సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వాటి స్థాపిత సామర్థ్యంలో గరిష్టంగా 100% వరకు ఉత్పత్తి జరపాల్సిందిగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో ఈ అంశంపై చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘రాష్ట్ర రైతాంగం ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి జలాలను ఎత్తిపోయ డం తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదు. దీనికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 2,500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల నుంచి చాలా తక్కువ విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని 100% స్థాపిత సామర్థ్యంతో జలవిద్యుదుత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ జెన్‌కో సీఎండీని ఆదేశించారు.
సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తి: జెన్‌కో
సాగు ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల విని యోగం విషయంలో గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నడుస్తుండ డం, ఇటీవల తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి లభ్యత, రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు జలవిద్యుదుత్పత్తి చేశామని, ప్రభుత్వ ఆదేశాలతో సాధ్యమైనంత అధికంగా ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
రాష్ట్ర జెన్‌కోకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం తక్షణమే నిలిపి వేయాలని కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సోమవారం మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ జెన్‌కో హైడల్ విభాగం డైరెక్టర్‌కు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విద్యుదుత్పత్తి చేస్తుండగా, ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువకు నీటి విడుదలను నిలుపుదల చేయాలని ఈ నెల 23న కేఆర్‌ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీశైలం జలాశయానికి వచ్చిన మొత్తం 8.98 టీఎంసీల జలాల్లో 3.09 (34శాతం) టీఎంసీలను జల విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ కిందకు విడుదల చేసిందని, శ్రీశైలంలో కనీస నిర్వహణ స్థాయి అయిన 834 అడుగుల కన్నా తక్కువగా నీటి మట్టం ఉందని పేర్కొంటూ అదేరోజు ఏపీ ప్రభుత్వం మరోసారి కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment