్జునసాగర్‌కు కూడా నీటి నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని పవర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యం చేరుకుంటాం. – సురేష్, సీఈ -
కృష్ణా జలాలపై రెండో రోజూ కొనసాగిన విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం కూడా విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు న్యాయవాది వైద్య నాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని కూడా ఏపీ తరలిస్తోందన్న ఆరోపణల్లో నిజం లేదని, ఇక్కడ కృష్ణా నది నిర్వహణ బోర్డు ఆదేశాల మేరకే నీటి విడుదల జరుగుతోందని వైద్యనాథన్ అడిగిన ప్రశ్నకు సుబ్బారావు బదులిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టు కావడం వల్ల ఇక్కడి నుంచి నీటి తరలింపునకు ఆస్కారం లేదని జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు అంశమే తలెత్తదు కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. ఇది న్యాయపరిధిలోని అంశమని సుబ్బారావు సమాధానమిచ్చారు. వరద సమయంలో మిగులు జలాల తరలింపునకు అదనపు సామర్థ్యం పెంచడం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెల్ 880 అడుగులకు చేరుతుంది కదా అని ప్రశ్నించగా.. సామర్థ్యం పెంపు అనే ది డిజైనర్ల నిర్ణయమని సుబ్బారావు చెప్పారు. హెడ్‌రెగ్యులేటర్ సిల్ స్థాయి 841 అడుగులే ఉండాలని డిజైనర్లకు సూచించారా? అని ప్రశ్నించగా.. ఇది నిజం కాదని సుబ్బారావు తెలిపారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది. -
హైడ్రో పవర్లో హైఓల్టేజీ డీల్స్!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్: జేపీ గ్రూప్‌నకు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను రూ. 12,300 కోట్లకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ కొనుగోలు చేయడంతో స్థానిక పారిశ్రామిక వేత్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రూ. లక్ష కోట్ల రుణ భారంతో తల్లడిల్లుతున్న జీఎంఆర్, ల్యాంకో, జీవీకే లాంటి సంస్థలకు ఈ పరిణామాలు ఎంతో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టిన పలు విద్యుదుత్పాదన సంస్థలు తమ వాటాల విక్రయానికి సుముఖుత చూపుతున్నాయని పవర్ ప్రాజెక్టుల కన్సల్టెంట్ పీపీ రావు తెలిపారు. తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కేఎస్కే ఎనర్జీ, సాయి కృష్ణోదయా , కోస్టల్ ప్రాజెక్ట్స్, జీఎంఆర్, ఎథీనా ఎనర్జీ వెంచర్స్, నవయుగ ఇంజీనీరింగ్, సోమ ఎంటర్‌ప్రెజైస్ లాంటి సంస్థలు బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్కేంద్రాలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టులు నిర్వహించేందుక అవసరమైన వనరులు సకాలంలో సమీకరించలేకపోవడంతో పలు కంపెనీలు మధ్యలో నే ఆపేశాయి. హైదరాబాద్‌కు చెందిన సర్వోమ్యాక్స్ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన మినీ హైడల్ పవర్ప్రాజెక్టు నిర్మాణంలో బాలారిష్టాలు దాటి పురోగతి సాధించిన స్థానిక సమస్యల కారణంగా ఇటీవలే ప్రాజెక్టు కార్యాలయాన్ని మూసేసింది. జీవీకే పవర్ సంస్థకు జమ్ము కాశ్మీర్లో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (850 మెగావాట్ల), ఉత్తరాఖండ్‌లో శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (330 మెగావాట్లు), బోగుడియార్ శ్రీకార్ భోల్ (146 మెగావాట్లు), మాపాంగ్ బోగుడియార్ (200 మెగావాట్ల) హౌడ్రో పవర్ ప్రాజెక్టులున్నాయి. జీఎంఆర్ సంస్థకు నేపాల్‌లో అప్పర్ కునాలి (900 మెగావాట్ల) ప్రాజెక్టు, హిమతాల్ (600 మెగావాట్ల) ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్‌లో తెలాంగ్లో జీఎంఆర్ ఎనర్జీ (225 మెగావాట్లు) జలవిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. జీఎంఆర్ ఎనర్జీకి ఉత్తరాఖండ్లోనిఅలకనందాలో 300 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది. ల్యాంకో గ్రూప్‌నకు ఉత్తరాఖండ్‌లో ఫటా బీయుంగ్ (76 మెగావాట్లు), రంబారా (76 మెగాయూనిట్లు), ల్యాంకో మందాకినీ హైడ్రో పవర్ ( 76 మెగావాట్లు), సిక్కిం రాష్ట్రంలో ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ (500 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్‌లోని బుడిల్ ప్రాజెక్టు (70 మెగావాట్లు)లు ఉన్నాయి. అరుణాచల్ ప్రాజెక్టుల ఆకర్షణ ఇదీ... జమ్ము కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుత్ వనరులను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2008లో హైడ్రో పవర్ అభివృద్ధి విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో దీటుగా ప్రైవేట్ సంస్థలకూ పలు రాయితీలను ప్రకటించారు. అందులో ప్రధానంగా కాస్ట్ ప్లస్ టారిఫ్ విధానం. దీని ప్రకారం విద్యుత్కేంద్రంపై వెచ్చించిన వ్యయాలను డెవలపర్ రాబట్టుకునేందకు వీలుగా సేలబుల్ ఎన ర్జీలో 40 శాతం మర్చంట్ విక్రయాల రాయితీని ప్రకటించారు. మరో ఆకర్షణ మెగా పవర్ ప్రాజెక్టు పాలసీ. సాధారణంగా మెగా పవర్ ప్రాజెక్టు స్థాయి పొందాలంటే కనీసం వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉండాలి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సామర్థ్యాన్ని 350 మెగా వాట్లకే కుదించారు. మెగాపవర్ ప్రాజెక్టులకు క్యారేజీ టారిఫ్‌లో పది శాతం పన్ను రాయితీ ఉంటుంది. జీఎంఆర్ జల విద్యుత్కేంద్రాలను గుజరాత్‌కు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయనుందన్న మార్కెట్ వర్గాల సమాచారంపై జీఎంఆర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం తాము ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అధికార వివరణ ఇవ్వలేమని సాక్షి ప్రతినిధికి తెలిపారు. అలాగే ల్యాంకో పవర్‌కు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరశింహన్ స్పందిస్తూ ఇది పూర్తిగా నిరాధారమూ, ఊహా జనితమైన మార్కెట్ కల్పన అని అన్నారు. అయితే జేపీ-రిలయన్స్ పవర్ డీల్ నేపథ్యంలో స్థానిక కంపెనీలు కూడా వాటి విద్యుత్ ప్రాజెక్టులను విక్రయించవచ్చనే మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. జేపీ డీల్‌ను మిస్సయిన ఆదాని గ్రూప్ వీటిలో కొన్ని హైడ్రో ప్రాజెక్టుల కొనుగోలుకు ముందుకు రావచ్చన్నది ఆ వర్గాల సమాచారం. -
తమిళనాడు సహకరిస్తే హైడ్రో పవర్ ప్రాజెక్ట్
సిప్కాట్, న్యూస్‌లైన్ : తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే హొగేనకల్ వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కర్ణాటక సిద్ధంగా ఉందని కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి డి.కే.శివకుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హొసూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏళ్ల తరబడి నానుతున్న రాజకీయ కారణాల వల్ల తెరమరుగైన హొగేనకల్ సమీపంలో కావేరి నదిపై ఏర్పాటు చేయాల్సి ఉన్న హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ కొరత ఉండదని అన్నారు. బెంగళూరుకు అతిచేరువలో ఉన్న హొసూరు పట్టణం ఎంతో అభివద్ధి చెందిందని ఆయన అన్నారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయడం వ ల్ల కృష్ణగిరి జిల్లా ప్రజలకు ఉపాధి పెరిగిందని ఆయన అన్నారు. కృష్ణగిరి జిల్లా ప్రజలు విద్య, వైద్యం తదితర వాటికి సమీపంలోని బెంగళూరు వస్తున్నారని, కర్ణాటకతో కృష్ణగిరి జిల్లా ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లుగా పేదల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 20 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పాలిస్తున్నప్పటికీ హొసూరు ప్రాంత ప్రజలు ఈ రెండు పార్టీలను కాదని ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. దేశంలో సుపరిపాలన అందించేకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెల్లకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. బెంగళూరు నుంచి హొసూరు గ్రామీణ ప్రాంతాలకు అదనంగా బస్సులు ఏర్పాటుకు సంబంధించి శివకుమార్ మాట్లాడుతూ రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి చొరవతో బెంగళూరు, హొసూరుకు ఇప్పటికే 60 బస్సులు అదనంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.